అసలైన కామ్రేడ్.. రాపర్‌గా మారి ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేస్తోంది.!

by Daayi Srishailam |

ఆమె సంగీతం ఒక ప్రతిఘటన

అసలైన కామ్రేడ్.. రాపర్‌గా మారి ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేస్తోంది.!
X

దిశ, ఫీచర్స్: మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 24 ఏళ్ల మహీ జీ.. ఇంజనీరింగ్‌ను వదిలి రాప్‌లోకి అడుగుపెట్టింది. అడవుల పరిరక్షణ.. ఆదివాసీ హక్కులు.. సమానత్వం.. న్యాయం కోసం తన సాహిత్యంతో పోరాడుతోంది. అందుకే ఆమె సంగీతం ఒక ప్రతిఘటన.

సామాజిక అన్యాయంపై..

మహదేవ్ కోలీ ఆదివాసీ సముదాయానికి చెందిన మహీ జీ.. ఇంజనీర్ నుంచి రాపర్‌గా మారిన యువతి. చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఆమె ప్రయాణం సాగుతోంది. తనను మధురా ఘనే అని కూడా పిలుస్తారు. మహీ చేసేది కీర్తి కోసం కాదు. సమాజం ఒప్పుకోని నగ్న సత్యాలను బహిర్గతం చేయాలనే తపన ఆమెది. ఒక రకంగా తన సంగీతం కేవలం లయ, గీతం మాత్రమే కాదు. అది ఒక ప్రతిఘటన. తన రాప్‌లు సమాజాన్ని సవాలు చేస్తాయి. లెస్బియన్లు.. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌జెండర్ల సముదాయం కోసం పోరాటం చేస్తాయి. సామాజిక అన్యాయాన్ని ఎత్తిచూపుతాయి. ఎవరూ పట్టించుకోని సమస్యలపై వెలుగు నింపుతాయి. రాప్ ద్వారా మహీ అధికారానికి సత్యాన్ని చాటే నిర్భయ గొంతుకగా మారింది.

లక్ష్యాన్ని చూపించింది..

మహీ జీ సంగీత స్వరాలు కలన్ గ్రామంలో రూపుదిద్దుకున్నాయి. ఇంజనీరింగ్ చేసింది. తను చదువుకున్న విద్య తనకు ఇంజినీరింగ్ వృత్తినిచ్చింది. కానీ ఒక నిర్ధిష్టమైన లక్ష్యా్న్ని ఇవ్వలేదు. అందుకే ఆమె సంగీతంవైపు అడుగులేసింది. రాప్‌ను ఇష్టంగా ఎంచుకుంది. ఆ ఇష్టమే ఇప్పుడు తనకొక లక్ష్యాన్ని చూపించింది. ఆ లక్ష్యమే సత్యం కోసం స్వరం కదపడం. రాప్‌బాస్‌తో కలిసి ఆమె విడుదల చేసిన తొలి ట్రాక్ జంగల్ చా రాజా. ఇది కేవలం పాట మాత్రమే కాదు. స్థానిక ప్రజలు, అడవుల మధ్య బంధానికి నివాళిగా పేర్కొంటారు. ప్రజలను.. అడవినీ బెదిరించే విధ్వంసంపై తీవ్ర విమర్శ. ఆమె మరో గీతం.. హక్ సే హిజ్డా హున్ ట్రాన్స్‌జెండర్ హక్కులకు దిక్కుగా మారింది. బాప్‌మనుస్ గీతం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు నివాళిగా రూపొందింది.

వినోదం కోసం కాదు..

భారతదేశం అంతటా శ్రోతలను ఆకర్షించి.. ప్రతి ట్రాక్ ఆమె మిషన్‌కు కొత్త కోణాన్ని జోడించింది. సంగీతాన్ని మార్పు కోసం మైక్రోఫోన్‌గా.. మెగాఫోన్‌గా ఉపయోగించింది. మహీ జీ యాక్టివిజం కేవలం స్టూడియోలోనే ఆగిపోలేదు. గ్రీన్‌పీస్ ఇండియా వంటి సంస్థల భాగస్వామ్యంతో తన గొంతు గ్రామాల నుంచి విస్తృత క్యాంపెయిన్‌లకు చేరింది. హీట్‌వేవ్ పాటలో రైతులు, రోజువారీ కూలీల కష్టాలను రాప్ చేస్తూ సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేసింది. ఆలస్యం కాకముందే చర్య తీసుకోవాలని అధికారులను కోరింది. ఒకరకంగా మహీ జీ ఇండియాలో రాప్ అర్థాన్ని పునర్నిర్వచించింది. రాప్ అనేది కేవలం వినోదం కోసం కాదు.. విద్య, సాధికారత, సానుభూతి కోసం అని సరికొత్తగా చాటి చెప్తోంది.

Next Story