- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీళ్లు మనుషులా.. మామిడి పండ్ల చుట్టాలా.?
"మ్యాంగో బ్రాండ్ అంబాసిడర్"గా మారిపోయింది.

ఇది మామిడి సీజన్.
ఏప్రిల్ నుంచి జూన్ వరకైతే ఎక్కడచూసినా మామిడి పండ్లే.
తీరొక్క మామిడి పండ్లను చూడగానే తినాలనిపిస్తోంది.
మనకైతే అదొక సరదా.
కానీ సేలంలోని ఒక కుటుంబానికి అదొక వందేళ్ల వ్యాపారం.
అంగట్లో బుట్టలు పెట్టుకొని అమ్మిన కుటుంబమే..
ఇవాళ.. "మ్యాంగో బ్రాండ్ అంబాసిడర్"గా మారిపోయింది.
లెట్స్ ఫాలో ద "మ్యాంగో ఫ్యామిలీ" స్టోరీ.!
- దిశ, ఫీచర్స్
తమిళనాడులోని సేలంలో పళకడై జయపాల్ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వందేళ్లకు పైగా జయపాల్ కుటుంబం మామిడి వ్యాపారంలో ఉంది. అంగట్లో బుట్టలు పెట్టుకొని అమ్మేస్థితి నుంచి లక్షల రూపాయల వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు. మామిడిని ఇంటిపేరుగా మార్చుకొని వ్యాపారంలో దూసుకెళ్తున్నారు.
ఊరూరా తిరిగి..
సుమారు వందేళ్ల క్రితం. జయపాల్ ఫ్యామిలీ జీవనాధారం కోసం అంగట్లో మామిడి పండ్లు అమ్మేది. పిల్లలంతా పలకా బలపం పట్టుకొని స్కూల్‌కి వెళ్తుంటే జయపాల్ మాత్రం మామిడి పండ్ల బుట్టలతో ఆడుకునేవాడు. అందుకే కేవలం ఒకటో తరగతి వరకే చదివాడు. తన తండ్రి అరముగ గౌండర్ పళని గౌండర్ అనే వ్యక్తితో కలిసి మామిడి పండ్ల వ్యాపారం మొదలుపెట్టారు. అప్పుడది చాలా చిన్న వ్యాపారం. అరముగ సేలం అంగట్లో మామిడి పండ్లను అమ్మితే.. తన భార్య కాంతయమ్మల్ బుట్టలను మోసుకొని ఊరూరా తిరిగి అమ్మేది.
నాన్న మరణం
అప్పుడు జయపాల్‌కు 12 సంవత్సరాల వయసు. అరముగ గౌండర్ అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబ బాధ్యతంతా కాంతయమ్మల్ మీద పడింది. పెద్దదిక్కు కోల్పోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుగా.? పండ్ల దుకాణం పార్టనర్ తీసేసుకున్నాడు. అదే షాపులో జయపాల్ పనికి కుదిరాడు. అతడి సంపాదన నెలకు 30 రూపాయలు. ఓనర్ తెలిసిన వ్యక్తే కాబట్టీ జయపాల్‌ను వెల్లూరు.. చెన్నయ్.. బెంగళూరు వంటి ప్రాంతాలకు పండ్ల కోసం పంపించేవాడు. పని బాగా చేస్తున్నాడని అద్దె మామిడి తోటను చూసుకోవడానికి నాలుగైదు నెలలు యర్కాడ్ కూడా పంపించాడు.
చెలరేగిన మంటలు
జయపాల్ మంచి అనుభవం సంపాదించాడు. తన నాన్న కోరికను నెరవేర్చాలనుకొని 18 సంవత్సరాల వయసున్నప్పుడు సేలంలో ఒక చిన్న రిటైల్ షాపును తెరిచాడు. ఐదేండ్ల తర్వాత పెళ్లి జరిగింది. భార్య విజయలక్ష్మి అతన్ని అన్ని విధాలా అర్థం చేసుకున్నది. వాళ్లదీ పండ్ల వ్యాపార నేపథ్యమున్న కుటుంబమే కాబట్టీ వ్యాపారం సాఫీగా సాగిపోతోంది. అంతలోనే షాపులో అగ్నిప్రమాదం జరిగి అంతా కాలిపోయింది. ఒకరకంగా ఇది పెద్ద దెబ్బే. కానీ జయపాల్ ఎక్కడా భయపడలేదు. కడై వీధిలో మరో షాపు తెరిచాడు. కష్టం ఫలించి వ్యాపారం బాగా సాగింది.
ఫ్రూట్‌షాప్ జయపాల్
1979లో 5 ఎకరాల భూమిని తీసుకున్నాడు. దాంట్లో మామిడి చెట్లు పెట్టి తోటగా మార్చాడు. వ్యాపారి కాస్త సాగుదారుగా మారిపోయాడు. కుటుంబమంతా వ్యాపారంలోనే కష్టపడ్డారు. తర్వాత మరో 60 ఎకరాల తోటను తీసుకున్నాడు. మొత్తం 3000 మామిడి చెట్లు సాగుచేశారు. చిన్నప్పటి నుంచే తోటలను నిర్వహించిన అనుభవం ఉండటంతో కార్మికుల నిర్వహణ.. వ్యవసాయం ఈజీ అయింది. దీంతోపాటు మరో 100 ఎకరాలు లీజ్‌కు తీసుకొని మామిడి తోటలు సాగుచేస్తూ.. పళకడై జయపాల్ కాస్త ఫ్రూట్‌షాప్ జయపాల్‌గా గుర్తింపు పొందాడు.
మూడు తరాలు
ఒక్క జయపాలే కాదు.. టోటల్ ఫ్యామిలీ అంతా దీంట్లో కష్టపడుతున్నారు. చిన్న కొడుకు శ్రీనివాసన్ 10 ఏండ్ల వయసు నుంచే మామిడితో అనుబంధం ఏర్పరచుకున్నాడు. ఇప్పుడాయన వయసు 45 ఏళ్లు. శ్రీనివాసన్ నాయకత్వంలో వ్యాపారం డిజిటల్‌లోకి అడుగుపెట్టింది. దేశమంతా బల్క్ వ్యాపారం చేస్తున్నారు. దీనినొక వారసత్వ సంపదగా స్వీకరించి ముచ్చటగా మూడోతరం చేతుల మీదుగా మామిడి పండ్ల వ్యాపారం నడుస్తోంది. మొత్తం 30 రకాల మామిడి పండ్లను సాగుచేస్తున్నారు. "సేలం మామిడి" వీరి ప్రత్యేకత. మామిడి పండ్ల వ్యాపారాన్ని జూదంతో పోలుస్తాడు శ్రీనివాసన్.






