స్త్రీలైతే అవుట్‌ డేటెడ్..! పురుషులైతే స్ట్రాటజిక్ థింకర్స్..!!

by Javid Pasha |   (  Updated:2025-12-22 12:04:34  IST  )

40 ఏళ్లు దాటిన పురుష ఉద్యోగులతో(Male colleagues) 20 ఏళ్లు దాటిన స్త్రీ, పురుష ఉద్యోగులు కూడా స్వేచ్ఛగా కలిసిపోతుంటారు. కానీ అదే వయసులో ఉన్న అనుభవజ్ఞులైన ఫిమేల్ కొలీగ్స్‌ను మాత్రం “ఆంటీ” అని పిలుస్తూ నవ్వుకుంటుంటారు కొందరు.

స్త్రీలైతే అవుట్‌ డేటెడ్..! పురుషులైతే స్ట్రాటజిక్ థింకర్స్..!!
X

దిశ, ఫీచర్స్ : ఐదంకెల జీతం.. అందమైన జీవితం.. వారంలో 2 రోజులు వీక్లీ ఆఫ్.. కార్పొరేట్ సెక్టార్ ఎంప్లాయీస్ గురించి బయట చాలా మందికి ఉండే అంచనాలివి. నిజమే కావచ్చు. కానీ అంతకు మించి సమస్యలు, సవాల్లు కూడా అక్కడుంటాయనే విషయం ఎంతమందికి తెలుసు? ఇది తెలిస్తే గనుక ఎంత జీతమొస్తే ఏం లాభం..? అనుకోవాల్సిందే ఎవరైనా! ఎందుకంటే అక్కడుంటే పని ఒత్తిడి, వృత్తి జీవితంలోని ఒడిదుడుకుల మధ్య అదంతా ఆవిరైపోతుంది. ఆరోగ్యానికే పెద్ద సగం ఖర్చైపోతుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే మరిన్ని అదనపు సమస్యలు, సవాళ్లు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఓ వైపు అంతరిక్షంలోకి అడుగు పెడుతున్న రోజులే అయినప్పటికీ.. మరోవైపు కార్పొరేట్ ప్రపంచం మహిళలను చిన్న చూపే చూస్తోంది. ప్రమోషన్లు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, లీడర్‌షిప్ రోల్స్‌లో పురుషులకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకే పనిచేస్తున్నప్పటికీ 20-25% జెండర్ పే గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుందని, దీనికి తోడు వయసు ఆధారిత లింగ వివక్ష అయితే మరీ దారుణంగా ఉంటోందని స్త్రీ వాదులు అంటున్నారు.

వయసు+లింగ వివక్ష..

కార్పొరేట్ సెక్టార్‌లో యంగ్ జనరేషన్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నప్పటికీ.. సంస్థ లాభాల్లో నడవాలంటే అనుభజ్ఞులైన ఉద్యోగులు కూడా అవసరమనే ఆలోచనతో ముఖ్యమైన స్థానాల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఇక్కడ కూడా ఏజ్ + జెండర్ రిలేటెడ్ వివక్ష (Intersectional Ageism + Sexism) ఉంటున్నదని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలపట్ల చులకన భావం అధికంగా కొనసాగుతున్నదని ఫెమినిస్టులు, ఆ రంగంపట్ల అవగాహన ఉన్న విశ్లేషకులు సైతం అంటున్నారు. 40+ ఏజ్ వచ్చిన స్త్రీలను “outdated”, “lacking energy”, “Not tech savvy” అని చులకన చేస్తుంటారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తుంటారు. ఒకవేళ కొనసాగుతున్నప్పటికీ ఈ విధమైన వెక్కిరింపులు, కామెంట్లు ఎదుర్కొ్ంటూ ఉండాల్సి వస్తుందని చెబుతారు. అదే వయసులో ఉన్న పురుషల విషయంలో మాత్రం కార్పొరేట్ కల్చర్ భిన్నంగా స్పందిస్తుంది. 40 ఏండ్లు లేదా మెనోపాజ్ దశలో ఇంకా జాబ్ చేస్తున్న స్త్రీలను ‘అవుట్ డేటెడ్’ అని, ‘ఎనర్జీలెస్’ అని, టెక్నాలజీ నాలెడ్జ్ లేదని భావించే కార్పొరేట్ యాజమాన్యాలు, తోటి ఉద్యోగులు, అదే పురుషుల విషయానికి వస్తే మాత్రం “Seasoned”, “Strategic Thinker” అని పొగుడుతారు. మెనోపాజ్ లక్షణాల(Hot flashes, mood swings)వల్ల ఒక్కోసారి పర్ఫామెన్స్‌లో తేడాలు వస్తే దాన్ని “Incompetent”గా.. అంటే అసమర్థతగా చూస్తారు. అదే పురుషునికి ఏజ్ రిలేటెడ్ సమస్యలొస్తే.. ఆ ప్రభావం పనిపై పడితే పెద్దగా పట్టించుకోరు. అందుకే భారత దేశంలోని కార్పొరేట్ సెక్టార్‌లో 35+, 40+ దాటిన తర్వాత ఉద్యోగాలు చేసే పురుషులతో పోలిస్తే స్త్రీల సంఖ్య చాలా తక్కువ.

