GPayలో Pocket Money ఫీచర్.. ఇంతకీ ఏంటిది?

by Javid Pasha |   (  Updated:2026-04-14 13:08:45  IST  )

గూగుల్‌పే‌లోని ప్యాకెట్ మనీ ఫీచర్.. నియంత్రిత యాక్సెస్‌ను సెండరీ యూజర్లకు ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది.

GPayలో Pocket Money ఫీచర్.. ఇంతకీ ఏంటిది?
X

దిశ, ఫీచర్స్ : మీరు గూగుల్ పే యూజర్లా? అయితే ఇది గమనించే ఉంటారు. ఓపెన్ చేయగానే ‘ప్యాకెట్ మనీ(Pocket Money)’ అనే ఒక కొత్త ఫీచర్ ఈమధ్యే కనిపిస్తోంది. ఇంతకీ ఏమిటది? అనుకుంటున్నారా? యూపీఐ సర్కిల్లో వచ్చిన ఈ కొత్త మార్పుతో ప్రైమరీ యూజర్(ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా ఖాతా యజమాని)తన బ్యాంక్ అకౌంట్‌ నియంత్రిత యాక్సెస్‌ను సెండరీ యూజర్లకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు ఇలా ఎవరికైనా చాన్స్ ఇవ్వొచ్చు. అంటే వీరికి సొంతంగా బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. ప్రైమరీ యూజర్ ఖాతా ద్వారానే యూపీఐ పేమెంట్లు (QR స్కాన్, UPI ID ద్వారా) చేయవచ్చు. ముఖ్యంగా దీనిని పిల్లలకు డిజిటల్ పాకెట్ మనీ ఇవ్వడం కోసం, ఖర్చులను నియంత్రించడం కోసం రూపొందించారని చెప్పవచ్చు.

ఎలా పని చేస్తుంది?

*ప్రైమరీ యూజర్ (మీరు) గూగుల్ పే (Google Pay)లో యూపీఐ సర్కిల్ ప్యాకెట్ మనీ (UPI Circle → Pocket Money) ఆప్షన్‌కి వెళ్లి, సెకండరీ యూజర్‌ను ఫోన్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా యాడ్ చేయాలి. ఒక్కసారికి 5 మంది వరకు ఇలా యాడ్ చేయవచ్చు. అలాగే వారికి రోజువారీ లేదా నెలవారీ ఖర్చు పరిమితిని కూడా సెట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అప్రూవల్ ఆప్షన్ ఉంటుంది. అంటే సెకండరీ యూజర్ ప్రతీ ట్రాన్సాక్షన్‌కు ప్రైమరీ యూజర్ అనుమతి (నోటిఫికేషన్ ద్వారా) తీసుకోవాలి. కొన్ని చిన్న మొత్తాలకు స్వయంగా కూడా చేయనివ్వొచ్చు.

*సెకండరీ యూజర్ క్యూఆర్ స్కాన్ చేసి లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే, డబ్బు ప్రైమరీ యూజర్ బ్యాంక్ ఖాతా నుంచి తీసుకోబడుతుంది. ఇక్కడ రియల్ టైమ్ ట్రాకింగ్ ఉంటుంది. కాబట్టి ప్రైమరీ యూజర్ అన్ని ఖర్చులను, లావాదేవీలను చూడవచ్చు. అయితే బిల్ పేమెంట్లు, కొన్ని రకాల ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి మొదట్లో లిమిట్ ఉండవచ్చు. కొత్త యూజర్లకు కూల్‌డౌన్ పీరియడ్ కూడా ఉంటుంది.

ఉపయోగాలు ఏమిటి?

*పిల్లలకు నేరుగా క్యాష్ ఇవ్వకుండా డిజిటల్ ప్యాకెట్ మనీ ఇవ్వొచ్చు. స్నాక్స్, స్కూల్ ఖర్చులు, ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయవచ్చు. కానీ అన్నీ ప్రైమరీ యూజర్ నియంత్రణలో, పర్యవేక్షణలో కొనసాగుతాయి.

*వృద్ధులు, బ్యాంక్ అకౌంట్ లేనివారు సులభంగా క్యూఆర్ స్కాన్ చేసిపేమెంట్లు చేయవచ్చు.

*ఖర్చులపై పూర్తి నియంత్రణ + ట్రాన్స్‌పరెన్సీ ఉండటంవల్ల డబ్బు నిర్వహణ, ఫ్యామిలీ మేనేజ్‌మెంట్ సులభం అవుతుంది.

*పరిమితులు, స్కామ్‌ల నుంచి రక్షణ వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి.

Next Story