- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక గంట కదలకుండా కూర్చుంటే.. 22 నిమిషాలు తగ్గుతున్న ఆయుష్షు..!
ఒక గంట కదలకుండా కూర్చుంటే.. 22 నిమిషాలు తగ్గుతున్న ఆయుష్షు..!

దిశ, ఫీచర్స్ : నిశ్చల జీవన శైలి ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం తెలిసిందే. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయాన్ని రివీల్ చేసింది. ఏంటంటే.. రోజుకు 6 నుంచి 8 గంటలకు మించి కూర్చోవడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరణాల రేటును పెంచుతుంది. ఇక ఒక గంటపాటు కదలకుండా కూర్చునే నిశ్చల పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే గనుక ప్రతీ గంటకు 22 నిమిషాల ఆయుఃప్రమాణం తగ్గుతుందని కూడా బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో పబ్లిషైన స్టడీ పేర్కొన్నది. దీనికి ప్రధాన కారణాలు గుండె జబ్బులు, జీవక్రియ సంబంధిత రుగ్మతలు(Metabolic disorders), కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ పెరగడమే.
అధ్యయనం ప్రకారం.. ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. బాడీ అంతర్గత కణాల్లో వాపు (inflammation) ఏర్పడుతుంది. అలాగే లిపోప్రొటీన్ లిపేస్ యాక్టివిటీ(Lipoprotein lipase activity)తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాల్ జీవక్రియను దెబ్బతీయడంవల్ల శరీరంలో, రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఈ జీవ రసాయన మార్పులు దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రోజూ ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ, కదలకుండా 8 గంటలకు మించి కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని నివారించేలేం. దీనినే ‘యాక్టివ్ కౌచ్ పొటాటో’ ప్రభావం అంటున్నారు నిపుణులు. అంటే వ్యాయామం చేసే వ్యక్తులు కూడా అధిక నిశ్చల జీవనశైలి కారణంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే దీనికి పరిష్కారం కూడా ఉందంటున్నారు నిపుణులు. ఏంటంటే.. నిశ్చల జీవన శైలి(Sedentary lifestyle)ని నివారించడం, ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడమే.
మీరు ఎంత బిజీ వర్క్‌లో ఉన్నా ప్రతీ 30 లేదా 60 నిమిషాలకు ఒకసారి కనీసం 5 నిమిషాల పాటు లేచి నిలబడటం లేదా నడవడం, స్టాండింగ్ డెస్క్‌లను ఉపయోగించడం చేయాలి. ఇవి చిన్న మార్పులే కానీ రక్త ప్రసరణను మెరుగు పర్చి, ఇన్సులిన్ సమర్థతను పెంచి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడతాయి. అదనంగా రోజుకు కనీసం 150 నిమిషాల మోడరేట్ ఏరోబిక్ వ్యాయామం (Like walking and cycling), వారానికి రెండు రోజులు బలం పెంచే ఇతర వ్యాయామాలు చేయడం కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జీవిత కాలాన్ని పొడిగిస్తాయి.






