18 ఏళ్ల వయసులో.. ఫస్ట్ కమర్షియల్ పైలట్.!

by Daayi Srishailam |

కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించిన అతిచిన్న వయసు యువతిగా నిలిచింది.

18 ఏళ్ల వయసులో.. ఫస్ట్ కమర్షియల్ పైలట్.!
X

యుద్ధం..

విమానాలు..

మహిళల ధీరత్వం గురించి వింటున్నాం కదా.?

అలాంటి సాహసాలను ఆదర్శంగా తీసుకుంటోంది యువత.

వైమానిక రంగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది.

సమైరా హుల్లూర్ దీనికి ఉదాహరణ.

కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించిన అతిచిన్న వయసు యువతిగా నిలిచింది.

- దిశ, ఫీచర్స్

విమానం విండో సీటు నుంచి ఆకాశం విశాలతను.. ప్రశాంతమైన భూభాగాన్ని చూడాలనే ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ.. కర్ణాటకలోని బీజాపూర్ యువతి సమైరా హుల్లూర్ విమానం ముందు భాగం నుంచి ప్రపంచాన్ని చూడాలనుకుంది. 18 ఏళ్ల వయసులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) సాధించి.. దేశంలోనే అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన పైలట్‌గా నిలిచింది.

తల్లి కోరిక

సమైరాకు చిన్నప్పటి నుంచీ హార్స్ రైడింగ్.. రాక్ క్లయింబింగ్.. స్విమ్మింగ్ వంటి సాహస క్రీడలంటే ఇష్టం. సమైరా అప్పుడు ఐదో తరగతి చదువుతోంది. బీజీపూర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కోఆర్డినేటర్ నజియా. విమానంలో ప్రయాణించే అవకాశం వచ్చింది. సమైరాకు, నజియాకు అదే మొదటి విమాన ప్రయాణం. కాక్‌పిట్‌లో కూర్చొని ఉమన్ పైలట్లను పరిశీలిస్తూ.. "నా కూతురు కూడా ఇలా పైలట్ అయితే బాగుండు" అనిపించిందంటా నజియాకు. విమానాశ్రయంలో క్రూ సభ్యులను జనం గౌరవంగా చూస్తుంటే.. సమైరా కూడా అలాంటి గౌరవాన్ని సంపాదించాలని కలగని.. ఆ దిశగా తీర్చిదిద్దింది.

తపేష్ శిక్షణ

పదో తరగతిలో కెప్టెన్ తపేష్ కుమార్ నుంచి ఓరియెంటేషన్ క్లాస్ తీసుకొని విమానయాన రంగంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకుంది. అకాసా ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే తపేష్.. విమానయాన రంగానికి సంబంధించిన స్పష్టమైన అవగాహన కల్పించాడు. 11వ తరగతి నాటికి పైలట్ కావాలని ఇంకా గట్టిగా నిర్ణయించుకుంది. అప్పటివరకు తల్లి కోరిక మేరకే ప్రిపేరవుతూ వచ్చిన సమైరా.. ఆ తర్వాత విమానయాన రంగంపై అవగాహన ఏర్పరచుకొని సీరియస్‌గా దృష్టి సారించింది. శక్తినంతా ఉపయోగించి ఎక్కడా వెనుకడుగు వేయకుండా మానసికంగా సిద్ధమైంది.

మొదటి ప్రయత్నంలోనే..

12వ తరగతి బోర్డు పరీక్షల తర్వాత.. సమైరా ఢిల్లీలోని వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీలో చేరింది. విమానయానంలో ఎయిర్ రెగ్యులేషన్.. ఏవియేషన్ మెటీరియాలజీ.. ఎయిర్ నావిగేషన్.. టెక్నికల్ జనరల్.. టెక్నికల్ స్పెసిఫిక్.. రేడియో టెలిఫోనీ వంటి ఆరు సబ్జెక్టులు ఉంటాయి. 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. సాధారణంగా ఒకటి లేదా రెండు ప్రయత్నాల్లో వీటిని క్లియర్ చేస్తారు. కానీ సమైరా తన కఠోర శ్రమ.. ఏకాగ్రతతో ఐదు పేపర్లను మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ట్రైనీగా ఫస్ట్ జర్నీ

రేడియో టెలిఫోని పరీక్షకు 18 ఏళ్ల వయసు అవసరం. కానీ సమైరాకు అంత వయసులేదు. మూడుసార్లు వయసు అడ్డంకిగా మారి ఆమె అభ్యర్థిత్వం తిరస్కరించబడింది. అయినప్పటికీ ఏడు నెలల్లో గ్రౌండ్ ట్రైనింగ్ పూర్తి చేసింది. 2024 ఏప్రిల్‌‌‌‌‌లో పూణేలోని బరామతి కార్వర్ ఏవియేషన్లో చేరి.. సీపీఎల్ కోసం 200 గంటల ఫ్లయిట్ ట్రైనింగ్ పూర్తిచేసింది. సీపీఎల్ సాధించడానికి దాదాపు 18 నెలలు పట్టింది. విమానాన్ని స్వయంగా నడపడానిక ముందు ఇన్‌స్ట్రక్టర్ పక్కన కాక్‌పిట్లో కూర్చొని ఎలా చేయాలో గమనించి.. ట్రైనీగా మొదటి ఫ్లయిట్ అనుభవాన్ని పూర్తిచేసుకుంది.

18 ఏళ్ల వయసులోనే..

ప్రతీ పైలట్ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే క్షణం మొదటి సోలో ఫ్లయిట్. ట్రైనీలో విమానాన్ని ఒంటరిగా నడపగలరు అని నమ్మినప్పుడే వారికి అవకాశం ఇస్తారు. సాధారణంగా 36 గంటల శిక్షణ తర్వాత సోలో ఫ్లయిట్ సాధ్యం అవుతుంది. కానీ సమైరా కేవలం 28 గంటల్లోనే ఈ ఘనత సాధించింది. ఒంటరిగా నడపడమే కాదు.. టేకాఫ్ చేయడం సవాలుతో కూడిన పని. టేకాఫ్ చేయడమనేది పైలట్ నైపుణ్యం.. తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి తన కల ఫలించి ఒంటరిగా ఫ్లయింగ్.. టేకాఫ్ విజయవంతంగా పూర్తిచేసుకొని 18 ఏళ్ల వయసులో లైసెన్స్ సాధించిన తొలి పైలట్‌గా రికార్డు సాధించింది.

ఖరీదైన కెరీర్

విమానయాన కెరీర్‌కు అభిరుచి.. నైపుణ్యం మాత్రమే కాదు. గణనీయమైన ఆర్థిక పెట్టుబడి కూడా ఉండాలి. గ్రౌండ్ క్లాస్‌ల కోసం రూ.2.5 లక్షలు, కార్వర్లో ట్రెనియింగ్ కోసం రూ.42 లక్షలు ఖర్చు అయింది సమైరాకు. ఒక్క సంవత్సరంలోనే ఈ ఫీజు రూ.49 లక్షలు పెరిగిందట. సీపీఎల్ సాధించిన తర్వాత విమాన మోడల్‌పై టైప్ రేటింగ్ శిక్షణ పూర్తి చేయాలి. దీనికి రూ. కోటి వరకు ఖర్చు అవుతుండొచ్చు. మొదట ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి.. ఆ తర్వాత టైప్ రేటింగ్ శిక్షణ తీసుకుంటా అని చెప్తోంది సమైరా. ఆమె ప్రయత్నాలు ఫలించి అనుకున్నది సాధించాలని మనమూ కోరుకుందాం.

Next Story