- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొర్రెల కాపరి.. కుక్ కూతురు వీళ్లే సివిల్స్ టాపర్స్.!
UPSC 2024 లో అత్యధిక టాపర్లు అయిన ఒక కుక్ కూతురు, ఒక షెపర్డ్

కలలు కనండి.
అవి ఎలాంటి కలలంటే.
ఇదిగో.. వీరిలాంటి కలలు.
కష్టాలు అందరికీ ఉంటాయి.
సమస్యలు అందర్నీ వెంటాడుతాయి.
వీళ్లేమీ పుట్టినప్పుడే వెండిచెంచను నోట్లో పెట్టుకొని పుట్టలేదు.
కడు పేదరికంలో పుట్టినవాళ్లు.
ఇప్పుడు సివిల్స్ విజేతలు.
నేటి యువతకు స్పూర్తిదాతలు.
- దిశ, ఫీచర్స్
సివిల్ సర్వీసెస్ ఫలితాలు దేశంలోని వేల ఇండ్లలో సంతోషం నింపుతాయి. ర్యాంకులు.. మార్కులు మనం చెప్పుకునే నెంబర్లే కావచ్చు. కానీ వాటి వెనకున్న కష్టం మాటల్లో చెప్పలేనిది. రాత్రంతా చదువు.. కష్టాలు.. కన్నీళ్లు.. కుటుంబ త్యాగాలు నిండి ఉంటాయి. ఈసారి సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన వారు ఎన్ని కష్టాలు పడ్డారో చూసి నేర్చుకోండి.
గొర్రెల కాపరి
కర్ణాటకకు చెందిన బీరప్ప డోని గొర్రెల కాపరి. బీటెక్ చదివిన బీరప్ప పోస్టల్ జాబ్ చేసేవాడు. తన అన్న ఆర్మీలో చేరగా బీరప్ప కూడా ఆర్మీగా సేవ చేయాలి అని అనుకునేవాడు. కానీ అనూహ్యంగా సివిల్స్ వైపు తన దృష్టిని మరల్చి కష్టపడి చదివాడు. ఇప్పటికీ అతడు గొర్రెలు కాస్తూనే ఉంటాడు. సివిల్స్‌లో 551వ ర్యాంక్ వచ్చిందని ఫోన్ కాల్ వచ్చినప్పుడు కూడా గొర్రెల వెంటే ఉన్నాడట.
పంచర్ షాపతని కొడుకు
ఇక్బాల్ అహ్మద్ సివిల్స్‌లో 998 ర్యాంకు సాధించాడు. వాళ్లది యూపీలోని నందౌర్. తండ్రి మక్బూల్ అహ్మద్ సైకిళ్లు పంచర్ చేస్తాడు. తాను చేసేది పంచర్ పనే అయినా తన కొడుకు మాత్రం పెద్ద ఆఫీసర్ కావాలని కలగన్నాడు మక్బూల్. చేతిలో డబ్బులేకపోయినా చదివించాడు. మొదట యూపీపీఎస్సీలో లేబర్ ఆఫీసర్ అయ్యాడు. తర్వాత పట్టుదలతో చదివి 998 ర్యాంకు తెచ్చుకున్నాడు.
కళ్లు కనిపించవు
అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లు కనీసం పాస్ మార్కులు తెచ్చుకోమంటే ఆపసోపాలు పడుతుంటారు. కానీ జైపూర్‌కి చెందిన మను గార్గ్ కంటిచూపు లేకున్నా సివిల్స్‌లో 91వ ర్యాంక్ సాధించాడు. తనకు 9వ తరగతిలోనే కంటిచూపు పోయింది. తండ్రి చనిపోయాడు. స్నేహితులు దూరమయ్యారు. తల్లి తనకు అండగా నిలిచి చదివించింది. బ్రెయిలీ నేర్చుకోకుండానే రెండో ప్రయత్నంలో ర్యాంక్ సాధించాడు.
వంటమనిషి కూతురు
సివిల్స్ 263వ ర్యాంక్ సాధించిన ప్రీతీ ఏసీది పేద కుటుంబం. తండ్రి చన్నబసప్ప వంట మనిషి. అతడు చదువుకోలేదు. ప్రీతిని మొత్తం గవర్నమెంట్ స్కూల్.. గవర్నమెంట్ కాలేజీల్లోనే చదివించాడు. తాను వంట పనిచేసినా తన బిడ్డ మాత్రం కలెక్టర్ కావాలని కలగన్నాడు చెన్నబసప్ప. తండ్రి కలల్ని.. తన ఆశయాన్ని సాకారం చేస్తూ ప్రీతి మంచి ర్యాంకు సాధించి.. వంటవాడి కూతురు కలెక్టరయ్యిందీ అని ప్రశంసలు పొందుతున్నది.
తల్లిని కోల్పోయింది
యూపీఎస్సీ ఫలితాల్లో 2వ ర్యాంక్ సాధించిన అమ్మాయి హర్షిత గోయల్. వాళ్లది రాజస్థాన్ అయితే గుజరాత్‌లో స్థిరపడ్డారు. బరోడా యూనివర్సిటీలో చార్టెట్ అకౌంటెంట్ చదివిన హర్షిత మూడవ ప్రయత్నంలో యూపీఎస్సీ 2వ ర్యాంక్ సాధించింది. ఆమె ప్రిపరేషన్లో ఉండగానే తల్లి మరణించింది. అయినా కూడా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకుంది.
బిడ్డకు తల్లి
సివిల్స్‌లో 45వ ర్యాంక్ సాధించిన మాళవికది కేరళ. ఆమెది మామూలు ధైర్యం కాదు. సెప్టెంబర్ 3న ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన 17 రోజుల తర్వాత యూపీఎస్సీ మెయిన్స్ రాసింది. ఆ సమయంలో కూర్చోవడమే కష్టం. అలాంటిది ఆమె మంచి ర్యాంక్ సాధించింది. 2020 నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్‌గా చేస్తున్నప్పటికీ ఐఏఎస్ కావాలనేది ఆమె లక్ష్యం. అందుకే కష్టపడి పాసైంది.
పోలీస్ కూతురు
యూపీఎస్సీ 2024లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన అమ్మాయి శక్తి దూబే. వాళ్లది యూపీలోని ప్రయాగ్ రాజ్. తండ్రి దేవేంద్ర కుమార్ దూబే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేస్తాడు. నేను శక్తికి కావాల్సినవన్నీ ఇచ్చాను.. కష్టమంతా నా బిడ్డదే అంటున్నాడు దేవేద్ర కుమార్. ఆమె తిండీ.. తిప్పలు మానేసి రోజుకు 19 గంటలు చదివిందంటా.






