- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటరితనాన్ని దూరంచేస్తున్న బెంగళూరు డ్రమ్స్ కలెక్టివ్.!
బెంగళూరు డ్రమ్స్ కలెక్టివ్ (బీడీసీ) అనే సమూహం ద్వారా సాధ్యమవుతోంది

బిజీ ప్రపంచంలో..
ఎవరి పని వాళ్లది.
ఎవరి హడావుడి వాళ్లది.
పక్కింటివాళ్లని కూడా పలకరించలేని బిజీ మనది.
రాన్రానూ ఒక ఇంట్లోని మనుషులకే కమ్యూనికేషన్ దెబ్బతినే పరిస్థితి వస్తుండొచ్చు.
దీనిని ముందుగానే పసిగట్టిన కొందరు డ్రమ్స్ ద్వారా ఏకం అవుతున్నారు.
మానవ సంబంధాలే లక్ష్యంగా బెంగళూరును షేక్ చేస్తున్నారు.
- దిశ, ఫీచర్స్
వాళ్లంతా ఒకరితో ఒకరికి పరిచయం లేదు. కానీ ప్రతీవారాంతంలో బెంగళూరులోని ఒక గిడ్డంగిలో కలుసుకుంటారు. అలా అని ఒకరితో ఒకరు పిచ్చాపాటిగా ఏం మాట్లాడుకోరు. అందరూ ఒక దగ్గర గుమిగూడి డ్రమ్స్‌తో లయబద్దంగా సంగీతాన్ని సృష్టిస్తారు.
కొత్త సంబంధాలు
వేగంగా సాగే ఈ ఆధునిక జీవితంలో అపరిచితులైన 140 మంది బెంగళూరులోని ఒక గిడ్డంగిలో గుమిగూడి ఈ డ్రమ్స్ సందడి చేస్తున్నారు. ఒకరి డ్రమ్స్ తాకిడి మరొకరి లయతో కలిసిపోతూ ఒకరితో ఒకరు అనుసంధానమవుతున్నారు. ఈ అద్భుత దృశ్యం బెంగళూరు డ్రమ్స్ కలెక్టివ్ (బీడీసీ) అనే సమూహం ద్వారా సాధ్యమవుతోంది. ఒక సాధారణ ఆలోచనలోంచి పుట్టిన ఈ సమావేశం.. ఒంటరి తనాన్ని దూరంచేసి.. సమాజంలో కొత్త సంబంధాలను నిర్మిస్తోంది. దీని వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా అనే యువకుడు.
ఒంటరితనం నుంచి..
గౌరవ్ గుప్తాది ముంబై. ఇన్ఫోసిస్‌లో జాబ్ కోసం అతడు 2022లో బెంగళూరు వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఆయనకు తెలిసినవాళ్లెవరూ లేకపోవడంతో కొంతకాలం ఒంటరితనం రాజ్యమేలింది. ముంబైలో స్నేహితులతో గడిపిన గౌరవ్.. బెంగళూరులో ఆ సరదా సమయాలు లేకపోయేసరికి మూడీగా ఫీలయ్యాడు. ఒకరితో ఒకరు పలకరించుకోలేని సమాజంలో ఎలా బతకాలి అని చాలాసార్లు ఆవేదనకు గురయ్యాడు. ఒంటరి తనం నుంచి బయటపడేందుకు కొద్దిరోజులు క్లబ్లకు వెళ్లాడు. రెస్టారెంట్‌కు వెళ్లేవాడు. ఇవి కొంతవరకు ఆనందాన్నిచ్చినా ఒంటరితనాన్ని పూర్తిగా తీర్చలేదు. అప్పుడే ఒక ఐడియా వచ్చింది.
డ్రమ్ సర్కిల్స్..
బెంగళూరు సామాజిక వాతావరణం భిన్నంగా ఉండటంతో చాలా డిస్టర్బ్ అయిన గౌరవ్‌కు వచ్చిన ఐడియా ఏంటంటే.. ముంబై, టొరంటోలో ఆయన చూసిన డ్రమ్స్ సర్కిల్స్ గుర్తొచ్చాయి. డ్రమ్స్ సర్కిల్స్‌లో మొదటిసారి పాల్గొన్నప్పుడు ఎంతో ఆకర్షణీయంగా అనిపించింది. ఇక దీన్ని వదులుకోవద్దని అనుకున్నాడు. ఇండియాలోని ప్రతీ రాష్ట్రంలోనూ రెండు ప్రసిద్ధ వాయిద్యాలు ఉన్నాయనీ.. ఆ లయబద్దమైన సంగీతమే ప్రజలను ఒక్కచోటుకు చేరుస్తుందని భావించి తన ఆలోచనను స్నేహితులు కృష్ణకుమార్, మధు శ్రీనివాస్‌లతో పంచుకున్నాడు. డ్రమ్ సర్కిల్ అంటే ఏంటి అనేది ప్రణాళిక వేసుకున్నారు.
బెంగళూరు క్రియేటివ్ సర్కస్
2023లో కబ్బన్ పార్కులో మొదటి డ్రమ్ సర్కిల్ నిర్వహించారు. గౌరవ్ స్నేహితులతో పాటు పార్కులో ఉన్న కొంతమంది చేరారు. ముంబైలో బాంద్రా బ్యాండ్ స్టాండ్, జుహూ బీచ్‌లలో సులభంగా సమావేశమయ్యే వాతావరణం బెంగళూరులో లేదని గ్రహించారు. ఈ అనుభవం గౌరవ్‌ను మరింత ఆలోచనలో పడేసింది. వాతావరణ ప్రభావం చూపించని.. అందరికీ సౌకర్యవంతమైన, ఆమోదయోగ్యమైన స్థలంకోసం అన్వేషించారు. బెంగళూరు క్రియేటివ్ సర్కస్ అనే ఓ పాత గిడ్డంగి దొరికింది. ఇప్పడదే కళకారులకు, సంగీతకారులకు వేదికైంది.
140 మంది ఒకేచోట..
2023 జూన్ 4న గౌరవ్ తన డ్రమ్‌తో పాటు అదనపు డ్రమ్స్ తీసుకొచ్చి మొదటి అధికారిక సెషన్ నిర్వహించారు. 150 మందితో సెషన్ చేయాలనేది అతడి కల. ఇప్పుడు ప్రతీ సెషన్‌కు 140 మంది వస్తున్నారు. ఇదొక సంగీత కార్యక్రమమే కాదు. ప్రజలను ఒకచోట చేర్చి ఒత్తిడి లేని ఆనందాన్ని పంచే వేదిక. కొత్త స్నేహితులను, సానుకూల సమాజాన్ని ఇచ్చే సముదాయం. ఇంట్రోవర్టులు తమ టాలెంటును నిరూపించుకునే స్థలంగా చెప్పుకోవచ్చు. ఇతర సంగీత రకాలతో పోలిస్తే డ్రమ్స్‌లోని లయ ప్రజలను త్వరగా ఆకర్షిస్తుంది. అమాంగ్ అస్ అనే పోడ్ కాస్ట్‌ను ప్రారంభించి మరింత విస్తరింపజేస్తున్నారు.






