- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎడ్లబండి ఎటువాయెనో..! పల్లెచుట్టూ అల్లుకుపోయిన 90s కిడ్స్ జ్ఞాపకాలు
ప్రతీ వ్యవసాయ కుటుంబంలో ఎడ్ల బండి తప్పక ఉండేది. అప్పట్లో గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లు వాడేది కాదు. అడవి నుంచి ఎండిన కట్టెలు బండిలో తీసుకొచ్చి వాటినే ఉపయోగించేవాళ్లు ఊరి జనాలు.

దిశ, ఫీచర్స్ : చలికాలం దాటి ఎండాకాలంలోకి అడుగుపెడుతున్న సందర్భమంటే.. మదిలో పాత జ్ఞాపకాలెన్నో సుడులు తిరుగుతుంటాయి కొందరికి. పల్లెల్లో ఉన్నా.. పట్టణాల్లో ఉన్నా ఆ తరం ఆలోచనలు, భావోద్వేగాలు చాలా వరకు పల్లె చుట్టే అల్లుకుపోయి ఉంటాయి. చిన్నప్పుడు ఆడిన ఆటలు, తిరిగిన వీధులు, పంటపొలాలు, తల్లిదండ్రులతో, స్నేహితులతో కలిసి గడిపిన క్షణాలు నిద్దురపోయిన గత స్మృతులను తట్టిలేపుతుంటాయి. అలాంటి అరుదైన, అందమైన జ్ఞాపకాల్లో ఎడ్లు, ఎడ్లబండి యాది కూడా ఒకటి. నిజానికి ఒకప్పుడిది పల్లెరైతుల బతుకు బండి. ప్రజల ముఖ్యమైన ప్రయాణ సాధనం. ఇప్పుడు ఎక్కడో ఒకచోట తప్ప.. అప్పటి లెక్క అంతటా కనిపించడం లేదు. వ్యవసాయంలో ఎండ్ల బండి స్థానాన్ని ట్రాక్టర్లు భర్తీ చేస్తున్నాయి.
బండిపై తిరిగిన యాది..
పండగకో, సెలవులకో పల్లెటూరు వెళ్లినప్పుడు పెరట్లోనో, స్టోర్ రూముల్లోనో, పొలాల వద్ద కొట్టంలోనో ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్న బండి చక్రాలు, శీలలు, ఇరుసు, కందెన కుండలు, మంకెన బద్ధలు దర్శనమిస్తుంటాయి. వీటిని చూసి ఎమోషనల్ అయ్యే వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. ఊర్లల్లో ఇప్పటికీ అక్కడి రైతుల ఇండ్లవద్దనో, పొలావద్దనో ఏదో ఒక మూలన ఎడ్లబండి తాలూకు ఏదో ఒక చిహ్నం కనిపిస్తూ ఉంటుంది. అది చూసి చిన్నప్పుడు ఎడ్లబండిపై ఎక్కి ఎలా ఎంజాయ్ చేసేవాళ్లమో గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఎడ్లబండ్లకు చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే.. రాబోయే వానాకాలం పంటకోసం.. ఇండ్ల వద్ద, ఊరి చివర్లో లేదా పొలాల్లోనే ఒకచోట జమ అయిన గోవుల పేడ(పెంట)ను పొలాల్లో చల్లడానికి ఎడ్ల బండ్లల్లో తీసుకుపోయేవారు. అప్పట్లో ఇవే ఎరువులు. ఇప్పుడు వీటిని సేంద్రియ ఎరువులు అంటాం. అప్పట్లో అందరూ ఇవే ఎక్కువగా వాడేవారు కాబట్టి కల్తీ లేని ఆహారాలు, కూరగాయలు ఉండేవి.
అడవికి వెళ్లి.. కట్టెలు తెచ్చి..
