సౌర్‌సించ్ ఏఐ.. రైతుల కష్టం తీర్చే వినూత్న పరికరం!

by Javid Pasha |

ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో పరిష్కారం చాలా సులభం అవుతుంది.

సౌర్‌సించ్ ఏఐ.. రైతుల కష్టం తీర్చే వినూత్న పరికరం!
X

దిశ, ఫీచర్స్ : సమస్య ఉన్నచోట పరిష్కారం కూడా పుట్టుకొస్తుంది అంటారు నిపుణులు. సాంకేతిక ఆవిష్కరణలకు సైతం ఇది వర్తిస్తుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ టెక్నాలజీని ఉపయోగిస్తేనో లేక కొత్త ఆవిష్కరణను కనుగొంటేనో పరిష్కారం చాలా సులభం అవుతుంది. గుజరాత్‌కు చెందిన ఓ పదహారేళ్ల యువకుడు అయాన్ పటేల్ (Ayan Patel) సరిగ్గా ఇదే చేశాడు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక, వేసిన పంటలకు నీరు అందక ఇబ్బంది పడుతున్న రైతుల బాధలను చూసి చలించిపోయాడు. అందుకు పరిష్కారమార్గం అన్వేషించే క్రమంలో సౌర్‌సించ్ ఏఐ(SaurSinchAI) అనే వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశాడు. ఇంతకీ అదెలా పనిచేస్తుంది? ప్రయోజనాలేమిటి?

ఇరిగేషన్ రోవర్‌ ఆవిష్కరణ

భారతీయ గ్రామాల్లో వేసవి రాకముందే బోరు బావులు ఎండిపోతున్న పరిస్థితులు అనేచోట్ల ఉంటున్నాయి. ఒకవేళ బోరుబావులు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదు. మరికొన్నిచోట్ల పంటలకు నీరు అందించే పద్ధతులు భూగర్భజలాలను వృథా చేస్తున్నాయి. ఉత్తర గుజరాత్‌లోని వేపచెట్ల కింద జరిగే ‘ఖేడుత్ సభ’ల్లో రైతుల తరచూ ఇదే విషయమై ఆవేదన చెందడాన్ని స్వయంగా పరిశీలించిన ఆయాన్ పటేల్ సమస్యను లోతుగా అర్థం చేసుకొని, ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఏంటంటే.. సౌరశక్తితో నడిచే ఏఐ ఆధారిత ఇరిగేషన్ రోవర్‌(Agri-Bot)ను డెవలప్ చేశాడు. దీనికి సౌర్‌సించ్ ఏఐ అని పేరు పెట్టాడు. ఇది నేలలో తేమ, పోషకాలు, pH స్థాయిలను రియల్‌టైమ్‌లో పరీక్షించి, పంటలకు అవసరమైనంత నీరు మాత్రమే అందిస్తుంది.

70% వరకు నీటి ఆదా

సౌర్‌సించ్ అనే ఏఐ పరికరం పనితీరును పరిశీలించేందుకు అయాన్ పటేల్ తన బృందంతో కలిసి 1,800కిపైగా నేల పరీక్షలు నిర్వహించాడు, అంతేకాకుండా ఈ సాంకేతికతను అందించడం ద్వారా 3,300కు పైగా రైతులను, 240 మంది మహిళా మహిళా ఎంట్రప్రెన్యూర్లను సాధికారం చేశాడు. దీంతో 70% వరకు నీటి ఆదా, 30% వరకు పంట దిగుబడి పెరుగుదల సాధ్యమైంది. పలువురు రైతులు విద్యుత్ కోతల నుంచి ఇబ్బందులను అధిగమించడానికి, భూతర్భ జలాలను రక్షించుకోవడానికి సౌర్‌సించ్ ఏఐ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. అయాన్ పటేల్ స్థాపించిన అగ్రినోవా ఎక్విప్‌మెంట్(DPIIT-గుర్తింపు పొందిన స్టార్టప్) ద్వారా ఇది అభివృద్ధి చేయబడుతోంది. మార్కెట్లో అందుబాటులో ఉంది. మొత్తానికి సమస్య ఉన్నచోట ఆధునిక సాంకేతికత అవసరం ఎంత ముఖ్యమో ఈ ఆవిష్కరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Next Story