- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్షల జీతం వదిలి.. లక్షణమైన "శుద్ధి"కి శ్రీకారం.!
ప్రశాంత్ శర్మకు లండన్‌లో ఐటీ జాబ్. మంచి జీతం వదిలేసి ఇండియాలో గ్రేవాటర్ శుద్ధి చేస్తున్నాడు

గ్రేవాటర్ అంటే తెలుసా.?
చేతులు కడుక్కోవడం..
బట్టలు ఉతకడం..
స్నానం చేయడం వల్ల వచ్చే మురికి నీరు.
దీనిని రీసైకిల్ చేసి మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
కానీ.. ఎలా.?
ఇదిగో ఈ స్టోరీ చదవండి తెలుస్తుంది.!
- దిశ, ఫీచర్స్
ప్రశాంత్ శర్మకు లండన్‌లో ఐటీ జాబ్. మంచి జీతం. బిందాస్ లైఫ్. కానీ ఆయన ఆ ఉద్యోగాన్నీ.. లండన్‌నూ వదిలేసి ఇండియాకు వచ్చాడు. ఆయనేదో పనిచేతగాక పారిపోయి రాలేదు. ఇండియాలో వృథాగా పోతున్న "గ్రేవాటర్"ను తిరిగి ఎలా వినియోగించుకోవాలో మనకు నేర్పించడానికి వచ్చాడు.
సంక్షోభం నుంచి..
అది 2019 జూన్ 19. చెన్నయ్ నగరంలో తాగునీటి కటకట ఏర్పడింది. ఒక రకంగా అదొక "నీటి సంక్షోభం". "డే జీరో"గా పిలిచే ఈ నీటి సంక్షోభం చెన్నయ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనది. అదే సమయంలో ప్రశాంత్ శర్మ తన భార్య.. రెండేళ్ల కొడుకుతో కలిసి అత్తారంటికి వచ్చాడు. ఈ "డే జీరో" సంక్షోభంతో అక్కడ ఉండలేకపోయారు. తన కొడుకు తాగేందుకు నీటి కోసం వారం రోజుల పాటు అక్కడా ఇక్కడా తిరగాల్సి వచ్చింది. నీటి ట్యాంకర్ల దగ్గర ప్రజలు ఒకదిక్కు గుండెలు బాదుకుంటున్నారు. ఎక్కువ పైసలిస్తామన్నా కనీసం ఉప్పునీళ్లు కూడా దొరకని పరిస్థితి.
ఫౌండేషన్ స్థాపన..
ప్రశాంత్ చాలా ఆలోచించాడు. దీనినొక సవాలుగా తీసుకున్నాడు. కనీసం మురికి నీరున్నా ఉడకబెట్టి.. శుద్ధి చేసే ఏదో ఒక రకంగా వాడుకుంటాం కదా అని అనుకున్నాడు. పరిమిత వనరు అయిన నీటిని తిరిగి ఎలా వాడుకోవచ్చు.. వాడుకునేలా మార్చొచ్చు అని అధ్యయనం చేశాడు. గ్రేవాటర్‌ను రీసైకిల్ చేయడమే దీనికొక సొల్యూషన్‌గా భావించాడు. ఇక లండన్‌లో ఉన్న తన ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇండియాకు వచ్చి పూర్తిస్థాయిలోనే చెన్నయ్‌లో మకాం పెట్టాడు. "పాజిటివ్ యాక్షన్ ఫర్ చైల్డ్ అండ్ ఎర్త్ ఫౌండేషన్" పేరుతో సంస్థను స్థాపించాడు.
ఇదొక పరిష్కారం..
ఇండియాలో రోజూ సుమారు 31 బిలియన్ లీటర్ల గ్రేవాటర్ ఉత్పత్తి అవుతుందని ఒక నివేదిక తెలియజేసింది. దీనిని "రీసైక్లింగ్ సొల్యూషన్" ద్వారా పాఠశాలలు.. కళాశాలలు.. ఇతర సంస్థలకు అందించాలి అనుకున్నాడు. "గ్రేవాటర్ రీసైక్లింగ్" ద్వారానే భవిష్యత్‌లో నీటి సంక్షోభాన్ని అధిగమించొచ్చని ప్రశాంత్ భావించాడు. "రీసైకిల్" చేసిన నీటిని "భూగర్భ జలాల రీచార్జ్".. "మొక్కలకు".. "గార్డెనింగ్".. "వాషింగ్".. "టాయిలెట్ ఫ్లష్" వంటివాటికి వినియోగించుకోవచ్చని ఆలోచించి "గ్రేవాటర్ రీసైక్లింగ్" ద్వారా నీటి సంక్షోభానికి చక్కని పరిష్కారం చూపించాడు.
స్వయం నిధులతో..
ప్రశాంత్ శర్మ స్థాపించిన "పాజిటివ్ యాక్షన్ ఫర్ చైల్డ్ అండ్ ఎర్త్ ఫౌండేషన్" ద్వారా సహజ రీసైక్లింగ్ పద్ధతిలో ఢిల్లీ.. ఉత్తరాఖండ్‌లోని పాఠశాలలు ఏటా 6 లక్షల లీటర్ల తాజా నీటిని ఆదా చేస్తున్నాయి. 100 లీటర్ల నీటిలో 70 లీటర్లు గ్రేవాటర్‌గా ఉంటుందని తెలుసుకున్న ప్రశాంత్.. దానిలో చాలావరకు నీటిని రీసైకిల్ చేస్తున్నాడు. మురుగునీటితో కలిసి వృథాగా పోతున్న ఈ నీటిని శుద్ధిచేస్తున్నాడు. చెత్త విభజన.. రీసైక్లింగ్.. కంపోస్టింగ్ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నాడు. కేవలం స్వయం నిధులతో ఈ సంస్థను నడిపిస్తున్నాడు.
రోజుకు ఎంత.?
ప్రశాంత్ రూపొందించిన "కన్‌స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్స్" పద్ధతిలో సహజ పదార్థాలైన యాక్టివేటెడ్ చార్‌కోల్.. రాయి.. ఇసుకను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం విద్యుత్ లేదా రసాయనాల అవసరం లేకుండానే శుద్ధి చేస్తుంది. పాఠశాలలను లక్ష్యంగా చేసుకున్న ప్రశాంత్ ఒక్కో విద్యార్థి రోజుకు 8 లీటర్ల గ్రేవాటర్ ఉత్పత్తి చేస్తాడని.. 4000 మంది విద్యార్థులున్న పాఠశాలలో రోజుకు 16,000 లీటర్ల నీటిని రీసైకిల్ చేయొచ్చు.
ఈ సంవత్సరంలో ఎంత.?
ఈ ప్రక్రియలో మొదట గ్రేవాటర్ ఆడిట్ చేసి.. రీసైక్లింగ్ పాయింట్‌ను గుర్తిస్తారు. తర్వాత సొల్యూషన్‌ను రూపొందించి.. పరీక్షించి అమలు చేస్తారు. ఢిల్లీ.. ఉత్తరాఖండ్‌లోని స్కూళ్లు.. ఒడిశాలోని గవర్నమెంట్ కాలేజీలు.. నైనిటాల్‌లోని శ్రీ అరవింద ఆశ్రమంతో కలిసి ఇప్పటివరకు 6 లక్షల లీటర్ల నీటిని రీసైకిల్ చేశారు. 2025లో దీనిని 10 లక్షలకు చేర్చాలని ప్రయత్నిస్తున్నారు.






