వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు.. అయినా రాత్రిళ్లు క్యాబ్ నడుపుతూ..!

by Javid Pasha |   (  Updated:2025-11-08 10:55:44  IST  )

వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన ఓ వ్యక్తి, స్వయంగా క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద బాలికల చదువుకోసం దానం చేస్తున్నాడు.

వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు.. అయినా రాత్రిళ్లు క్యాబ్ నడుపుతూ..!
X

దిశ, ఫీచర్స్ : నెలకు లక్ష రూపాయల ఆదాయం వస్తేనే నా అంతటి వాళ్లు లేరని ఫీలవుతుంటారు కొందరు. చిన్న చిన్న పనులు చేయడానికి, తమకంటే తక్కువ ఆదాయం గలవారితో స్నేహం చేయడానికి నామోషీ ఫీలవుతుంటారు మరికొందరు. అహంకారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమే అయినా.. కొందరిలో ఇటువంటి బ్యాడ్ బిహేవయర్ చూస్తుంటాం. కానీ ఇలాంటి వారికి కనువిప్పు కలిగించే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన ఓ వ్యక్తి, స్వయంగా క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద బాలికల చదువుకోసం దానం చేస్తున్నాడు. ఆ వివరాలేమిటో చూద్దాం.

పేరు జోన్. వయసు 86 ఏండ్లు. ఫీజీ దేశంలోని సువా నగరంలో నివసించే భారతీయ మూలాలు కలిగిన ఇతను వేలకోట్ల వ్యాపార సామాజ్యానికి అధిపతి. అతని తండ్రి 1929లో భారత్‌ నుంచి ఫీజీకి వలస వెళ్లాడు. అప్పట్లో అతను కేవలం 5 పొండ్లతో, అంటే నాడు ఇండియన్ కరెన్సీలో 65 రూపాయలతో ఫీజీలో ప్రారంభించిన వ్యాపారం దిన దినాభివృద్ధి చెందింది. ఇప్పుడు13 జ్యువెలరీ షాపులు, 6 రెస్టారెంట్లు, 4 సూపర్‌మార్కెట్లు, ఒక లోకల్ న్యూస్‌పేపర్, వోల్‌సేల్ పెర్ఫ్యూమ్ వంటి వివిధ రంగాల్లో విస్తరించిన జోన్ వ్యాపారం రూ. 1,500 కోట్ల టర్నోవర్ ($175 మిలియన్) సాధిస్తోంది. కోట్లాది వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైనప్పటికీ పదేండ్ల నుంచి అతను రాత్రిపూట ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

‘‘డ్రైవింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రతీ సంవత్సరం 24 మంది ఇండియన్ పేద బాలికల చదువుకోసం కేటాయిస్తున్న. వాళ్ల స్కూల్ ఫీజు, హయ్యర్ ఎడ్యుకేషన్ లేదా వొకేషనల్ ట్రైనింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది’ అంటున్నాడు బిలియనీర్ క్యాబ్ డ్రైవర్ జోన్. అయితే తన సొంత కష్టం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఇలా కేటాయిస్తాడు తప్ప తనకున్న ఇతర వ్యాపారాల నుంచి వచ్చే ప్రాఫిట్‌ను దానం లేదా సహాయం చేయడానికి ఉపయోగించనని కూడా అతను పేర్కొన్నాడు. తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని, వారికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి సెటిల్ చేశానని చెబుతున్న జోన్, తన కూతుర్ల లాగే పేద బాలికల ఎదగాలనే ఆకాంక్షతో సహాయం చేస్తున్నట్లు తెలిపాడు. ఈ స్టోరీకి సంబంధించిన పోస్ట్‌ను ప్రముఖ భారతీయ ఎంటర్‌ప్రెన్యూర్ నవ్ షా (Nav Shah) సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ‘ట్రూ లెజెండ్’ ‘ఇన్‌స్పిరేషన్’ అని నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు. Link

Next Story