- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊరి సేవ కోసం.. జెన్ జెడ్ సర్పంచ్.!
అనుకున్నట్టే విజయం సాధించి జెన్ జెడ్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది

దిశ, ఫీచర్స్: సర్పంచ్ ఎలక్షన్ల ఊపు ఎట్లుందో చూస్తున్నం కదా.? యువత కేంద్రీకృతంగానే ఈసారి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. బాగా చదువుకున్నవాళ్లు.. నగరంలో మంచి ఉద్యోగాలు చేసినవాళ్లు కూడా వాటిని వదిలేసి సర్పంచ్.. వార్డు మెంబర్ల కోసం పోటీ పడ్డారు. అలాంటి కోవకే చెందుతుంది సాక్షి రావత్.
ఊరికి సేవ చేసేందుకు..
ఉత్తరాఖండ్ స్థానిక ఎన్నికల్లో జెన్ జెడ్ యువత ఆసక్తి కనబర్చారు. పౌరి గర్వాల్ జిల్లా కుయ్ అనే ఊరికి "గ్రామ ప్రధాన్"గా సాక్షి రావత్ అనే 22 ఏళ్ల యువతి ఎన్నికైంది. "గ్రామ ప్రధాన్" అంటే సర్పంచ్ అన్నమాట. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే సాక్షి తన ఊరికి వచ్చేసింది. తన ఊరికి ప్రధాన్‌గా నాయకత్వం వహించాలనుకుంది. తన ధైర్యం.. కొత్త ఆలోచనలు.. సంకల్పం గ్రామాభివృద్ధికి తోడ్పడతాయనేది తన ఉద్దేశం. అందుకే ఆలోచన వచ్చింది ఆలస్యం నామినేషన్ వేసింది. అనుకున్నట్టే విజయం సాధించి జెన్ జెడ్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
బీటెక్ బయోటెక్నాలజీ చేసి..
సాక్షి రావత్ గ్రామ సర్పంచ్‌గా తనకు పంచాయతీ ఆపీసు తాళాలు అందజేసినప్పుడు "సంపాదించుకోవడానికి కాదు.. సమాజానికి సేవ చేయడానికి.. నా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తా. గ్రామాభివృద్ధి తప్ప వేరే ధ్యాసే లేదు నాకు" అని మాటిచ్చింది. సర్పంచ్ పదవిని కేవలం హోదాగా కాకుండా. దాన్నొక బాధ్యతగా భావించింది సాక్షి. బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసిన సాక్షికి సిటీలో కార్పొరేట్ ఉద్యోగం చేసి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ అవన్నీ వదిలేసి స్వగ్రామానికి సేవ చేయాలనుకుంటోంది. వాళ్ల నాన్న సహకారం తనకు మరింత బలాన్నిచ్చింది.
వలసలకు అడ్డుకట్ట..
ఇంజినీరింగ్ చేసిన సాక్షికి తను చదివిన చదువుకు.. గ్రామ పరిపాలనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఇదే తన రూటుగా మలచుకుంది. విశ్లేషణాత్మక ఆలోచన.. సమస్యల పరిష్కారం.. విజ్ఞాన దృక్పథంతో గ్రామాన్ని ఆధునికీకరించాలనేది తన లక్ష్యం. ఊర్లో ప్రధాన సమస్య ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతోది. దీన్ని అరికట్టి.. యువతను వ్యవసాయం పట్ల ఆకర్షితులను చేయడానికి అరుదైన పండ్లు.. పూల సాగు ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల వలసలు ఆగిపోయి ఊర్లోనే సాగు చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకొని సంతోషంగా జీవనం కొనసాగిస్తోంది యువత.
డెవలప్మెంట్ మోడల్..
గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరచడం తన తర్వాతి లక్ష్యం. దాంట్లో భాగంగా పాఠశాలలను బలోపేతం చేయడం.. డిజిటల్ సేవలను విస్తరించడం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా మహిళలను గ్రామ నిర్ణయాల్లో భాగస్వాములను చేసింది. సాక్షి ఏ ప్రణాళిక చేసినా వాటిని ఆచరణలో పెట్టింది. ఆ ప్రణాళికలన్నీ దీర్ఘకాలికమైనవే. గ్రామాన్ని డెవలప్మెంట్ మోడల్‌గా మార్చడంలో ఈ ప్రణాళికలు కీలకంగా పనిచేస్తున్నాయి. కాలేజీ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో తాను పనిచేసిన అనుభవం సమస్యలను అర్థం చేసుకోవడంలో సహాయపడింది. అనుభవం కంటే సంకల్పం ముఖ్యమని నిరూపిస్తుంది.






