- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైపిస్ట్ కూతురు.. ఐపీఎస్ ఆఫీసర్.!
అంజన ఇప్పుడు మహారాష్ట్రలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తోంది

దిశ, ఫీచర్స్: సాధారణ కుటుంబ నేపథ్యమే ఉన్నా.. కలలు పెద్దవిగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని నిరూపించింది కేరళకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. వాళ్ల నాన్నకు చిన్న బట్టల దుకాణం ఉండేది. వాళ్లమ్మ టైపిస్టుగా పనిచేసేది. అలాంటి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన అంజన ఇప్పుడు మహారాష్ట్రలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తోంది.
యూపీఎస్సీ వైపు..
కేరళ రాజధాని తిరువనంతపురంలో 1990లో పుట్టింది అంజన. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉందనే విషయాన్ని చిన్నప్పుడే గుర్తించింది. తల్లి సీనా కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తుండేది. వాళ్ల నాన్న బిజు చిన్న బట్టల దుకాణం నడిపేవాడు. పేద మధ్యతరగతి కుటుంబమే అయినా చదువు.. క్రమశిక్షణ.. నిజాయితీ.. సామాజిక సేవ అనే విలువల్ని తనకు చిన్నప్పుడే నేర్పించారు. పూజప్పురలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్‌లో చదువు పూర్తిచేసిన అంజన.. నీరమంకరలో బీఎస్సీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే దేశసేవ చేయాలనే కల ఉండేది. ఆ కలే తనను యూపీఎస్సీ వైపు నడిపించింది.
ఆలిండియా 355 ర్యాంక్..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఎంత కష్టమో అందరికీ తెలుసు. సంవత్సరాల తరబడి చదవాలి. మానసికంగా చాలా బలంగా ఉండాలి. అన్నింటికంటే మించి ఓపిక ఉండాలి. అంజనకు యూపీపీఎస్సీ కేవలం పరీక్ష మాత్రమే కాదు. తను అదొక మిషన్. వేరే ఇతర విషయలేవీ పట్టించుకోకుండా ఏకాగ్రతతో.. రాత్రి పగలు ప్రిపేరైంది. 2022లో జరిగిన పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 355 సాధించింది. ఈ ర్యాంక్ తనను ఇండియన్ పోలీస్ సర్వీస్ వైపు తీసుకెళ్లింది. లక్షల మంది పోటీపడే ఈ పరీక్షలో ర్యాంక్ సాధించడం మామూలు విషయం కాదు.
ఐపీఎస్‌గా ఆఫీసర్..
2023 బ్యాచ్ ఐపీఎస్‌గా చేరిన అంజనా కృష్ణ కఠినమైన శిక్షణ పూర్తిచేసి నాయకత్వం.. క్రమశిక్షణ.. పరిపాలనా నైపుణ్యాలు సంపాదించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తిరువనంతపురం బస్తీల్లో పెరిగిన అంజన ఐపీఎస్ ఆఫీసర్ వరకు ఎదిగిందంటే ఆ గెలుపు కోసం తాను తీసుకున్న రిస్క్.. శ్రద్ధ.. శ్రమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు.. సామాజిక అడ్డంకులు మన లక్ష్యాన్ని ఆపలేవని అంజన విజయం నిరూపిస్తోంది. నిజాయితీతో ఉంటే ఎలాంటి దాన్నయినా సాధించవచ్చని చెప్తోంది.






