అమెరికా మ్యూజిక్ కాలేజీలో చదివేందుకు.. వీధిలో సంగీత సరిగమలు.!

by Daayi Srishailam |   (  Updated:2025-08-11 06:39:59  IST  )

"బెర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌"లో చదవాలనే తన కలను సాకారం చేసుకోవడానికి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు

అమెరికా మ్యూజిక్ కాలేజీలో చదివేందుకు.. వీధిలో సంగీత సరిగమలు.!
X

దిశ, ఫీచర్స్: కోల్‌కతా నగరంలో ఒక యువ బాలుడి సంగీతం పాదచారులను ఆకట్టుకుంటోంది. 15 ఏళ్ల దేబ్రజ్ భట్టాచార్య తన గిటార్‌తో పార్క్ స్ట్రీట్‌లో సంగీత ప్రదర్శనలు ఇస్తూ అమెరికాలోని "బెర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌"లో చదవాలనే తన కలను సాకారం చేసుకోవడానికి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు.

సంగీతంతో బంధం

దేబ్రజ్ ఒక సంగీత కుటుంబంలో పుట్టాడు. తల్లి ఒక గాయని. ఎప్పుడూ ఇల్లు తన గానంతో నిండిపోపయేది. కానీ క్యాన్సర్ ఆమెను చిన్న వయసులోనే దేబ్రజ్ నుంచి దూరంచేసింది. తల్లి సంగీతాభిలాషను ఒంటపట్టించుకున్న దేబ్రజ్ ఆమె పాడిన పాటలను ఓదార్పుగా మార్చుకున్నాడు. తండ్రి దేబాశీష్ భట్టాచార్య పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసేవాడు. కానీ కొడుకును ఒంటరిగా వదిలేయడం ఇష్టంలేక ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ సమయాన్ని కొడుకు కలలు నెరవేర్చడానికి కేటాయించి ప్రతీక్షణం దేబ్రజ్ పక్కనే ఉండేవాడు.

వీధిలో సంగీత ప్రయాణం

2020 లాక్‌డౌన్ సమయంలో దేబ్రజ్ మొదటిసారి గిటార్ తీసుకున్నాడు. ఎలాంటి శిక్షణ లేకుండా ఆన్‌లైన్ ట్యూటోరియల్స్ ద్వారా విని గిటార్ నేర్చుకున్నాడు. సంగీతం అతనికి కేవలం ఒక అభిరుచి కాదు. తన జీవన లక్ష్యంగా మారింది. యూట్యూబ్‌లో వీధి కళాకారుల వీడియోలను చూసి నగరంలోని రద్దీ మధ్యలో తనకంటూ వేదికను సృష్టించాలనుకున్నాడు. తండ్రి సలహాతో ఒక అరుదైన యాంప్, గిటార్‌తో పార్క్ స్ట్రీట్‌లో బస్కింగ్ ప్రారంభించాడు. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌ను సాంస్కృతిక కేంద్రంగా మార్చుకొని సంగీతంతో ఉర్రూతలూగించాడు.

వీడియో వైరల్..

దేబ్రజ్ సరళమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శనలు పాదచారులను ఆకర్షింపజేశాయి. ఎవరో ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఆ ఒక్క వీడియోతో దేబ్రజ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. తన సంగీతం కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు. తన భావాలను వ్యక్తం చేసే మాధ్యమంగా మార్చుకున్నాడు. చదువును, సంగీతాన్ని సమతుల్యం చేస్తూ తూర్పు, పాశ్చాత్య సాంప్రదాయ సంగీతాన్ని మిళితం చేసే కంపోజిషన్స్ సృష్టించాలని కలలు కంటున్నాడు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఉస్తాద్ రషీద్ ఖాన్, పాపన్, శంకర్ మహదేవన్‌లను ఆదర్శంగా తీసుకున్నాడు.

అమెరికాలో చదివేందుకు..

ముంబైలోని "టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌"లో ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానం అందుకున్న దేబ్రజ్ కెరీర్‌లో అదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. యువ కళాకారులకు వెన్నదన్నుగా నిలిచి వారిలోని టాలెంటును బయటకుత తీసే "మోరం ఎర్త్" సంస్థ నిర్వహించే "దేశజ్ కేఫ్‌"లో గాయని లగ్నజితా చక్రవర్తితో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం పొందాడు. ఇలా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దేబ్రజ్ వెస్టర్న్ కల్చర్ మ్యూజిక్‌ను సాంప్రదాయ సంగీతంతో మిళితం చేయాలనే లక్ష్యంతో అమెరికాలోని "బెర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌"లో చదివేందుకు వీధి సంగీతం ప్రదర్శిస్తున్నాడు.

Next Story