- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యావరణ విద్యలో.. ప్రపంచవ్యాప్త ఖ్యాతి.!
పర్యావరణం గురించి ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది

దిశ, ఫీచర్స్: మనం ముందు కాపాడుకోవాల్సింది పర్యావరణాన్ని. అది బాగుంటేనే కదా మిగతావి. కానీ.. జనాల బుర్ర ఇప్పుడు పర్యావరణం గురించి ఆలోచించే స్థితిలో లేదు. ఆలోచింపజేసేలా.. ఆకర్షణీయంగా.. వినూత్నంగా చెప్తేనే జనాల మెదళ్లకు ఎక్కుతుంది. దీనిని గుర్తించిన 17 ఏళ్ల యువతి సిరి వడ్లమూడి పర్యావరణం గురించి ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది.
ఆటలతో ఆకర్షణీయంగా..
సూర్యాపేట.. హైదరాబాద్‌లోని 25 పాఠశాలల్లో పర్యావరణ కాలుష్య పాఠాలు బ్లాక్‌బోర్డు లెక్చర్లతో నడవవు. దానికి బదులుగా ఆ పాఠశాలల్లోని విద్యార్థులు వార్తాపత్రికలతో ఎకో-ఫ్రెండ్లీ బ్యాగ్‌లు మడతపెడుతూ.. మట్టి ఇంకా ఆకులతో వినాయక విగ్రహాలు తయారు చేస్తూ.. బాటిల్ క్యాప్‌ను తడి లేదా డ్రై వేస్ట్‌లో వేస్తూ చర్చిస్తారు. అంటే చెప్పడం ఉండదు. ప్రాక్టికల్‌గా చేసి చూపించుడే అన్నమాట. ఈ మార్పుకు మార్గదర్శకురాలు 17 ఏళ్ల సిరి వడ్లమూడి. హైదరాబాద్‌లోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న సిరి పర్యావరణ పాఠాలను ఆటలతో ఆకర్షణీయంగా మార్చింది.
ఉత్తమ డిబేటర్..
సిరి సూర్యాపేటలో పుట్టింది. ట్రినిడాడ్‌లో పెరిగింది. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇండియాకు తిరిగొచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ట్రినిడాడ్‌లోనే సిరికి పర్యావరణం పట్ల అవగాహన ఏర్పడింది. ఇంటి సమీపంలోని మ్యాంగ్రోవ్ అడవుల నిర్మూలనపై మొదట్లో తనొక వీడియో తయారు చేసింది. మ్యాంగ్రోవ్‌ల నష్టం వల్ల వచ్చే పర్యావరణ హానిని నేరుగా చూసిందామె. ఆ అనుభవమే తనను పర్యావరణం పట్ల మరింత బాధ్యత పెంచింది. 2022లో ట్రస్ట్ ఫర్ సస్టెయినబుల్ లివింగ్ డిబేట్లలో పాల్గొని ఉత్తమ డిబేటర్‌గా ఎంపికైంది. గుర్తింపు సంతోషమిచ్చినా యువత పర్యావరణ గురించి ఎందుకు ఆలోచించట్లేదనే ప్రశ్న మొదలైంది.
యూత్ గేమిఫికేషన్ క్లబ్..
హైదరాబాద్‌కు వచ్చినంక.. బయోడిగ్రేడబుల్.. మైక్రోప్లాస్టిక్స్.. సెగ్రిగేషన్ వంటి పదాలను తెలుగులో వివరించడం కష్టంగా అనిపించింది. ఆటలతో అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించింది సిరి. ఆ ఆలోచనే యూత్ గేమిఫికేషన్ క్లబ్ స్థాపించేలా చేసింది. తన తమ్ముడు సార్థక్‌తో కలిసి స్థాపించిన ఈ క్లబ్‌లో కాన్సెప్ట్‌లను సరళంగా.. దృశ్యాత్మకంగా వివరించడం మొదలుపెట్టింది. అలా ఎకోసిస్టమ్.. వరదలు.. కరువులు వంటివి తెలియజేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తోంది. మాటలతో కాకుండా స్వయంగా అనుభవించేలా కార్యక్రమాలు డిజైన్ చేస్తోంది.
మొదటి స్థానం..
సిరి వర్క్‌షాప్‌లు శాశ్వత ప్రభావం చూపిస్తున్నాయి. ప్రతి పాఠశాలలో ఎకో-అంబాసిడర్లను శిక్షణ ఇచ్చి.. సెషన్లు ముగిసిన తర్వాత క్యాంపెయిన్ కొనసాగిస్తుంటారు. వీళ్లు వాళ్ల పరిసరాల్లో క్లీనప్ డ్రైవ్‌లు నిర్వహిస్తారు. కుటుంబాలను సింగిల్-యూజ్ ప్లాస్టిక్స్ తగ్గించమని ఒప్పిస్తారు. అలా 25 పాఠశాలల్లో మార్పు తీసుకొచ్చారు. ఒకప్పుడు పర్యావరణ శాస్త్రం బోరింగ్‌గా అనిపించిన విద్యార్థులు ఇప్పుడు ఆసక్తి.. ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ-వేస్ట్‌ను మాక్రోఎకనామిక్ ఫ్యాక్టర్లతో లింక్ చేసే రీసెర్చ్ పేపర్.. ఏఐ అండ్ ఎకనామిక్స్‌పై డిబేట్లో అంతర్జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించింది.
Read More..






