- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక నాన్న.. కూతురు మధ్య ఉండే నిజాయితీగల ప్రేమకు సాక్ష్యం
నాన్న కళ్లే నా ప్రపంచం.!

దిశ, ఫీచర్స్: అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న. సింపుల్‌గా చెప్పాలంటే.. తండ్రి త్యాగాల గుర్తు. నాన్న ఏది చేసినా కుటుంబం కోసం.. పిల్లల బాగు కోసం చేస్తాడు. బాధ్యతలు.. భరోసా విషయంలో నాన్నకంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఉండరు. ఇక్కడొక నాన్న.. కూతురు అటాచ్‌మెంట్ ఎలా ఉందో చూడండి.
నాన్నకు టాటా..
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అది ఒక నాన్న.. కూతురు మధ్య ఉండే నిజాయితీగల ప్రేమకు సాక్ష్యం. రైలు కదలడానికి రెడీగా ఉంది. కూతురు రైలెక్కి కూర్చుంది. నాన్న ప్లాట్‌ఫామ్ మీద నిలబడి కన్నార్పకుండా కూతుర్నే చూస్తున్నాడు. ఆ కళ్లలో ప్రేమ.. కూతురు దూరంగా వెళ్తుందనే బాధ కలగలిసి కనిపిస్తున్నాయి. కిటికీలో నుంచి చేతులూపుతూ నాన్నకు టాటా చెప్తోంది కూతురు. ఇది చూడటానికి సాధారణమైన విషయమే. ఏముందీ.. చదువు కోసమో.. ఉద్యోగం కోసమో పిల్లలు పేరెంట్స్‌కు దూరంగా ఉండటం ఇప్పుడు కామన్ కదా. 90s కిడ్స్‌కు మాత్రమే ఈ ఎమోషన్ అర్థమవుతుంది.
ఒకప్పటి 90s కిడ్స్..
ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు తమ పిల్లలు వెళ్తున్నారంటే ఏ పేరెంట్‌కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ.. పంపించాలంటే మనసు ఒప్పుకోదు. ఆ ఎమోషన్ ఉన్న చివరి పేరెంట్స్ ఒకప్పటి 90s కిడ్స్. వాళ్లను పాత కొత్తల కలబోతగా చెప్పొచ్చు. పేరెంట్స్ దగ్గరగా పాతతరం ప్రేమలను.. జీవన విధానాన్ని గిఫ్ట్‌గా పొందిన వాళ్లు ఇప్పుడు వాటినే తమ పిల్లలకు పంచుతున్నారు. ఈ వీడియో అంతలా వైరల్ కావడానికి కారణం కూడా అలాంటి అటాచ్మెంటే. తన కూతురు వేరే ప్రాంతానికి వెళ్తుంటే.. ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టూ.. మళ్లీ రాదేమో అన్నట్లు చూస్తుంటాడు ఆ నాన్న.
కొరియన్ గెస్చర్..
ఇప్పటివాళ్లకు ఇది సిల్లీగా అనిపించినా ఆ స్వచ్ఛమైన ప్రేమ తెలిసినవాళ్లకు తెలుస్తుంది ఆ భావోద్వేగమెంత కఠినంగా ఉంటుందో. ఈ దృశ్యాన్నంతా తన ఫోన్‌లో బంధించిన కూతురు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక రైలు కదులుతోంది. కూతురు తన చేతివేళ్లతో ఒక చిన్న గెస్చర్ చేసింది. దాన్ని ‘కొరియన్ ఫింగర్ హార్ట్’ అని అంటారు. బొటనవేలు.. చూపుడు వేలుతో హార్ట్ ఆకారం చేసి ప్రేమ చూపే ఆధునిక గెస్చర్ ఇది. కొరియన్ సినిమాలు.. డ్రామాల్లో చాలా ఫేమస్ అన్నమాట. కూతురు ఈ గెస్చర్ ద్వారా వాళ్ల నాన్నకు ప్రేమను చూపించాలనుకుంది. కానీ అతడికి అవన్నీ తెలియవు.
చివరి తరం..
కూతురు అలా సిగ్నల్ ఇవ్వగానే ఒక్కసారిగా జేబులో చేయి పెట్టాడు నాన్న. తన కూతురుకు డబ్బులు అీవసరం ఉన్నట్టుంది అనుకొని రూ. 500 నోటు తీసి ఇస్తాడు. ఆ క్షణంలో నవ్వొచ్చినా.. హృదయం కదిలిపోతుంది. అతనికి ఈ కొత్త పోకడలేవీ తెలియవు. కానీ తన కూతురు ఏదైనా కావాలనుకుంటే వెంటనే ఇవ్వాలని మాత్రం తెలుసు. ఇది తన స్వచ్ఛమైన ప్రేమ.. ఆప్యాయతను చూపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన కూతురు క్యాప్షన్‌లో “ఇలాంటి అమాయకమైన.. నిజాయితీగల తల్లిదండ్రులతో పెరిగిన చివరి తరం అయుండొచ్చు మాది” అని. హృదయాన్ని తాకే క్షణం అంటూ దీనికి కామెంట్లు చేస్తున్నారు.






