ఆశ్చర్యం.. ఈ కుటుంబం ఐదేళ్లుగా డస్ట్ బిన్ వాడటం లేదు.!

by Daayi Srishailam |

ముంబైలోని ఒక కుటుంబం ఐదేళ్లుగా డస్ట్ బిన్ వాడటం లేదు

ఆశ్చర్యం.. ఈ కుటుంబం ఐదేళ్లుగా డస్ట్ బిన్ వాడటం లేదు.!
X

ఈ రోజుల్లో చెత్త కామన్.

తింటే చెత్త.

పడుకుంటే చెత్త.

లేస్తే చెత్త.

ఇంట్లో ఏ మూలకు చూసినా..

ఇంద చాట.. ఆ చాటలో ఇంత చెత్త.!

ఇంకా వ్యర్థాల గురించి చెప్పనక్కర్లేదు.

ముక్కు మూస్తే శ్వాసాడదు.. తెరిస్తే కంపు భరించలేం.

ఇలాంటి జమానాలో ఐదేళ్లుగా అసలు డస్ట్‌బిన్ అనేదే లేకుండా బతుకుతుందో ఫ్యామిలీ.!!

- దిశ, ఫీచర్స్

సోనికా భాసిన్‌ది ముంబై. అందరి ఇళ్లూ చెత్తా చెదారంతో చిందర వందరగా ఉంటే వీళ్ల ఇల్లు మాత్రం నీట్‌గా కనిపిస్తుంది. సాయంత్రం పూట అయితే సుగంధ పరిమళాల వంటి వాసనలొస్తాయి. మనం ఇంట్లో ఉన్నామా లేదా ఏదైనా ధ్యాన కేంద్రంలో ఉన్నామా అనేంత ప్రశాంతంగా ఉంటుంది.

కిచెన్ కంటైనర్

అందరిలా సోనికా ఇంట్లో కూరగాయల వ్యర్థాలు పోగవుతాయి. ఆకుకూరలు.. వాటి నుంచి వచ్చే రసాలు.. చాయ్‌పత్తా అన్నీ ఉంటాయి. మొదట్లో వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వీలుకాకపోయేది. ఎవరి పనుల మీద వాళ్లు బిజీగా ఉండేవాళ్లు. తినడం.. వేస్టేజీనంతా ఓ టబ్బులోనో.. లేదా సింక్‌లోనో పడేసి వెళ్లేవారు. వెళ్లేటప్పుడు ఎలాగూ డోర్ పెట్టేసి వెళ్తారు కాబట్టీ.. ఆ వ్యర్థాల చుట్టూ దోమలు.. ఈగలు తిరిగేవి. కంపుకొట్టే వాసన వచ్చేది. పిల్లలకు తరుచూ జ్వరాలు.. అలర్జీలు. చెత్తవల్లే ఈ సమస్యలన్నీ అని గ్రహించి దీనికొక పరిష్కారం ఆలోచించారు.

గార్డెన్ టు కిచెన్

ఇంట్లోకి ఎంటరవగానే పచ్చని మొక్కలు స్వాగతం పలుకుతుంటాయి. హాల్‌లో నుంచి వంటగదిలోకి రాగానే అక్కడొక పెద్ద కంటైనర్ కనిపిస్తుంది. అది కూరగాయల తొక్కలు.. మొనలు.. వంటగదిలో మిగిలిన వ్యర్థాలను సేకరిస్తుంది. సాయంత్రానికి ఈ వ్యర్థాలన్నీ బాల్కనీలోని మట్టి కంపోస్టులో చేరతాయి. ఈ కంపోస్టును తోటకు ఎరువుగా వాడతారు. తోటెక్కడిది అంటారా.? వంటగది వ్యర్థాలతో ఆమె తులసి.. పుదీనా.. టమాటో.. నిమ్మ.. కరివేపాకు వంటి మినీ గార్డెన్స్ బాల్కనీలో ఏర్పాటు చేశారు. వంటగది వ్యర్థాలతో పంటలు పండించి.. మళ్లీ ఆ పంటలను వంటకు ఉపయోగిస్తారన్నమాట.

ప్రత్యేకమైన సంచి

కిచెన్ వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాలు.. చెత్తను సోనికా సమర్థవంతంగా నిర్వహిస్తోంది సోనికా. ప్లాస్టిక్.. కాగితం.. కార్డ్‌బోర్డ్.. అల్యూమినియం.. గాజు.. ఇ- వ్యర్థాలు శుష్క వ్యర్థాలను సేకరించడానికి ఆమె ఒక ప్రత్యేకమైన సంచిని తయారుచేసింది. ప్రతీ రెండు వారాలకు.. "5- ఆర్ సైకిల్" అనే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా ఈ వ్యర్థాలను తరలిస్తారు. తడి.. శుష్క వ్యర్థాలతో పాటు రిజెక్ట్ వ్యర్థాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తోంది సోనికా. రిజెక్ట్ వ్యర్థాలంటే.. శానటరీ ప్యాడ్స్.. డైపర్స్ వంటి రీసైకిల్ చేయలేని.. కంపోస్ట్ చేయలేని వస్తువులన్నమాట.

ఏమేం తగ్గిస్తారంటే.?

సోనికా.. తన ఇంట్లో పిల్లల దగ్గర్నుంచి.. పెద్దలవరకు ఒక స్పెషల్ లైఫ్‌స్టయిల్‌ను అలవాటు చేసింది. ఆమెనే కాదు.. వాళ్లింట్లో ఎవరుకూడా డిస్పోజల్ వస్తువులను వాడరు. టిష్యూ పేపర్స్‌కు బదులు క్లాత్ న్యాప్‌కిన్స్ వాడతారు. మెన్‌స్ట్రువల్ కప్ లేదా పీరియడ్ ప్యాంటీలు వంటి పునర్వినియోగ వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా ప్యాకేజింగ్ లేని కిరాణ సామాన్లకే ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ప్యాకెట్లు.. కవర్లే వ్యర్థాలకు ప్రధాన కారణం అనేది వాళ్ల అభిప్రాయం. ఏది తీసుకొచ్చినా లూజ్‌గానే తెస్తారు. అదికూడా వాళ్లు ఇంట్లో నుంచి తీసుకెళ్లిన క్లాత్ సంచుల్లోనే.

ఎందరికో స్ఫూర్తి

సోనికా ఇంటిని ఎంత అందంగా.. శుభ్రంగా ఉంచుతుందో కదా అని కొలీగ్స్.. ఫ్రెండ్స్ ఆమె గురించి డిస్కస్ చేస్తారట. అంటారు కదా.. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలనీ. ఆ సామెతకు సోనికా కరెక్టు సూటవుతుంది. ఇంటికి ఎవరొచ్చినా చాలా బాగుంది.. మేం కూడా అనుసరిస్తాం అని అంటుంటారు. దానినొక జీవనశైలిలో మార్పుగా భావించి సోనికా నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతారు. రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న చెత్త.. వ్యర్థాలను ఇంత నీట్‌గా దూరం చేసుకోవచ్చా అని తెలుసుకుంటున్నారు. డస్ట్‌బిన్ లేకుండా ఎలా బతకొచ్చో సోనికాను చూసి నేర్చుకుంటున్నారు.

Next Story