ప్రతీ వ్యవసాయ కుటుంబంలో ఎడ్ల బండి తప్పక ఉండేది. అప్పట్లో గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లు వాడేది కాదు. అడవి నుంచి ఎండిన కట్టెలు బండిలో తీసుకొచ్చి వాటినే ఉపయోగించేవాళ్లు ఊరి జనాలు. అలా నాన్న, తాత, అమ్మ, పొలం చుట్టు పక్కలవాళ్లు కట్టెలకోసం ఎడ్ల బండి కట్టుకొని అడవికి పోతుండె. వాళ్ల వెంబడి వాళ్ల పిల్లలు కూడా పోయేవాళ్లు. పొద్దున్న అడవికి వెళ్తుప్పుడే సద్ది కూడా కట్టుకుపోయేది. మట్టి ముంతలో నీళ్లు తీసుకెళ్లేది. అడవిలోకి వెళ్లాక అమ్మా, నాన్న, తోడుగా వచ్చిన పొలం చుట్టు పక్కలవాళ్లు కట్టెలు ఏరుతుంటే.. పిల్లలు సరదాగా బండిలో కూర్చొని, మోదుగాకుల్లో అన్నం పెట్టుకొని తిన్న జ్ఞాపకాలు 90 కిడ్స్ మనసులో ఇప్పటికీ పదిలమేనని చెబుతుంటారు. నిజంగా ఆ రోజులు ఎంత బాగుండేవో అసలు.
ముఖ్యమైన ప్రయాణ సాధనం
ఏమాటకామాట కట్టెల పొయ్యిమీద ఏ వంట చేసినా చాలా రుచిగా ఉండేది. నేడు పట్టణాల్లో సిలిండర్లపై చేసే వంటలో ఆ రుచి రావడం లేదు ఎందోకో మరి! అడవికే కాదు. పొలానికి రైతులు నాగళ్లు, ఎరువు బస్తాలు తీసుకెళ్లడానికి, పంటను ఇంటికి తేవడానికి, అలాగే ఊరి చుట్టు పక్కల జరిగే జాతర్లకు వెళ్లడానికి అప్పట్లో అతి ముఖ్యమైన ప్రయాణ సాధనం ఎడ్ల బండే. జాతర్లు ఎక్కువగా ఎండాకాలంలోనే వస్తాయి. కుటుంబం అంతా కలిసి ఎడ్ల బండిని రంగు రంగు కాగితాలతో అలంకరించి, ఎండ తగలకుండా తట్టు సంచులతోనో, బొంతలతోనో డేరాలు కుట్టి బండిపైకప్పులాగా కట్టేవాళ్లు. దీంతో బండిలో కూర్చొని ఎండలో ప్రయాణించినా ఎండతగిలేది.
జాతర్లకు, ఊర్లకు బండిలోనే..
అలా జాతర్లకు వెళ్తున్నప్పుడు చప్పుడు రావాలని ఎడ్ల మెడలో గంటలు కట్టేవాళ్లు. బండిలో కూర్చొని పోయేవాళ్లు సంతోషంగా పాటలు పాడేవారు. జాతరకు వెళ్లాక అక్కడే బండిని ఒక చోట ఆపుకొని, బండికింద వంట చేసుకొని తింటూ ఒకటి రెండు రోజులు కూడా అక్కడే ఉండేవాళ్లు. ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్లినా కలగని ఆనందాన్నిచ్చేది ఈ ఎడ్లబండి ట్రిప్ అండ్ డెస్టినేషన్ అప్పట్లో. జాతర్లే కాదు. పెండ్లిలల్లో, ఒక ఊరి నుంచి మరో ఊరికి వస్తువులు తరలించడంలో, ధాన్యం తరలించడంలో అప్పుడు ఎడ్లబండే ముఖ్యమైన ప్రయాణ సాధనం. ఇప్పుడా జోడెడ్లబండి జాడలేదు. కానీ దాని తాలూకు జ్ఞాపకాలు మాత్రం పదిలమే!