40+ అయితే బయటికేనా..?

2024-25 రిపోర్ట్ ప్రకారం సీ-లెవెల్ రోల్స్‌లో స్త్రీలు కేవలం 3-8% మాత్రమే ఉంటున్నారు. 35+ దాటాక చాలామంది స్త్రీలు వాలంటరీగా లేదా ఇన్‌వాలంటరీగా కార్పొరేట్ రేస్ నుంచి బయటకు వెళ్తారు. ఇక 40+ ఏజ్ స్త్రీలనైతే కార్పొరేట్ సహా పలు ఇతర సంస్థలు కూడ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశం పురుషులతో పోలిస్తే 30-50% తక్కువ. మెనోపాజ్ స్టేజ్‌లో స్త్రీలు ‘పవర్ లెస్’ అనే అపోహతో చాలా మంది వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తుంటారు. నిజానికి ఈ వయసులో అనుభవం, స్థిరత్వం, రెసిలియెన్స్ (Resilience) వంటివి 30 ఏండ్లలోపు వారికంటే చాలా మెరుగ్గా ఉంటాయన్న విషయం కార్పొరేట్ సెక్టార్ పట్టించుకోవడం లేదు. మెనోపాజ్ అంటే టాలెంట్ క్షీణత కాదని, అదొక ట్రాన్సిషన్ స్టేజ్ అని నిపుణులు అంటున్నారు. ఆ ట్రాన్సిషన్‌లోని శక్తిని గుర్తించడంలో కార్పొరేట్ సంస్థలు విఫలం అవుతున్నాయి.

ఏజిస్ట్ జోకులతో ఇబ్బందులు

40 ఏళ్లు దాటిన పురుష ఉద్యోగులతో(Male colleagues) 20 ఏళ్లు దాటిన స్త్రీ, పురుష ఉద్యోగులు కూడా స్వేచ్ఛగా కలిసిపోతుంటారు. కానీ అదే వయసులో ఉన్న అనుభవజ్ఞులైన ఫిమేల్ కొలీగ్స్‌ను మాత్రం “ఆంటీ” అని పిలుస్తూ నవ్వుకుంటుంటారు కొందరు. ఈ ఏజిస్ట్ జోకులు “చాయ్ టైం”లో హాయిగా చెప్పుకున్నవి అయినా, వాట్సాప్ గ్రూపుల్లో ఫార్మల్ కమ్యూనికేషన్ కంటే వేగంగా వ్యాపిస్తాయి. ఇక్కడ వయసు వివక్ష + లింగ వివక్ష(Ageism + gender) ఘోరమైన కాంబినేషన్‌గానూ మారిపోతుంటాయి. నెరిసిన జుట్టు గల పురుషులైన బాస్‌లను, టీమ్ లీడర్లను“సీజన్డ్”, “డిస్టింగ్విష్డ్” అని కొనియాడుతుంటారు. అదే స్త్రీలైతే గనుక “ఓల్డ్”, “అవుట్‌డేటెడ్”, హై-స్టేక్ ప్రాజెక్టులకు నాన్ ఫిట్ అని తోసేస్తారు. వయసు పెరిగిన పురుషుడు ఇక్కడ అనుభవజ్ఞుడు, అడ్వైజర్(Mentor) అవుతుంటే.. అదే అనుభవం ఉన్న స్త్రీ మాత్రం “Does she still have that fire?” అంటూ 40 ఏంళ్లు దాటిన మహిళల గురించి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుకుంటుంటారు పురుష పుంగవులైన ఉద్యోగులు. నిజానికి పురుషులతో పోలిస్తే ఈ వయసులో స్త్రీలు ఎన్నో బాధ్యతల్లో ఉంటారు. పెరిగే పిల్లలు, వయసు మీద పడిన అత్తామామలు లేదా తల్లిదండ్రులు, భర్త, ఇతర కుటుంబ సభ్యులను సైతం జాగ్రత్తగా చూసుకుంటూ.. బాధ్యతలు మోస్తూ ఉద్యోగాలు చేస్తుంటారు. సరిగ్గా ఆ సమయంలోనే పెరిమెనోపాజ్, మెనోపాజ్ నిశ్శబ్దంగా తలుపు తడతాయి. ఇవన్నీ కొన్ని ఒడిదుడుకులకు కారణం అవుతాయి. అది తాత్కాలికమే తప్ప వర్క్ ప్రొడక్టివిటీపై శాశ్వత ప్రభావం చూపవు. కానీ ఆధునిక కార్పొరేట్ ప్రంపంచం ఇది అర్థం చేసుకోలేకపోతోంది. మెనోపాజ్ అంటే జాబ్స్ నుంచి ‘పాజ్’ చేయడం కోసం కాదు. వయసు పరంగా అదొక అనుభవంతో కూడిన ‘పవర్’ అని గుర్తించినప్పుడే కార్పొరేట్ ప్రపంచం బాగుపడుతుందని నిపుణులు అంటున్నారు.

Next Story