- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: "పుస్తె" ఎంతో పవిత్రమైంది. ఇప్పుడంటే పెద్దగా ఎవరూ వేసుకుంటలేరుగానీ.. పుస్తె అంటే కొందరికి ప్రాణంతో సమానం. ఇక్కడొక తాత కథలో "పుస్తె" ఒక కలగా మారింది. ఏండ్లకింద భార్యకిచ్చిన మాటకోసం.. పైసా పైసా కూడబెట్టుకున్నాడు. ఆఖరికేమైందో కథలోకి ఎంట్రీ అయి తెలుసుకుందాం.
అవ్వకిచ్చిన మాటకోసం..
అది మహారాష్ర్టలోని జాల్నా జిల్లా. అంభోరా జాగీర్ అనే ఊర్లో 93 ఏళ్ల తాత ఉంటాడు. ఆ తాత పేరు నివృత్తి షిండే. అతడి భార్య శాంతాబాయి. షిండే తాత ఓ 15 ఏళ్ల కింద శాంతాబాయి అవ్వకో మాటిచ్చిండు. అదేంటంటే.. బంగారం పుస్తె కొనియ్యాలనీ. కానీ పేదొళ్లాయె. అందులో ముసలొల్లు. చాతగాకుంట అయినంక బంగారం కొనిస్తందకు పైసలెక్కడివి.? ఆ వయసులో కూడా తాత, అవ్వ వ్యవసాయం చేస్తుంటరు. కానీ వ్యవసాయంతో పెద్దగా ఆదాయమొచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పుడిన్ని ఇప్పుడిన్ని పైసలు దాచిపెట్టుకున్నాడు షిండే తాత.
బంగారం షాప్‌లకువొయ్యి..
షిండే, శాంతాబాయి ఇద్దరూ కలిసి పండరీపూర్‌లో జరిగే ఆషాడ ఏకాదశి ఉత్సవాలకు బయల్దేరారు. సంభాజీ నగర్లోని ఒక బంగారం దుకాణ్లకు వెళ్లారు. ఏదో సాధించిన వాడిలా షిండే తాత "ఏం శాంతమ్మా.. పుస్తెకావాలంటివిగా తీస్కో నీకు ఇష్టమొచ్చిందీ" అని అన్నాడు. "నీ దగ్గర పైసలెక్కడివయ్యా.. సప్పుడేక నడ్వు జాతరకువోదాం" అని శాంతాబాయి అన్నది. "ఏయ్ ముసల్దానా నన్ను తక్వంచనేస్తున్నవా.? నీకేది కావాల్నో సెలక్ట్ చేస్కో నువ్వయితే" అని అన్నాడు. "ఈ మనిషి దగ్గర నిజంగనే పైసలున్నట్టున్నయి కదా" అనుకొని "ఇగో ఇది కావాలె ఇప్పిస్తవా" అని ఒక పుస్తెను సెలెక్ట్ జేశింది శాంతవ్వ.
ఆ పైసలకు రాదన్నరు
శాంతాబాయి ఐటమ్‌ను సెలెక్ట్ చేసుకోగానే షిండే తాత సంచిలో, ధోతి జేబులో దాచుకున్న పైసల్ని కౌంటర్ ముందు కుప్పవోశిండు. రూ.100, రూ.500, రూ.100 నోట్లతో కలిపి చిల్లర పైసలు కూడా బాగనే పడ్డయి. అవన్నీ లెక్కవెడితే రూ.1,120 మాత్రమే ఉన్నయి. "ఇగో సేటూ ఇవిదీస్కొని మా ముసల్దానికి ఆ బంగారం పుస్తె ఇయ్యి" అని అన్నడు. "ఈ పైసలకు బంగారం కాదు.. వన్ గ్రామ్ కూడా రాదుపోండ్రీ" అని అన్నారు సేల్స్‌మెన్స్. ఇదంతా చూసిన ఓనర్ నీలేష్ దగ్గరికొచ్చి "ఏమైంది తాతా" అని అడిగాడు. తాత ముచ్చటంతా చెప్పిండు.
రూ.20కే బంగారు పుస్తె
షిండే తాత, శాంతాబాయి మీదున్న ప్రేమతో, 15 ఏండ్ల కింద ఇచ్చిన మాటకోసం పైసలు జమచేసి బంగారం షాపులోకి తీసుకురావడం చూసి నీలేష్ ఫిదా అయ్యాడు. వీళ్లు అసలైన మనుషులు.. వీళ్లది అసలైన ప్రేమంటే అనుకున్నాడు. తాత కౌంటర్ మీద పోసిన నోట్లన్నీ తీసి ఇచ్చేసిండు. "తాతా.. అవ్వమీద నువ్వు సూపెట్టిన ప్రేమ చాలు.. ఈ పైసలేవీ వద్దు. నీ ప్రేమ మాకెప్పటికీ గుర్తుండాలె కాబట్టీ ఇగో ఈ ఇరవై రూపాయల చిల్లర తీసుకుంటున్నా. నువ్వు ముందయితే ఈ పుస్తెను తీసి అవ్వ మెడలే వెయ్యి" అని అంటే తాత మస్తు సంబరపడ్డడు. హమ్మయ్యా.. ఇచ్చినమాట నిలబెట్టుకున్నా అనుకుంటూ ఉత్సవాలకు వెళ్లారు.






