వేదనలోంచి పుట్టుకొచ్చిన ఆలోచ.. మొక్క జొన్న పొట్టుతో ఉత్పత్తులు!

by Javid Pasha |

సాధారణంగా రైతులు మొక్కజొన్న పొట్టును కాల్చి వేస్తుంటారు. ఇది గమనించిన నాజ్ ఒజైర్ దానితో బయోడీగ్రేడబుల్ ఉత్పత్తులను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.

వేదనలోంచి పుట్టుకొచ్చిన ఆలోచ.. మొక్క జొన్న పొట్టుతో ఉత్పత్తులు!
X

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, ప్యాకేజింగ్ కవర్లు తరచుగా వాడటం ఎంత డేంజరో తెలిసిందే. వీటిలోని హానికారక రసాయనాలు అనారోగ్యాలకు, ముఖ్యంగా క్యాన్సర్లకు కారణం అవుతుంటాయి. బిహార్‌‌కు చెందిన ఓ ఇంజినీర్ కూడా తన జీవితంలో ఇలాంటి చేదు అనుభాన్ని ఎదుర్కొన్నాడు. తన చిన్నారి మేనల్లుడు క్యాన్సర్‌తో మరణించడం అతన్ని తీవ్రంగా కలచి వేసింది. అయితే ఈ బాధలోంచి, ఈ వేదనలోంచి ఒక కొత్త ఆలోచన మొదలైంది. అది అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. ఎంతోమందిని క్యాన్సర్ ప్రమాదాల నుంచి కాపాడుతోంది. ఇంతకీ అదేమిటి? అతను సాధించిన సక్సెస్ ఏమిటి?

పర్యావరణంపై ఆసక్తితో..

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లా, మురాద్‌పూర్ గ్రామానికి చెందిన నాజ్ ఒజైర్ ఒక మెకానికల్ ఇంజినీర్. 2019లో తన మేనల్లుడు క్యాన్సర్‌తో మరణించడం అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ సంఘటనే అతడిని ప్లాస్టిక్ ఉత్పత్తులపై పరిశోధన చేయడానికి ప్రేరేపించింది. ఈ క్రమంలో ప్లాస్టిక్‌తో తయారుచేసే ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ప్రమాదకరమైనవని గుర్తించాడు. సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయం కోసం సెర్చ్ ప్రారంభించాడు. దీనికి చక్కటి పరిష్కారం బిహార్ పొలాల్లోనే లభించింది అతనికి.

వైఫల్యాలను అధిగమించి..

సాధారణంగా రైతులు మొక్కజొన్న పొట్టును కాల్చి వేస్తుంటారు. ఇది గమనించిన నాజ్ ఒజైర్ దానిని ఉపయోగించి బయోడీగ్రేడబుల్ ఉత్పత్తులను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం నెలకు రూ. 60 వేలు సంపాదించే తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. ఐదేండ్లు నిరంతరం ప్రయోగాలు చేశాడు. అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నాక ఒక సరికొత్త ఆవిష్కరణకు తెరతీశాడు. ‘Corn Husk Biodegradable Products’పేరుతో ఒక స్టార్టప్ ప్రారంభించి, మొక్క జొన్న పొట్టుతో చాక్లెట్ ర్యాపర్లు, కప్పులు, ప్లేట్లు, బ్యాగులు, బ్యానర్లు వంటివి తయారు చేయడం మొదలు పెట్టాడు. క్రమంగా పేటెంట్ హక్కును సైతం పొందాడు.

బాధలో పుట్టిన పరిష్కారం

ప్రస్తుతం నాజ్ ఒజైర్ స్టార్టప్ పర్యావరణ అనుకూలమైన, ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులకు నిలయంగా మారింది. కేవలం మొక్కజొన్న పొట్టుతో, వ్యర్థాలతో కప్పులు, ప్లేట్లు, ప్యాకేజింగ్ కవర్లు, బ్యాగులు తయారు చేస్తోంది. రోజుకు వెయ్యికి పైగా అమ్మకాలు సాగిస్తోంది. స్థానిక రైతులకు సైతం ఆదాయం కల్పిస్తోంది. ఇటీవల ఇండియన్ రైల్వేస్ నుంచి రూ. 30 లక్షల ఆర్డర్ కూడా అందుకున్నది. ఇందంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. కొన్నిసార్లు వ్యక్తిగత అనుభవాల నుంచి, వేదనల నుంచి, బాధల నుంచి కూడా సమాజానికి, పర్యావరణానికి మేలు చేసే ఆవిష్కరణలు, పరిష్కరాలు పుట్టకొస్తాయి. నాజ్ ఒజైర్ సక్సెస్ జర్నీ అదే నిరూపించింది. అతని ఆలోచన, కృషి, పట్టుదల, విజయం నేటి యువతకు ఒక ప్రేరణగా నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story