మంటల్లో కాల్చిన ఆహారంతో రుమటాయిడ్ ఆర్థరైటిస్‌.. అసలు రీజన్ అదే!

by Disha Web Desk 12 |
మంటల్లో కాల్చిన ఆహారంతో రుమటాయిడ్ ఆర్థరైటిస్‌.. అసలు రీజన్ అదే!
X

దిశ, ఫీచర్స్: మీరు బయట మార్కెట్‌కు గానీ, జాతర్లకు గానీ వెళ్లినప్పుడు బొగ్గులపై లేదా కట్టెల పొయ్యి పై కాల్చి అమ్ముతున్న స్వీట్ కార్న్, హర బూట్ (పచ్చి శనగ మొక్కలు), చికన్ పకోడీలు తదితర ఆహారాలను ఇష్టంగా తింటారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇలా తినడం వల్ల కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ఆహారాన్ని మంటల్లో కాల్చినప్పుడు విడుదలయ్యే పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్(PAHs) ఇందుకు కారణమని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ విభాగానికి చెందిన డాక్టర్ క్రిస్టోఫర్ డి అడమొ (christopher D'Adamo) నేతృత్వంలోని పరిశోధకుల బృందం పేర్కొంది.

ధూమపానం వల్ల కూడా..

అంతేగాక సిగరెట్ కాల్చడం ద్వారా కూడా పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌‌లు రిలీజ్ అవుతాయట. దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థ పొరపాటును కీళ్లను కప్పే కణాలపై దాడి చేస్తుంది. అందుకే ఈ పొగను పీల్చిన వారు కూడా జీవితంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యను ఎదుర్కొంటారు. కాలక్రమేణా మృదులాస్థి సమీపంలోని ఎముకలకు నష్టం కలిగిస్తుంది. దీంతోపాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు (Rheumatoid arthritis) ఏజ్, సెక్స్, పర్యావరణం, జీవనశైలి వంటి కారకాలు కూడా దోహదం చేస్తాయని అధ్యయనం పేర్కొంది.

పరిశీలనలో తేలిందేమిటి?

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ సంభవించే ప్రమాద కారకాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్న పరిశోధకులు 2007 నుంచి 2016 మధ్య సేకరించిన యూఎస్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES)కి ప్రతిస్పందనలను విశ్లేషించారు. వారు పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు, ప్లాస్టిక్ ఉత్పత్తిలో వినియోగించే కెమికల్స్, పెయింట్స్, క్లీనింగ్ కెమికల్స్, పురుగు మందుల నుంచి ఉత్పన్నమైన అస్థిర కర్బన సమ్మేళనాలు (VOCలు) సహా పలు రకాల విషపూరితాలను స్టడీ చేశారు. అలాగే మంట, బొగ్గు, గ్యాస్ ద్వారా కాల్చిన ఆహారాలను తినే వారిని కూడా పరిశీలించారు.

ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 22,000 మంది అడల్ట్స్‌ను పరిశీలించగా వీరిలో 1,418 మందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్లు తెలుసుకున్నారు. మిగిలిన 20,569 మందికి లేదు. శరీరంలోని మొత్తం పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు(PAH), అస్థిర కర్బన సమ్మేళనాలను కొలవడానికి బృందం బ్లడ్, యూరిన్ శాంపిల్స్‌ను సేకరించింది. 7,090 మందిలో సిస్టమ్‌లో PAH ఉందని, 7,129 మందిపై అస్థిర కర్బన సమ్మళనాల ప్రభావం ఉందని కనుగొన్నారు.

ఈ సందర్భంగా ధూమపానం చేసేవారితో సంబంధం లేకుండా పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌ లెవల్స్ 25 శాతం అధికంగా ఉన్నవారిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ డెవలప్ అయినట్లు గుర్తించారు. ప్రత్యేకించి శరీరంలో PAH 1-హైడ్రాక్సినాఫ్తలీన్ ఉన్న వ్యక్తులు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను కలిగి ఉండే అవకాశం 80 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. దీంతోపాటు PAH బహిర్గతం అనేది ఇండోర్ పరిసరాలు, మోటారు వాహనాల ఎగ్జాస్ట్, నాచ్యురల్ గ్యాస్, కలప లేదా బొగ్గు ద్వారా మండే మంటలు, తారు రోడ్డుపై చెత్తను కాల్చే పొగలు, కాల్చిన ఆహారాలతో సహా ఇతర వనరుల నుంచి కూడా రావచ్చునని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితులను నివారించడం తో పాటు ధూమపానం మానుకోవడం, నిప్పులపై పొగ వచ్చే పరిస్థితిలో కాల్చిన ఆహారాలు అవైడ్ చేయడం వంటివి ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

Also Read...

మెదడులో నొప్పి గ్రాహకాలు ఉండవు.. అయినా తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Next Story