- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలుపెరుగని పాటసారి.. రిటైర్మెంట్ అయ్యాక కూడా తెలంగాణ ధూమ్ ధామ్ చేస్తున్న పెంటోజీ
సాంస్కృతిక చైతన్యం కల్పిస్తున్నాడు.

మనిషిన్నాక కూసింత కళా పోషణ ఉండాలంటారు.
కానీ.. పెంటోజీకి మనసంతా కళా పోషణే.
విద్యార్థి వయసులో..
కాలికి గజ్జెకట్టి.. గోచి గొంగడేసిన ఆయన..
ఇప్పటికీ ఆ కళా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
ఆర్టీసీ డ్రైవర్‌గా రిటైర్మెంట్ అయ్యాక..
ఇక పాటకు దూరమవుతానమో అనుకున్నాడు.
కానీ.. పాటంటే ప్రాణం కదా.?
అలుపెరుగకుండా సాంస్కృతిక చైతన్యం కల్పిస్తున్నాడు.
- దిశ, ఫీచర్స్
పెంటోజీది నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణం. పూర్తిపేరు డబ్బీకార్ పెంటోజీ. అప్పట్లో దేవరకొండ ప్రాంతంలో భ్రూణ హత్యలు.. బాల్య వివాహాలు వంటి సామాజిక అస్పృశ్యత ఎక్కువగా ఉండేది. నిత్యం అలాంటి సంఘటనలను చూస్తూ పెరిగిన పెంటోజీకి విద్యార్థి దశలోనే సామాజిక స్పృహ ఏర్పడింది. జనాల్లో ఏం చేస్తే చైతన్యం వస్తుంది.? వీటినెలా అరికట్టాలి.? అనే ఆలోచన మొదలైంది.
సాంస్కృతిక కళతో..
దేవరకొండ సాంస్కృతిక, ఉద్యమ నేపథ్యమున్న ప్రాంతం కాబట్టీ.. "సాంస్కృతిక కళ"ల పట్ల ఆకర్షితుడయ్యాడు పెంటోజీ. వాళ్లది ఆరెకటిక వృత్తి. ఏడెనిమిది తరగతుల వరకు చదువుకొని ఆ తర్వాత వృత్తిలోకి దిగే ఆనవాయితీ ఉంది. కానీ పెంటోజీకేమో చదువు.. కళల పట్ల ఆసక్తి ఎక్కువ. చదువుతూనే ఎక్కడ "ఆట పాట" కనిపిస్తే అక్కడికి వెళ్లేవాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆ పాటల్ని ఇమిటేట్ చేస్తూ ఆడుతుండేవాడు. ఆ ఆసక్తి.. పూర్తిగా కళలవైపు తీసుకెళ్లింది. ఎవరూ పిలవకపోయినా.. కార్యక్రమాలకు వెళ్లి స్వచ్ఛందంగా పాల్గొనేవాడు.
రేడియో ఎల్లయ్య మామ
టెన్త్‌క్లాస్ వరకు వచ్చేసరికి కవితా గోష్టులు.. సాంస్కృతిక కార్యక్రమాలు రెగ్యులర్ కార్యక్రమాలు అయ్యాయి. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే పాట రూపంలో ప్రదర్శన ఇచ్చేవాడు. అలా 1984లో "దేవరకొండ సాంస్కృతిక సాహితీ సమాఖ్య" పరిచయం అయ్యింది. చంద్రమౌళి అనే టీచర్ దీనిని నడిపేవారు. అక్కడే కిషన్‌లాల్ అనే వ్యక్తి "జానపద అకాడమీ" గురించి చెప్పాడు. రవీంద్రభారతిలో జానపద అకాడమీ వాళ్లు నిర్వహించే "రేడియో ఎల్లయ్య మామ" కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కోసం 1992లో దాని వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డిని కలిసి ప్రదర్శన ఇచ్చాడు పెంటోజీ.
ఆలిండియా రేడియోలో..
జానపద అకాడమీలో చేస్తున్నప్పుడే "ఆలిండియా రేడియో" గురించి తెలిస్తే వెళ్లి కలిశాడు. 1995లో ఆలిండియా రేడియో వాళ్లు పెంటోజీకి స్వరపరీక్ష పెట్టి.. ఎంపిక చేశారు. "జానపద గీతాలు" కార్యక్రమంలో భాగంగా అప్పట్లో శ్రోతలను ఉల్లాసపరిచేవాడు. వ్యవసాయ పాటలు.. సామాజిక చైతన్యం కలిగించే పాటలు.. పల్లె పాటలతో తన కళా ప్రతిభను విస్తరింపజేశాడు. అప్పట్లో రేడియో ప్రాచుర్యం బాగా ఉన్నందువల్ల పెంటోజీ ఒక సెన్సేషన్. అలా కొంతకాలం గడిచిన తర్వాత "ఆలిండియా రేడియో" వాళ్లు "దూరదర్శన్"కు రెఫర్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్‌గా..
