వామ్మో.. ఈ తండ్రీ కూతుర్లేంది సామీ ఐరన్ మనుషుల్లా ఉన్నారు.!

by Daayi Srishailam |

ఈ కాలం పేరెంటింగ్ ఎలా ఉండాలో చెప్తున్నారు.

వామ్మో.. ఈ తండ్రీ కూతుర్లేంది సామీ ఐరన్ మనుషుల్లా ఉన్నారు.!
X

రిజేష్ అతని ఏడేళ్ల కూతురు రిధ్య కరాటే బెల్ట్‌ సాధించడం నుంచి ఐరన్‌మ్యాన్ రేసుల్లో పాల్గొనేదాక వెళ్లారు. తండ్రి, కూతురు కంటే ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉంటూ సాహసాలను, సవాళ్లను, ఆనందకరమైన క్షణాలను కలిసి పంచుకుంటున్నారు. ఈ కాలం పేరెంటింగ్ ఎలా ఉండాలో చెప్తున్నారు.

- దిశ, ఫీచర్స్

నాన్నతో కలిసి..

ఏడేళ్ల రిధ్య, ఐరన్ కిడ్ ట్రయాథ్లాన్లో 75 మీటర్ల ఈత, 3 కిలోమీటర్ల సైక్లింగ్, 1 కిలోమీటర్ పరుగు పూర్తి చేసింది. రిధ్య వాళ్ల నాన్న రిజేష్.. ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్లో 2 కిలోమీర్ల ఈత, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశాడు. వీరిద్దరి విజయాలు కేవలం వారి శారీరక సామర్థ్యంతోనే కాదు. ఒకరికొకరు స్ఫూర్తినిచ్చే బంధంతో సాధ్యమయ్యాయి. రిధ్య తన ఐదేళ్ల వయసులోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. తండ్రితో కలిసి శిక్షణ తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైంది. రిజేష్ కూతురి ఆసక్తిని గమనించి, ఆమె సామర్థ్యాలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాడు. కరాటే, కోబుడో, ఈత, సైక్లింగ్ వంటి సాహసాలన్నీ నాన్నతో కలిసి నేర్చుకున్నది రిధ్య.

అడ్వెంచర్ ట్రెయినింగ్

రిజేష్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనచేస్తూ సాహస క్రీడలపై ఆసక్తి చూపిస్తున్నాడు. అతడితో పాటే కరాటేలో శిక్షణ పొందిన రిధ్య ఐదేళ్ల వయసులో బ్లాక్ బెల్ట్ సాధించింది. వాళ్లిద్దరూ ఒకచోట ఉంటే ఆటల గురించే కాకుండా కథలు చెప్పుకుంటారు. ఆకాశాన్ని చూస్తూ ఊహల్లో విహరిస్తారు. రిధ్య ఒకసారి ఎగరాలనుంది అని చెప్పినప్పుడు రిజేష్ పార్కర్ వీడియోలు చూపించి శిక్షణ పొందితే ఇలాంటి సాహసాలు కూడా చేయొచ్చని వివరించాడు. ఆ ఆసక్తే ఆమెను కరాటే, ఈత, సైక్లింగ్, ట్రయాథ్లాన్లో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది. రిజేష్ తన భార్య భవ్యతో కలిసి రిధ్య ఊహాశక్తిని, ఆసక్తిని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ ప్రోత్సాహం చిన్నారిలో ఆలోచనా విధానాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి.

కింద పడిపోయినా..

బెంగళూరులోని ప్రొఫెషనల్ అకాడమీలో రిజేష్ ట్రయాథ్లాన్ శిక్షణ తీసుకున్నాడు. రిధ్య కూడా ఈత, సైక్లింగ్, రన్నింగ్ శిక్షణ ఇప్పించాడు. వియాత్నాంలో జరిగే ఈవెంట్ కు సిద్ధం కావడానికి, వేడి వాతావరణానికి అలవాటు పడేందుకు రిజేష్ తన కూతురు రిధ్యకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. భవ్య.. పోషకాహారం, వంటలపై ఆసక్తితో వారి శిక్షణకు తగిన ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. శిక్షణ ఒత్తిడిగా మారకుండా రిజేష్ దాన్ని సరదాగా మార్చాడు. వియత్నాంలో జరిగిన ఐరన్ కిడ్ రేసులో రిధ్య సైకిల్ మీది నుంచి కింద పడిపోయినప్పుడు, నాన్న నేర్పిన ధైర్యమే ఆమెను లేచి రేసును కొనసాగేలా చేసింది. ఈ రేసు ఆమెకు సముద్రంలో ఈత కొట్టడం, కొత్త అనుభవాలు, ఆత్మ విశ్వాసం రెట్టింపయ్యాయి. రేసు చివరిలో ఆమె కార్డ్ వీల్ చేస్తూ ఫినిష్ లైన్‌ను దాటి విజయకేతనం ఎగరేసింది.

2026 ఈవెంట్స్‌కు..

"రిధ్యా.. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మా".. అని ఎవరైనా అడిగితే ఠక్కున "మా నాన్న" అని గర్వంగా చెప్తుంది రిధ్య. బిడ్డతో ఉన్నంత సేపూ రిజేష్ సృజనాత్మ పనులే చేస్తాడు. ఆ దిశగానే బిడ్డను ఆలోచింపజేస్తాడు. కథలు చెప్పుకుంటారు. చెట్లు, పక్షుల గురించి వివరిస్తాడు. బిడ్డలోని సృజనాత్మకతను పెంచేందుకు ప్రత్యేకంగా బ్లాగ్ ప్రారంభించాడు రిజేష్. "లిటిల్ బ్లాగర్స్ డైరీ" అనే ఈ బ్లాగులో రిధ్య రాసిన కథలు, అనుభవాు, చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి. 2024లో ఈ బ్లాగ్ పోస్టులను సేకరించి ఒక పుస్తకంగా ప్రచురించాడు. కేరళలో జరిగే వలస్సేరిల్ స్విమ్మింగ్ క్లబ్ ఈవెంట్ కోసం, 2026లో జరిగే తదుపరి ఐరన్ మ్యాన్ ఈవెంట్స్ కోసం ప్రిపేర్ చేయిస్తూ ఆమె భవితకు బాటలు వేస్తున్నాడు.

Next Story