పుస్తకాల మనె.. అంకే గౌడ అరుదైన సేకరణలు.!

by Daayi Srishailam |

పైసలు పోగైన ప్రతీసారి కొన్న పుస్తకాలు కొనుక్కొని లైబ్రరీలో పెట్టేవాడు

పుస్తకాల మనె.. అంకే గౌడ అరుదైన సేకరణలు.!
X

దిశ, ఫీచర్స్: కర్ణాటకలోని చిన్న గ్రామం హరళహళ్లి. ఆ ఊర్లో అంకే గౌడా అనే 75 ఏళ్ల పెద్దాయన పుస్తకాలే ప్రపంచంగా జీవిస్తున్నాడు. పుస్తకాల మానే అనే ప్రైవేట్ లైబ్రరీని నిర్మించి దాదాపు 20 లక్షల పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నాడు.

కండక్టర్‌గా పనిచేస్తూ..

అంకే గౌడా దాదాపు 50 సంవత్సరాలుగా తన ప్రైవేట్ గ్రంథాలయాన్ని నడిపిస్తున్నాడు. దీనిని పుస్తకాల మానే అని పిలుస్తారు. చదువుకోవాలి అనుకునే ఎవరైనా ఈ తలుపు తెరుచుకొని పోవచ్చు. ఇక్కడ భాషలు, సంస్కృతులు అన్నీ ఒక్కటిగా కలిసి ఉంటాయి. అంకే గౌడా బస్ కండక్టర్‌గా పనిచేస్తూ కన్నడ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. వచ్చిన జీతంలో కుటుంబ ఖర్చులకు, చదువులకు అని ఎలా కేటాయించాడో లైబ్రరీ కోసం అని కూడా కేటాయించి.. నాలుగు పైసలు పోగైన ప్రతీసారి కొన్న పుస్తకాలు కొనుక్కొని లైబ్రరీలో పెట్టేవాడు.

ఇంటిని కూడా అమ్మేసి..

చదువంటే పాఠ్యపుస్తకాలలో పొందు పరిచే విషయాలను చదివి పరీక్షల్లో పాస్ అవ్వడమే కాదు.. చదువంటే భాషా, సాంస్కతిక, చరిత్ర, సాహిత్య పుస్తకాలను అధ్యయనం చేసి.. దానిని పది మందికి పంచడం అనేది అతడి ఉద్దేశం. సంపాదన అంటే బ్యాంకులో లక్షల రూపాయల నగదు, ఒంటిపై బంగారం, స్థిరాస్థి, చరాస్థి మాత్రమే కాదు.. మనం నేర్చుకున్న దాన్ని పదిమందికి నేర్పడం అంటాడు ఆయన. అందుకే చిన్న చిన్న సౌఖర్యాలను వదులుకొని.. ఆఖరికి మైసూరులోని తన ఇంటిని కూడా అమ్మేసి పుస్తకాలు కొనుక్కొని ప్రజలకు అందుబాటులో ఉంచాడు.

ఆదాయంలో 80 శాతం పుస్తకాలకే..

ఆశయం గొప్పదైతే మాత్రమే సరిపోదు.. అయినవాళ్ల సహకారం కూడా ఉండాలి. అదృష్టంకొద్దీ అంకే గౌడాకు కుటుంబ సహకారం చాలా ఉంది. భార్య, పిల్లలు తనను, తన ఆసక్తిని ఎప్పటికీ గౌరవిస్తుంటారు. అంతేకాదు.. తన ఆశయంలో వాళ్లూ భాగస్వాములయ్యారు. ఈ కుటుంబం ప్రతిరోజూ పుస్తకాలను శుభ్రం చేస్తూ వాటిని ప్రజలకు అందుబాట్లో పెడతారు. చిన్నప్పుడు పుస్తకాలు అందుబాటు లేకపోవటం వల్ల తాను ఎదుర్కొ్న్న అనుభవంలో నుంచి పుట్టిందే ఈ లైబ్రరీ ఆలోచన. తొలుత 20 ఏళ్ల వయస్సులో 25 పైసలకు మొదటి పుస్తకాన్ని కొన్నాడు. ఆ తర్వాత ఆదాయంలో 80 శాతం పుస్తకాలకే వాడేవాడు.

20 భాషలు.. 20 లక్షల పుస్తకాలు

పుస్తకాల మానే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పీహెచ్‌డి విద్యార్థులు, పరిశోధకులు, సివిల్స్ ఆశావహులు, రచయితలు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. స్థానికులు, పర్యాటకులు, ప్రత్యేకించి మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలను వివిధ భాషల్లో చదవడానికి వచ్చే వారు ఎక్కువగా ఉంటారు. ఇక్కడి ర్యాక్స్‌లో 20 భాషల పుస్తకాలు ఉంటాయి. క్లాసికల్ సాహిత్యం, పురాతన తత్వశాస్త్రం, సైన్స్, టెక్నాలజీ, కవిత్వం అన్నీ ఉంటాయి, ప్రత్యేకించి 5 లక్షల అరుదైన విదేశీ టైటిల్స్, 5 వేలకు పైగా బహుభాషా డిక్షనరీలు. ఇలా 20 భాషలలో 20 లక్షల పుస్తకాలుంటాయి.

ప్రతీ పుస్తకం డిజిటలైజ్డ్..

పారిశ్రామికవేత్త స్రీ హరి ఖోడే సహకారంతో 22 గుంటల విస్తీర్ణంలో పెద్ద భవనాన్ని నిర్మించాడు. భారతదేశంలో అతిపెద్ద వ్యక్తిగత సేకరణలలో ఇదొకటి. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చేరింది. ప్రతి నెలా బుక్ షాపులు, పబ్లిషర్స్, సెకండ్ హ్యాండ్ సెల్లర్ల నుంచి 1,000 పుస్తకాలు సేకరిస్తున్నాడు. అంకే గౌడాకు పుస్తకాలు సేకరించడమే అంతిమ లక్ష్యం కాదు. పుస్తకాల మానేను జీవంతమైన జ్ఞాన కేంద్రంగా మార్చాలని కలలు కంటున్నాడు. 75 ఏళ్ల వయస్సులో కూడా పుస్తకాలను శుభ్రం చేస్తూ క్యాటలాగ్ చేస్తున్నాడు. జ్ఞాన ప్రతిష్ఠాన్ ద్వారా ప్రతీ పుస్తకాన్ని డిజిటలైజేషన్ చేశాడు.

Next Story