రోజుకు రెండు మూడు సార్లు ఇండ్లు శుభ్రం చేస్తున్నారా.. ?మీ ఆరోగ్యం దెబ్బతినొచ్చు..!

by Javid Pasha |   (  Updated:2025-09-05 07:17:44  IST  )

శుభ్ర పరిచే పనుల సందర్భంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకూడదంటే.. రకరకాల స్ప్రేలు, కెమెకల్ లిక్విడ్స్ వాడటం తగ్గించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

రోజుకు రెండు మూడు సార్లు ఇండ్లు శుభ్రం చేస్తున్నారా.. ?మీ ఆరోగ్యం దెబ్బతినొచ్చు..!
X

దిశ, ఫీచర్స్ : ఇండ్లు శుభ్రంగా ఉంచుకోవడం అవసరమే. అందుకోసం రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఊడవడం, తుడవడం చేస్తే పర్లేదు. కానీ కొందరు రోజుకూ ఐదారుసార్లు ఊడవడం, తుడవడం చేస్తుంటారు. పైగా ఎక్కువ శుభ్రతకోసం వివిధ లిక్విడ్స్ వాడుతుంటారు. అయితే ఇలా చేయడం మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందంటున్నారు నిపుణులు. ఇక తరచుగా ఇండ్లు, కార్యాలయాల్లో క్లీనింగ్ వర్క్స్ చేసే వర్కర్లు కూడా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని, ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్గెన్ నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.

ఏం జరుగుతుంది?

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 20 ఏండ్ల పాటు, 6000 మందిని ప్రతిరోజూ శుభ్రపరిచే పనులు వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రతిరోజూ ఎక్కువసార్లు తమ ఇండ్లను శుభ్రం చేసుకునే గృహిణులు, అలాగే ఇండ్లల్లో, కార్యాలయాల్లో శుభ్రపరిచే క్లీనర్ల ఊపిరితిత్తుల పనితీరు బలహీనపడినట్లు గుర్తించారు. రోజుకు 20 సిగరెట్లు తాగిన వారితో సమానంగా ఊపిరితిత్తుల సామర్థ్యం క్షీణించినట్లు నిర్ధారించారు. అయితే తరచుగా క్లీనింగ్ స్ప్రేలు, వివిధ కెమికల్స్ కలిసిన లిక్విడ్స్ వాడటం, వాటి నుంచి వెలువడే చిన్న చిన్న కణాలను, చికాకు కలిగించే పదార్థాలను శుభ్రపరిచే సందర్భంగా పీల్చడం ఇందుకు కారణం అవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

ఏం చేయాలి ?

శుభ్ర పరిచే పనుల సందర్భంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకూడదంటే.. రకరకాల స్ప్రేలు, కెమెకల్ లిక్విడ్స్ వాడటం తగ్గించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వాటికి బదులుగా మైక్రో ఫైబర్ క్లాతింగ్స్, సాధారణ నీటిని ఉపయోగించడం ద్వారా రసాయన ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి. దీనివల్ల ఆరోగ్యానికి హానిచేసే కణాలు ఊపిరి తిత్తుల్లోకి చేరవు. అలాగే క్లీనింగ్ సమయంలో గదులను బాగా వెంటిలేట్ చేయడం ద్వారా కూడా చికాకు కలిగించే పదార్థాలు గాలిలో చేరకుండా నిరోధించవచ్చు. ముఖ్యంగా స్ప్రే క్లీనర్‌ల వాడకాన్ని పరిమితం చేయడం లేదా పూర్తిగా నివారించడం మంచిది. Link

Next Story