Friendship : స్నేహం శాశ్వతమేనా.. ? 91% మంది అలా భావించడం లేదంటున్న సర్వే!

by Javid Pasha |   (  Updated:2025-06-06 07:28:39  IST  )

Friendship : స్నేహం శాశ్వతమేనా.. ? 91% మంది అలా భావించడం లేదంటున్నసర్వే!

Friendship : స్నేహం శాశ్వతమేనా.. ? 91% మంది అలా భావించడం లేదంటున్న సర్వే!
X

దిశ, ఫీచర్స్ :‘స్నేహమే రా జీవితం.. స్నేహమే రా శాశ్వతం’ అన్నారో సినీ కవి. మనుషుల మధ్య పెనవేసుకున్న ఆత్మీయత ఎన్నటికీ చెరగదని కూడా పెద్దలు చెబుతుంటారు. కానీ అది పూర్తిగా వాస్తవం అని కూడా చెప్పలేం అంటోంది రీసెంట్ సర్వే ఒకటి. స్నేహం కూడా కాలనుగుణంగా సంభవించే మార్పులతో ప్రభావితం అవుతుందని తెలిపింది. 91% ప్రజలు ఒకప్పటి తమ పాత స్నేహితులను ప్రస్తుతం ఆత్మీయ స్నేహితులుగా భావించడం లేదని వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దామా!

అవును మార్పు ప్రకృతి ధర్మమే కాదు, అది మనుషులకూ వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితుల ప్రభావంవల్ల కూడా మానవ సంబంధాల్లో మార్పులు వస్తాయని, స్నేహ బంధాలు అందుకు అతీతం కాదని అంటున్నారు. జీవితంలోని వివిధ దశల్లో స్నేహ సంబంధాలు ఎలా మారుతాయో తెలుసుకోవడానికి TheTatva.in వెబ్‌సైట్ ఇటీవల ఓ సర్వే నిర్వహించినట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక స్నేహ సంబంధాలు ఎందుకు చెదిరిపోతాయనే విషయాన్ని పరిశీలించగా అందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు.

ఒకప్పటి జీవితం వేరు. మానవుల మధ్య స్నేహ బంధం శాశ్వతంగా, చెదరని చిరునామాగా ఉండేందుకు అప్పటి జీవన విధానం దోహదం చేసేది. కానీ కాలనుగుణంగా వస్తున్న మార్పులు ఆ పరిస్థితులను మార్చేస్తున్నాయి. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న ఈ రోజుల్లో టెక్నాలజీ సౌకర్యాలను, మెరుగైన కమ్యూనికేషన్‌ను కల్పిస్తున్నప్పటికీ హృదయాలను హత్తుకునే అనుబంధాలను మాత్రం పరిస్థితులు దూరం చేస్తున్నాయి. నేటి చదువులు, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు కూడా మనుషుల్లో దూరాన్ని పెంచుతున్నాయని, జీవితంలో స్థానచలనం, వృత్తి మార్పులు, కెరీర్‌‌పై ఫోకస్, వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాలు స్నేహ బంధాలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఒకప్పుడు రోజువారీ సంభాషణలు, భాగస్వామ్య అనుభవాలతో నిండిన స్నేహం, కాలక్రమేణా దూరమైన జ్ఞాపకాలుగా మారుతున్నదని సర్వేను విశ్లేషించిన నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా పరిస్థితుల ప్రభావం వల్ల మనుషుల మధ్య దూరం పెరుగుతోందని, అనుబంధాలు చెదురుతున్నాయని, 91% ఒకప్పటి ఆత్మీయులను, స్నేహితులను ప్రస్తుతం అలా భావించడం లేదని పేర్కొంటున్నారు. అయితే ఇది శాశ్వతమని చెప్పడానికి కూడా లేదంటున్నారు నిపుణులు. స్నేహం కొనసాగడానికి ఇరువైపులా కృషి, సమయం, అర్థం చేసుకునే సామర్థ్యం అవసరమని పేర్కొంటున్నారు.

Next Story