తండ్రి సమస్యకు కూతురి AI పరిష్కారం.. స్టార్టప్‌గా మారిన ‘వోగ్జా’!

by Javid Pasha |

వోగ్జా ఏఐ రిసెప్షనిస్ట్ ఇప్పుడు కస్టమర్ల కాల్స్‌కు సమాధానం ఇవ్వడం, అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం వంటి పనులు చేస్తోంది.

తండ్రి సమస్యకు కూతురి AI పరిష్కారం.. స్టార్టప్‌గా మారిన ‘వోగ్జా’!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఏదైనా ఒక సమస్య తలెత్తితే దానినుంచి తప్పించుకోవాలని ప్రయత్నించేవారే ఎక్కువ. కానీ కొందరు మాత్రం అలా కాదు. ఆ సమస్యకు పరిష్కారం కనుగొనే వరకు పోరాడుతుంటారు. ఈ రెండవ కోవకు చెందిన వ్యక్తే బ్రిటీష్ కొలంబియాకు చెందిన మానా జంపాల. 12 ఏళ్ల వయసుగల ఈ బాలిక తన తండ్రి నిర్వహిస్తున్న చిన్నపాటి వ్యాపారంలో తక్కువ మంది సిబ్బంది ఉండటంవల్ల కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్ స్వీకరణ, నిర్వహణలో ఇబ్బంది పడుతున్నట్లు గమనించింది. దీనికి పరిష్కారాన్ని కనుగొనే క్రమంలో తనే స్వయంగా ఒక ఏఐ ఆధారిత రిసెప్షనిస్ట్ వోగ్జా(Voxa)ను డెవలప్ చేసింది. ఇంతకీ ఇదేమిటి? దీనివల్ల కలిగిన ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మానా జంపాల(Mana Jampala) కుటుంబం బ్రిటిష్ కొలంబియాలోని కెలోనా (Kelowna) నగరంలో నివసిస్తోంది. ఆమె భారతీయ (తెలుగు) కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, కెనడాలో పుట్టి పెరిగింది. కాగా తన తొమ్మిదేళ్ల వయసు నుంచే ఈ యువతి ఏఐ(AI)పై ఆసక్తితో స్క్రాచ్ (Scratch) కోడింగ్ క్యాంపుల్లో పాల్గొనేది, పైథాన్ కూడా నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె చదువుకుంటూనే కోడింగ్, సైన్స్ పోటీలపై దృష్టి సారించింది. అయితే తన తండ్రి నిర్వహిస్తున్న చిన్న వ్యాపారంలో కస్టమర్ కాల్స్ మిస్సవుతున్నట్లు గుర్తించిన మానా జంపాల వోగ్జా అనే పేరుగల ఏఐ ఆధారిత రిసెప్షనిస్టును 2025 నవంబర్‌లో అభివృద్ధి చేసింది. ఈ చిన్న సాఫ్ట్‌వేరే ఇప్పుడు తన కుటుంబం నిర్వహించే చిన్న వ్యాపారాల్లో 24/7 కస్టమర్ కాల్స్ మేనేజ్ చేయడంలో సహాయపడుతున్నది.

ముఖ్యంగా వోగ్జా (Voxa) అనే ఏఐ రిసెప్షనిస్ట్ కస్టమర్ల కాల్స్‌కు సమాధానం ఇవ్వడం, అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, రెస్టారెంట్ ఆర్డర్లు నమోదు చేయడం, మిస్డ్ కాల్స్ నిర్వహణ, కాల్ సమరీలు ఇవ్వడం వంటి పనులు చేసిపెడుతోంది. దీంతో మానా జంపాలా Voxa Agents పేరుతో ఒక AI స్టార్టప్‌ను కూడా ప్రారంభించి నడుపుతోంది. కాకపోతే ఇంకా ‘బూట్‌స్ట్రాప్ దశ’లోనే ఉంది. మొదటి పెయిడ్ కస్టమర్‌ను సాధించే ప్రయత్నాలు చేస్తోంది. పన్నెండేళ్ల వయసులోనే ఒక కోడింగ్ ఆధారిత ప్రాజెక్ట్‌లో సక్సెస్ కావడం, ఏఐ ఆధారిత వోగ్జా రిసెప్షనిస్టును డెవలప్ చేయడం వంటివి మానా జంపాలా కృషి, పట్టుదల, ధైర్య సాహసాలకు నిదర్శనాలే కాకుండా, ఆధునిక యువతకు ఒక ప్రేరణగా నిలుస్తాయంటున్నారు నిపుణులు.

Next Story