- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
The Moringa Queen.. పొన్నరసి.!
టెన్త్ డ్రాపౌటే. కానీ ఇప్పుడొక సక్సెస్‌ఫుల్ ఆంత్రప్రెన్యూర్.

ఎంత చదివామన్నది కాదు.
అది మనకు ఎంత ఉపయోగపడిందనేది పాయింట్.
కొందరు పీహెచ్డీ చేసినా..
నిరుద్యోగులుగా మిగిలిపోతారు.
కొందరు పదో తరగతే చదివినా..
మంచి వ్యాపారవేత్త అవుతారు.
అలాంటివారిలో పొన్నరసి ఒకరు.
టెన్త్ డ్రాపౌటే. కానీ ఇప్పుడొక సక్సెస్‌ఫుల్ ఆంత్రప్రెన్యూర్.
- దిశ, ఫీచర్స్
తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన పొన్నరసి పదో తరగతి మధ్యలోనే ఆపేసింది. తర్వాత పెండ్లి. ఇంకేముంటది.? అత్తారింట్లో అంట్లు తోముతూ కూర్చోవడమే. తనకు వ్యవసాయం పని మాత్రమే తెలుసు. ఏం చేయాలి.? వంటింట్లో వడియాలు చేస్తూ ఎన్నిరోజులు ఉండాలి అనుకుంది.
మునగ సాగుతో..
కుటుంబ పరిస్థితుల వల్ల టెన్త్ మధ్యలోనే ఆపేసింది. కానీ జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదల పొన్నరసిలో ఉంది. ఏం చేయాలి అని ఆలోచించడంతోనే కాలం గడిచిపోయి నలుగురు పిల్లలకు తల్లయ్యింది. వాళ్లది సుదీర్ఘ వ్యవసాయ అనుభవమున్న కుటుంబం. చిన్నప్పటి నుంచీ పంట పొలాల మధ్యనే తిరిగింది. కష్టపడి పనిచేయడం అక్కడే నేర్చుకుంది. ఆ అనుభవంతో వ్యవసాయంలోకి దిగింది. పదేళ్లుగా పదెకరాల్లో మునగ సాగు చేస్తోంది. సాంప్రదాయకంగా ఆకులు.. విత్తనాలు.. వేర్లను అమ్ముతున్నారు. కానీ లాభసాటిగా లేదు. పోటీ ఎక్కువై కిలో మునగ విత్తనాల ధర రూ.5-10కు పడిపోయింది.
ములుపు తిప్పిన కెనడీ..
ఒకసారి పొన్నరసి కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలను సందర్శించింది. అక్కడ మునగ విలువలపై లోతైన అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా అగ్రికల్చర్ సైంటిస్ట్ జాన్ కెనడీ ఆమెకు ఎన్నో విషయాలు తెలియజేశాడు. "మీరంతా ఉత్పత్తిపై కంటే సాగు మీదనే దృష్టిపెడతారు. మునగ ఉత్పత్తులకు మార్కె్ట్లో చాలా డిమాండ్ ఉంది. నూనె.. పొడి.. సౌందర్య సాధనాలు వంటివెన్నింటినో మునగ ఉత్పత్తులతో చేస్తున్నారు. వాటిపై దృష్టిపెట్టాలి" అని కెనడీ సలహా ఇచ్చారు. వాటి గురించి నేర్చుకోవాలనే ఆలోచనతో గాంధీగ్రామ్ వ్యవసయా విస్తరణ కార్యాలయంలో శిక్షణ తీసుకొని మునగ ఉత్పత్తి నైపుణ్యం సంపాదించింది.
36 ఉత్పత్తులు..
మునగ ఉత్పత్తుల ప్యాక్‌హౌజ్ స్టార్టప్‌ను ప్రారంభించింది పొన్నరసి. ఇండియన్ ఫుడ్ అండ్ ఎడిబుల్ ఎక్స్‌పోర్ట్ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ సర్టిఫికేట్లను కూడా పొందింది. ఫలితంగా ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల సబ్సిడీని కూడా పొందింది. కృషి విజ్ఞాన కేంద్రం దృష్టిని ఆకర్షించి మున నూనె ఉత్పత్తిలో సాటిలేని పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకుంది. ప్యాక్‌హౌజ్‌ను ఏర్పాటుచేసి 36 రకాల మునగ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. మునగ నూనె, పొడి నుంచి షాంపూలు.. సబ్బులు.. లిప్ బామ్స్.. సూప్ పౌడర్ల వంటివెన్నో ఉన్నాయి ఈ జాబితాలో. ప్రతీయేడు 10 కొత్త ఉత్పత్తులను పరిచయం చేసే స్థాయికి ఎదిగింది.
12 లక్షల ఆదాయం
పొన్నరసి వ్యాపారం వార్షికంగ రూ.12 లక్షల ఆదాయం ఆర్జిస్తోంది. ఆరేండ్లలో ఆమె లక్షమందికి పైగా కస్టమర్ బేస్‌ను నిర్మించుకుంది. సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లను అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మలేషియా.. సింగపూర్.. యునైటెడ్ స్టేట్స్.. ఫ్రాన్స్.. మస్కట్ వంటి దేశాలకు ముగన ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. నలుగురు పిల్లలనేసుకొని ఎక్సెల్ లూనాపై మునగాకు అమ్మడానికి వెళ్తుంటే చుట్టాలు.. చుట్టుపక్కల వాళ్లు చులకనగా మాట్లాడేవారు. అలాంటి పొన్నరసి ఉత్తమ స్టార్టప్ ఫౌండర్‌గా మోరింగా క్వీన్ అవార్డును అందుకునే స్థాయికి ఎదిగి శభాష్ అనిపించుకుంటోంది.
బయటకు రండీ: పొన్నరసి
- సమాజం స్త్రీ బాధ్యతను గందరగోళ పరుస్తుంది.
- స్త్రీ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే తల్లిగా.. భార్యగా విఫలమవుతుందని వాళ్లు భావిస్తారు.
- కానీ మహిళలు వ్యాపారం మొదలుపెడితే ఫలితం అద్భుతంగా ఉంటుంది.
- మహిళలు కూడా ఇంట్లో నుంచి బయటకొచ్చి అవకాశాల కోసం అన్వేషించాలి.
- మనకు డిగ్రీలేం పనిచేయవు.
- వాటితో మన జీవితాన్నెంత మెరుగుపరుచుకున్నామో అనేదే ముఖ్యం.
- నేను పదో తరగతే చదివాను కదా.?
- కానీ ఇవాళ మోరింగా క్వీన్ అని సమాజం చప్పట్లు కొడుతుంటే గర్వంగా ఉంది.






