పాత బట్టలతో.. క్విల్ట్ కళాఖండాలు.!

by Daayi Srishailam |

వ్యర్థ ఫాబ్రిక్‌ను రీయూజ్ చేసి మహిళా సాధికారత అవకాశం కల్పిస్తున్నాడు

పాత బట్టలతో.. క్విల్ట్ కళాఖండాలు.!
X

దిశ, ఫీచర్స్: ముంబైలోని భండూప్‌కు చెందిన 16 ఏళ్ల అథర్వ రాజేష్ తన అమ్మమ్మ చేసిన క్విల్ట్ లాంటిది ఎవరూ చేయలేకపోతున్నారని గమనించాడు. ఈ చిన్న ఆలోచన నుంచి ప్రేరణ పొంది క్విల్టింగ్ కళను పునరుద్ధరించాడు. 500 కిలోలకు పైగా వ్యర్థ ఫాబ్రిక్‌ను రీయూజ్ చేసి మహిళా సాధికారత అవకాశం కల్పిస్తున్నాడు.

అమ్మమ్మ స్ఫూర్తి..

క్విల్ట్ లేదా గోధరి చలి నుంచి కాపాడే దుప్పటి. ఇదొక పాత బట్టలతో నిండిన ఒక కళాఖండం. 2024 ఏప్రిల్‌లో అథర్వ, మనసీ కలిసి ‘క్విల్ట్’ అనే గ్రాస్‌రూట్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించారు. క్విల్ట్ సంస్థ ఆలోచన కేవలం ఒక గోధరి కోసం వెతుకులాటతో మొదలు కాలేదు. దాని మూలాలు వాళ్ల అమ్మమ్మ సామాజిక దృక్పథంలో ఉన్నాయి. కష్టపడే మహిళల పట్ల సానుభూతి కలిగి వారికి నైపుణ్యాలు, ఇంటి నుంచి పని చేసే అవకాశాల ద్వారా సాధికారత కల్పించాలని నమ్మేది. ఆ స్ఫూర్తే క్విల్ట్‌లో కొనసాగుతోంది. అందుకే క్విల్ట్ ద్వారా మహిళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తు్న్నారు.

కళ పునరుద్ధరణ..

క్విల్ట్.. పాత బట్టలను సేకరించి, సవాంగ్‌లోని మహిళలకు క్విల్టింగ్ నేర్పించి పూర్తయిన క్విల్ట్‌లను అనాథాశ్రమాలు, అవసరమైన సమాజాలకు దానం చేస్తుంది. ఇది కేవలం గోధరిని భర్తీ చేయడం గురించి కాదు. ఉనికి కోల్పోతున్న ఒక సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. బట్టల వ్యర్థాలను తగ్గించడం. ఒక సర్క్యులర్ మోడల్‌ను సృష్టించాలనుకున్నారు వాళ్లు. మామూలుగా జనం పాత చీరలు, బెడ్‌షీట్లు దానం చేస్తారు కదా. అలాంటివాటిని ఎలా క్విల్టింగ్ చేయాలి అనేది వీళ్లు నేర్పిస్తారు. ముఖ్యంగా మహిళలకు, యువతకు. తయారుచేసిన ఆ క్విల్ట్‌లను అవసరం ఉన్నవారికి ఇస్తారు.

ఆదాయం.. గౌరవం..

స్థానిక మహిళల సంఘం సహాయంతో అథర్వ, అతని కుటుంబం 40 మందికి పైగా మహిళలకు క్విల్టింగ్ వర్క్‌షాప్‌లను నిర్వహించారు. మొదటి నుంచి వారి లక్ష్యం మహిళలు ఇంట్లోనే సంపాదించడం లేదా నేర్చుకోవడం. ప్రస్తుతం 10 మంది మహిళలు క్విల్ట్‌లో చురుకుగా క్విల్టింగ్ చేస్తున్నారు. వారికి ప్రతి క్విల్ట్‌కు డిజైన్ ఆధారంగా ఫీజు చెల్లిస్తారు. ఈ మహిళలు ఒకవైపు ఇంటి పని చేస్తూనే క్విల్టింగ్ చేస్తారు. కొందరైతే రాత్రి సమయంలో కూడా క్విల్టింగ్‌కు వస్తారు. ఇక్కడ ఆదాయం మాత్రమే కాదు గౌరవం దొరుకుతుంది. చేసే పనిలో కంఫర్ట్ ఉంటుంది.

500 కిలోల క్విల్ట్

ఫాబ్రిక్ సేకరణ డ్రైవ్‌ సవాలుతో కూడుకున్నది. కొన్నిసార్లు చీరలు, బెడ్‌షీట్లు అడిగితే జీన్స్ నుంచి పార్టీ వేర్, లోదుస్తుల వరకు వచ్చేవి. మొదటి సేకరణ డ్రైవ్‌లో 107 కిలోల బట్టలు సేకరించారు. ఇప్పుడు ఆ సంఖ్య 500 కిలోలకు పైగా చేరి 120 కంటే ఎక్కువ చేతితో తయారు చేసిన క్విల్ట్‌లుగా మారాయి. ప్రతి నెలా ఫాబ్రిక్ సేకరణ డ్రైవ్‌లను నిర్వహిస్తుంది. టైలర్ల నుంచి నేరుగా స్క్రాప్ ఫాబ్రిక్‌ను సేకరిస్తుంది. రెసిడెన్షియల్ సొసైటీలలో డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. క్విల్ట్ ఇప్పుడు ఒక ప్రముఖ హాస్పిటల్ ట్రస్ట్‌తో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోంది. మెటర్నిటీ వార్డ్‌ల కోసం కస్టమ్-మేడ్ క్విల్ట్‌లు, ఇన్ఫాంట్ ప్లే మ్యాట్‌ల ఆర్డర్ల కోసం చూస్తున్నారు.

Next Story