అవమానాలే ఆభరణంగా.. మిస్ యూనివర్స్ ఫాతిమా.!

by Daayi Srishailam |

వివక్షను ఎదుర్కొని మిస్ యూనివర్స్-2025 కిరీటాన్ని సొంతం చేసుకుంది మెక్సికో సుందరి ఫాతిమా బోష్

అవమానాలే ఆభరణంగా.. మిస్ యూనివర్స్ ఫాతిమా.!
X

దిశ, ఫీచర్స్: అందాల పోటీల్లో గెలిస్తే ప్రపంచాన్ని జయించినట్టు. అందాల పోటీల్లో సామాజిక.. సాంస్కృతిక అంశాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందర్నీ మెప్పించి విజేతగా నిలవాలంటే కత్తిమీద సామే. అలా వేదికపైనే అవమానాలను.. వివక్షను ఎదుర్కొని మిస్ యూనివర్స్-2025 కిరీటాన్ని సొంతం చేసుకుంది మెక్సికో సుందరి ఫాతిమా బోష్.

ఆర్గనైజర్ల అవమానం..

మిస్‌ యూనివర్స్‌-2025గా మెక్సికో సుందరి 25 ఏళ్ల ఫాతిమా బోష్‌ కిరీటం సొంతం చేసుకుంది. ఐతే ఈ పోటీలు కేవలం అందాల ప్రదర్శనగా కాకుండా మహిళల ఆత్మగౌరవం.. సాహసానికి వేదికగా నిలిచాయి. ఫాతిమా గెలుపు వెనక ఎన్నో అవమానాలు ఉన్నాయి. ఎందుకంటే తనొక సామాజిక కార్యకర్త. "పిల్లలకు క్యాన్సర్" అనే అంశంపై ఎంతోకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తనను తక్కువచేసి మాట్లాడుతూ ఆర్గనైజర్ నవత్ "దద్దమ్మ" అని అవమానించాడు. తాను "దద్దమ్మ"ను కాదు.. క్యాన్సర్ బారినపడిన వేలాదిమంది పిల్లలకు "పెద్దమ్మ"ను అని నిరూపంచుకునే ప్రయత్నం చేసింది ఫాతిమా.

ఫాతిమా వాకౌట్..

లైవ్ స్ట్రీమింగ్ సమావేశంలో తనకు జరిగిన అవమానానికి తట్టుకోలేక సమావేశం నుంచి వాకౌట్ చేసింది ఫాతిమా. మిస్ ఇరాక్.. ఇంకా కొంతమంది తనకు మద్దతుగా నిలిచారు. ఫాతిమా భావోద్వేగంతో మాట్లాడుతూ.. "మిస్ యూనివర్స్ పోటీలంటే అందాల ఆరబోత కాదు.. ఇదొక మహిళా సాధికారతకు.. ఆత్మగౌరవానికి వేదిక" అని స్వరం పెంచి మాట్లాడింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ కూడా తనను ప్రశంసించింది. ఇదంతా అయ్యే సరికి సదరు ఆర్గనైజర్ ఇక తప్పక ఫాతిమకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన మహిళలు అవమానాలకు తలవంచకుండా నిలబడతారనే సందేశాన్నిచ్చింది.

జడ్జిలు రాజీనామా..

ఒక్క క్షమాపణతోనే ఇది ఆగిపోలేదు. అడుగడుగునా ఫాతిమాకు అడ్డంకులు వచ్చాయి. ఏమైందో ఏమోగానీ.. ఈ పోటీలకు జడ్జిలుగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులు రాజీనామా చేశారు. ఈ అనూహ్య ఘటనకు అంతా షాకయ్యారు. "అధికారిక జ్యూరీ సభ్యులు కాని వ్యక్తులు ఓటింగ్ చేశారు" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. దీనికితోడు.. నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్‌లో మిస్ బ్రిటన్ డానియెల్ లాటిమర్.. మిస్ జమైకా గాబ్రియెల్ హెన్రీ స్టేజ్ నుంచి పడిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ఇంత ఒత్తిడి మధ్యలోనూ నిలిచి గెలిచిందంటే ఫాతిమా ధైర్యమేంటో తెలుస్తోంది.

120 మందిలో..

అవమానాలు.. వివాదాలు వంటివెన్ని అడ్డొచ్చినా ఫాతిమా బోష్ అంతిమంగా గెలిచింది. 120 మందికి పైగా మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో చివరి రౌండ్‌కు ఐవరీ కోస్ట్.. ఫిలిప్పీన్స్.. థాయ్‌లాండ్.. వెనిజువెలా.. మెక్సికో ప్రతినిధులు చేరుకున్నారు. ఫాతిమా బోష్ తన సహజమైన అందం.. తెలివితేటలు.. సామాజిక సేవా కార్యక్రమాలతో ఆకట్టుకొని విజయం సాధించి మహిళలకు ఒక ప్రేరణగా నిలుస్తోంది. గతంలో లుపిటా జోన్స్.. జిమెనా నవర్రెటే.. ఆండ్రియా మెజా వంటి మెక్సికన్ అందెగత్తెలు ఈ టైటిల్ సాధించగా ఫాతిమా కూడా వాళ్ల సరసన చేరి మహిళలు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కుంటారని నిరూపించింది.

Next Story