- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మగాళ్లూ జాగ్రత్త.. మైక్రోప్లాస్టిక్స్ వల్ల సంతానోత్పత్తికి ముప్పు.!
మైక్రో ప్లాస్టిక్స్ వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది

ప్రపంచవ్యాప్తంగా..
సంతానలేమి సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారట.
ఇదేదో అంచనాకు చెప్తున్న మాట కాదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న మాట.
ఇప్పటివరకు ఒత్తిడి.. జీవనశైలి.. ఆహారపు అలవాట్లు దీనికి కారణం.
కానీ తాజా అధ్యయనం ఒక కొత్త ఆందోళనకర కారణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
అదే మైక్రో ప్లాస్టిక్స్.!!
- దిశ, ఫీచర్స్
మూడు రెట్లు ఎక్కువ
మానవ వృషణాల్లో చేరుతున్న ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 23 మంది పురుషులు, 47 కుక్కల వృషణాల నుంచి కణజాల నమూనాలను సేకరించి వాటిని సూక్ష్మంగా విశ్లేషించారు. ఈ అధ్యయనంలో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. అన్ని నమూనాల్లోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయి. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే కుక్కల వృషణాలతో పోలిస్తే మానవ వృషణాల్లో మైక్రో ప్లాస్టిక్స్ దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఒక గ్రాము కణజాలానికి సగటున 329.44 మైక్రో గ్రాములు.
రక్తం.. ఊపిరితిత్తుల్లోనూ
మన రోజువారీ జీవితంలో విరివిగా ఉపయోగించే పాలిథీన్.. పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) వంటి ప్లాస్టిక్స్ఈ కణజాలాల్లో కనుగొనబడ్డాయి. ఈ ప్లాస్టిక్ కణాలు ఆహారం.. నీరు ద్వారా మానవ శరీరంలోకి చొచ్చుకుపోతున్నాయి. ఇవి వృషణాలతో పాటు రక్తం.. ఊపిరితిత్తులు.. ప్లాసెంటా.. మెదడు వంటి ఇతర అవయవాల్లో కూడా చేరుతున్నట్లు అధ్యయాలు గుర్తించాయి. కుక్కల కణజాలాల్లో అధికంగా పీవీసీ ఉన్నప్పుడు వాటిల వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు కనుగొన్నారు. ఇదే ప్రభావం మానవుల్లోనూ ఉండచ్చని అంచనా వేస్తున్నారు.
ఎలా వ్యాపిస్తాయి.?
మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోని ఎండోక్రైన్ వ్యవస్థకు అంతరాయం కలిగించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని పరిశోధకులు అంటున్నారు. మైక్రోప్లాస్టిక్స్ అనేవి 5 మిల్లీ మీటర్ల కంటే చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి ప్లాస్టిక్ సంచులు.. బాటిల్స్.. ప్యాకేజింగ్ వస్తువులు.. పైపులు.. రోజువారీ వస్తువులు విచ్చిన్నమై ఏర్పడతాయి. ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసిన ఆహారం.. సముద్ర ఆహారం ద్వారా ఈ కణాలు శరీరంలోకి చేరతాయి. ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీరు.. కాలుష్యం చెందిన నీటి వనరుల ద్వారా కూడా చేరతాయి. గాలిలో తేలియాడే చిన్న ప్లాస్టిక్ కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరతాయి.
ఆందోళన ఎందుకంటే.?
మైక్రో ప్లాస్టిక్స్ సంతానోత్పత్తిపై చూపే ప్రభావం ఒక్క పురుషులకే పరిమితం కాదు. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీనివల్ల స్త్రీలలో కూడా సంతాన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కణాలు ప్లాసెంటా ద్వారా గర్భంలోని శిశువుకు కూడా చేరే ప్రమాదముంది. ఇది భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. కుక్కలు మనుషులతో సమానమైన వాతావరణంలో జీవిస్తాయి కాబట్టీ కుక్కకు వర్తించిందే మనుషులకూ వర్తించొచ్చని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. మైక్రో ప్లాస్టిక్స్‌ను అదృశ్య ముప్పుగా అభివర్ణిస్తున్నారు.
ఏం చేయాలి.?
ప్లాస్టిక్ ను తగ్గించండి: ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లకు బదులు గాజు, స్టెయిన్ లెస్ స్టీల్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించండి.
ప్యాకింగ్ ఆహారం: ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని నివారించి తాజా ఆహారాన్ని ఎంచుకోండి.
ఫిల్టర్ చేయండి: నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్‌ను తొలగించే నీటి ఫిల్టర్లను ఉపయోగించండి.
అవగాహన: ప్లాస్టిక్ కాలుష్యం గురించి సమాజంలో డిస్కషన్స్‌ను ప్రోత్సహించండి. పర్యావరణ రక్షణ కార్యక్రమాల్లో పాల్గొనండి.






