క్యాన్సర్ చికిత్సలో ‘కూల్’ విప్లవం.. గడ్డకట్టించి కణితులను హతమార్చే విధానం

by Malleboina Mahesh |

క్యాన్సర్ గడ్డలను గడ్డకట్టించి హతమార్చే సరికొత్త ‘క్రయోఅబ్లేషన్’ చికిత్స! కోత, కుట్లు లేకుండానే బ్రెస్ట్ క్యాన్సర్ కణితుల నిర్మూలన. ఇప్పుడు మనదేశంలోనూ అందుబాటులోకి.

క్యాన్సర్ చికిత్సలో ‘కూల్’ విప్లవం.. గడ్డకట్టించి కణితులను హతమార్చే విధానం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ చికిత్స (Cancer treatment) అంటేనే సర్జరీ, కోతలు, మచ్చలు, సుదీర్ఘ కోలుకునే సమయం అని భావిస్తున్నారు. అలాంటి రోగులకు 'క్రయోఅబ్లేషన్' ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ పద్ధతిలో శస్త్రచికిత్స అవసరం లేకుండానే అత్యంత శీతల ఉష్ణోగ్రతలను ఉపయోగించి క్యాన్సర్ గడ్డలను (Cancerous lumps) గడ్డకట్టించి నాశనం చేసే పయత్నాలు ముమ్మరం అయినట్లు తెలుస్తుంది. ఇందులో అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ మార్గదర్శకత్వంలో ఒక సన్నని సూదిని (Cryoprobe) నేరుగా కణితిలోకి పంపి, ద్రవ నత్రజని లేదా ఆర్గాన్ గ్యాస్ ద్వారా మైనస్ 150 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతను సృష్టించి 'ఐస్ బాల్'ను ఏర్పాటు చేస్తారు. ఇది క్యాన్సర్ కణాలలోని తేమను మంచులా మార్చి, వాటి కణ త్వచాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా కణితులను నిర్జీవం చేస్తుంది.

ఈ విధానం రోగులకు అనేక ప్రయోజనాలను చేకూర్చనున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఇది ప్రధానంగా 'ఔట్ పేషెంట్' పద్ధతి కావడంతో, చికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే రోగి ఇంటికి వెళ్ళవచ్చని చెబుతున్నారు. సాధారణ శస్త్రచికిత్స తో పోలిస్తే ఇందులో కోతలు ఉండవు, మచ్చలు పడవు, నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల సర్జరీకి తట్టుకోలేని వారికి ఇది ఒక వరం మారింది. అంతేకాకుండా, గడ్డకట్టిన క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు అవి విడుదల చేసే ప్రోటీన్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను (Immune System) ఉత్తేజితం చేసి, మిగిలిన క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు.

భారతదేశంలో కూడా ఈ సాంకేతికత ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది. 2023లో కోయంబత్తూరులోని కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ (KMCH)లో దేశంలోనే తొలిసారిగా బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ఈ చికిత్సను ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లోని ప్రధాన ఆంకాలజీ ఆసుపత్రులలో కూడా క్రయోఅబ్లేషన్ సేవలు లభిస్తున్నాయి. అయితే, ఈ చికిత్స ప్రస్తుతానికి ప్రారంభ దశలో ఉన్న చిన్న కణితులకు (సుమారు 2 సెం.మీ లోపు) మాత్రమే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని, ముదిరిన క్యాన్సర్ల విషయంలో ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story