Ocean Gold : సముద్రం గర్భంలో కనిపించిన బంగారు కడ్డీలు.. దగ్గరకు వెళ్లి చూడగా..!!

by Javid Pasha |   (  Updated:2025-05-06 06:53:13  IST  )

Ocean Gold : సముద్రం గర్భంలో కనిపించిన బంగారు కడ్డీలు.. దగ్గరకు వెళ్లి చూడగా..!!

Ocean Gold : సముద్రం గర్భంలో కనిపించిన బంగారు కడ్డీలు.. దగ్గరకు వెళ్లి చూడగా..!!
X

దిశ, ఫీచర్స్ : సముద్రాలంటేనే జీవ వైవిధ్యానికి నిలయం. వాతావరణ మార్పుల్లోనూ కీలకపాత్ర పోషిస్తాయి. సమతుల్య పర్యావరణానికి దోహదం చేస్తాయి. కొన్నిసార్లు సునామీలకు, ప్రకృతి వైపరీత్యాలకు సైతం కారణం అవుతుంటాయి. ఇప్పటికే అనేక విషయాలు తెలిసినా, సముద్రపు రహస్యాల గురించి తెలియనివి కూడా ఇంకెన్నో ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధనలు కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలోనే పసిఫిక్ మహాసముద్రంలో అన్వేషణ కొనసాగిస్తున్న సైంటిస్టులకు నీటి అడుగు భాగాన కనిపించిన ఓ వింతైన దృశ్యం ఆశ్చర్యానికి గురిచేసింది.

సముద్ర గర్భంలో ఏముంది? అక్కడి వాతావరణం ఎలా మారుతోంది? సముద్ర గర్భంలో వింత పరిణామాలేమైనా జరుగుతున్నాయా? ఇది తెలుసుకునేందుకే ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ నిర్వహించే ఎక్స్‌ప్లోరేషన్ వెసెల్ నాటిలస్లోని పరిశోధకుల బృందం పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్లింది. పరిశోధనల్లో భాగంగా అన్వేషణ కొనసాగిస్తూ వెళ్తున్న వీరికి సముద్రంలోని లోతైన భాగంగా పేర్కొనే ‘లిలియుకలని రిడ్జ్’ వద్ద ఓ వింతైన దృశ్యం కంటపడింది. అది పసుపు రంగు రాళ్లను కలిగి ఉన్నందున దూరం నుంచి చూసిన శాస్త్రవేత్తలు అదేదే బంగారు గని అయి ఉంటుందా? అనే మనుమానం కూడా కలిగిందట. దీంతో వారు వెళ్లి చూడగా అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.

ఇంతకీ శాస్త్రవేత్తలు బంగారు గనిగా అనుమానించిన దృశ్యం ఏమిటంటే.. అది పసుపు రంగు రాళ్లతో చక్కగా అమర్చబడిన దారిలా ఉంది. ఆ రాళ్లు పగుళ్లతో ఇటుకల ఆకారంలో ఉన్నాయి. అందుకే దూరం నుంచి చూడగానే బంగారు కడ్డీల్లా తోచాయి. కానీ పరిశోధించి చూడగా అవి సముద్ర గర్భంలో సంభవించే పరిణామాలవల్ల ఏర్పడిన పురాతన లావా కార్యకలాపాల కారణంగా ఏర్పడిన ఓ రహదారిగా గుర్తించారు. సముద్రపు నీటి అడుగున అగ్ని పర్వత విస్ఫోటనాల సందర్భంలో లావా పెల్లుబికి బంగారు వర్ణంలో ఇలాంటి రహదారి ఏర్పడిందని కనుగొన్నారు. ప్రకృతి అద్భుత దృశ్యాల్లో ఇది కూడా ఒకటని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Next Story