ఇంటర్ వరకు చదువుకున్న పెంటోజీకి 1997లో ఆర్టీసీ డ్రైవర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదటగా సూర్యాపేట డిపోలో పోస్టింగ్. మామూలుగా ఉద్యోగంలో చేరితే ఇక సమయమెక్కడ ఉంటుంది. కానీ పెంటోజీ తనకు దొరికిన ప్రతీ క్షణాన్ని కళ కోసం వినియోగించుకున్నాడు. కాలికి గజ్జెకట్టి పాట పాడకపోతే అతడికి మనసు ఒప్పేది కాదు. సమాజంలో జరుగుతున్న ప్రతీ ఇన్సిడెంట్ మీద ప్రదర్శనలిస్తూ ఆర్టీసీలోని ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాడు. అప్పట్నుంచి ఆర్టీసీలో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించినా పెంటోజీని పిలిపించేవారు.
దూరదర్శన్ జానపదాల్లో..
1998లో దూరదర్శన్‌కి వెళ్లాడు. అప్పుడున్న డైరెక్టర్‌కు పెంటోజీ గాత్రం.. పాట.. కళా నైపుణ్యం నచ్చి అదే రోజు ప్రోగ్రామ్ డిజైన్ చేయించారు. "వ్యవసాయదారుల" కార్యక్రమానికి అతడితో పాటలు పాడించేవారు. అలా దూరదర్శన్‌లో పెంటోజీ మొదటిసారిగా "తాలులెల్లియ్యలో" అనే పాట పాడాడు. ఆ తర్వాత రెగ్యులర్‌గా ప్రదర్శనలు ఇస్తూ వచ్చాడు. 2007లో ఢిల్లీలో జరిగిన సార్క్ దేశాల "జానపద కళోత్సవాల"లో వడ్డేపల్లి శ్రీనివాస్ బృందంలో ప్రదర్శన ఇస్తే అప్పటి కేంద్ర సాంస్కృతిక మంత్రి అంబికాసోనీ ప్రశంసించారు.
తెలంగాణ ఉద్యమంలో..
సామాజిక చైతన్యం కోసం తనవంతు ప్రయత్నంగా భ్రూణహత్యలు.. ప్లాస్టిక్ వాడకం.. ఈవ్ టీజింగ్.. పర్యావరణం.. డ్రగ్స్.. నిరక్షరాస్యత వంటి అంశాలపై స్వచ్చందంగా కార్యక్రమాలు ఇస్తూ వచ్చాడు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఒకవైపు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు కాలుకు గజ్జెకట్టుకొని గోసి గొంగడేసి ధూమ్ ధామ్‌ల్లో పాల్గొన్నాడు. దేవరకొండ ప్రాంతంలో తెలంగాణోద్యమ తొలి సాంస్కృతిక ప్రదర్శన పెంటోజీదే కావడం విశేషం. తర్వాత నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రజా చైతన్య ప్రదర్శనలిచ్చాడు. అడవుల్లోని పల్లె ప్రజలకు అవగాహన కల్పించాడు.
ఎన్నో అవార్డులు..
పెంటోజీ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడైనా తన సొంత డబ్బులతోనే ప్రదర్శన ఇచ్చాడు. డబ్బుల కోసం ఏనాడూ కళా ప్రదర్శన ఇవ్వలేదు. అందుకే తన బ్యాంకు బ్యాలెన్సు కంటే అవార్డులే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. "తెలంగాణ రత్న", "జాతీయ కటిక్ శిరోమణి", "వల్లూరి ఫౌండేషన్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు", మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ఫౌండేష "ఎంబీసీ" అవార్డు, "రాష్ట్రేతర తెలుగు సమాఖ్య" అవార్డు, "స్వర్ణభారతి కళానిలయం సహస్ర" అవార్డు, స్వర్ణమంజరి జీవిత సాఫల్య అవార్డు, "ఘంటసాల అవార్డు", బాల సుబ్రహ్మణ్యం స్మారక అవార్డు.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి.
రిటైర్మెంట్ అయినా..
ఆర్టీసీలో ఆక్సుపెన్సీ రేషియో పెంచడానికి అవగాహన కల్పించేందుకు మేనేజ్మెంట్ కళాకారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రత.. సురక్షిత ప్రయాణం వంటి అంశాలపై వర్క్ షాప్స్ నిర్వహించేవారు. హైదరాబాద్ జోన్ బృందానికి టీమ్ లీడర్‌గా పనిచేశాడు పెంటోజీ. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు దగ్గరయ్యాడు. కరోనా సమయంలో ఎంజీబీఎస్‌లో "సంక్రాంతి హరిదాసు" వేషం వైరల్ అయింది కదా ఆ హరిదాస్ పెంటోజీనే. ఈ ఐడియా సజ్జనార్‌ది. 2024 అక్టోబర్ 30న రిటైర్మెంటయ్యాడు పెంటోజీ. ఆ రిటైర్మెంట్ వృత్తికేగానీ.. పాటకు కాదని నిరూపిస్తూ అలుపెరుగకుండా ప్రదర్శనలిస్తున్నాడు.
- Tags
- Pentoji
- Devarakonda
- Fetal Killings
- Child Marriages
- Social Untouchability
- Cultural Art
- Devarakonda Culture
- Radio Ellayya Mama
- Tent Class
- Devarakonda Cultural Literature Association
- Janapada Academy
- Rabindra Bharati
- All India Radio
- Folk Songs Doordarshan
- RTC
- Driver
- Suryapet
- Delhi
- SAARC Countries
- Folk Art Festival
- Vaddepalli Srinivas
- Telangana Ratna National Katik Shiromani
- Valluri Foundation Life Time Achievement Award
- Mahatma Jyotirao Phule Foundation
- Sajjanar






