94 ఏళ్ల తాతవ్వ.. గోల్డ్ మెడల్స్ విజేత.!

by Daayi Srishailam |

ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది

94 ఏళ్ల తాతవ్వ.. గోల్డ్ మెడల్స్ విజేత.!
X

దిశ, ఫీచర్స్: వయసు కేవలం సంఖ్య మాత్రమే అని తాతయ్యలు.. నాన్నమ్మలు ఎక్కడో ఒకచోట నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి కోవకే చెందుతుంది రాజస్థాన్‌లోని బీకానీర్‌కు చెందిన 94 ఏళ్ల పానీదేవి గోడారా. ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది రికార్డు సృష్టించింది.

బామ్మ.. బంగారు పతకం..

చెన్నయ్‌లో జరిగిన 23వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అమ్మమ్మలు.. తాతయ్యలు తడాఖా చూపించారు. 90 ఏళ్లు పైబడిన వయసు విభాగంలో 100 మీటర్ల రన్.. షాట్ పుట్.. డిస్కస్ థ్రో.. జావెలిన్ థ్రోలలో గెలిచింది 94 ఏళ్ల పాని దేవి గోడారా. ఈ విజయాలతో గ్రామీణ జీవితం నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈ వృద్ధాప్యంలో కూడా అథ్లెటిక్స్ పట్ల ఆసక్తి.. కష్టపడి ప్రాక్టీస్ చేసే ధోరణి తన చలాకీదనాన్ని నిరూపిస్తున్నాయి. తన సాధన.. విజయం.. బంగారు పతకాలు పానీదేవికే కాదు.. దేశం మొత్తానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

16 గోల్డ్ మెడల్స్..

"గోల్డెన్ గ్రాండ్‌మా"గా పిలవబడే పానీదేవి 94 ఏళ్ల వయసులో కూడా10 మందికి వంట చేస్తుంది. ఆవులను పోషించడం.. వాటికి మేతను సేకరించడం తనకు వ్యాయామంగా మారి.. ఫిట్‌నెస్‌కు సహాయపడుతున్నాయి. పానీదేవి శారీరక దృఢత్వం కోసం ప్రత్యేకమైన తిండి ఏం తినదు. మనమంతా తినే సాధారణ ఆహారమే తీసుకుంటుంది. దేశీ ఘీ.. పాలు.. బాజ్రా రొట్టెలు తన రెగ్యులర్ ఫుడ్. ఈ రోజువారీ డిసిప్లిన్‌తోనే తన కెరీర్లో మొత్తం 16 గోల్డ్ మెడల్స్ సాధించింది. తాజాగా చెన్నయ్‌లో నవంబర్ 5 నుంచి 9 వరకు జరిగిన ఛాంపియన్‌షిప్‌లో నాలుగు ఈవెంట్‌లలో టాప్ పొజిషన్ సంపాదించింది.

వెనకడుగు వేయలే..

పానీదేవికి ఈ విజయం అంత సులభంగా ఏం రాలేదు. జాతీయ.. ఆసియా స్థాయిలో ఎన్నోసార్లు గెలిచినా ఆర్థిక సమస్యల వల్ల విదేశీ పోటీలకు వెళ్లలేకపోయింది. గతేడాది స్వీడన్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్‌షిప్ లేకపోవడంతో పాల్గొనలేకపోయింది. ఐనా కూడా తన ఆసక్తి తగ్గలేదు. వెనకడుగు వేయలేదు. వయసు.. లింగ వివక్షలను ఛేదించి ఆదర్శంగా నిలుస్తోంది. వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు ఆశలు నింపుతోంది. వయసు మనల్ని ఆపదు.. అనే తన మాటలు లక్షల మందిని ప్రేరేపిస్తున్నాయి. తాను గెలిచిన బంగారు పతకాలు ఈ పల్లె ఆణిముత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.

Next Story