సాలుమరద తిమ్మక్క.. వృక్షాలకే తల్లి.!

by Daayi Srishailam |

కర్ణాటకకు చెందిన తిమ్మక్కను వృక్షమాతగా పిలుస్తారు

సాలుమరద తిమ్మక్క.. వృక్షాలకే తల్లి.!
X

దిశ, ఫీచర్స్: మనం బాగుండాలంటే పర్యావరణం బాగుండాలి. పర్యావరణం బాగుండాలంటే భూమ్మీద స్వచ్ఛమైన గాలి.. ఆ గాలినివ్వడానికి పుష్కలమైన వనాలు ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వనాలు సృష్టించడం అంత ఈజీ కాదు. కానీ దాన్ని సుసాధ్యం చేసి చూపించింది సాలుమరద తిమ్మక్క. కర్ణాటకకు చెందిన తిమ్మక్కను వృక్షమాతగా పిలుస్తారు.

చెట్లను ప్రేమిస్తూ..

సాలుమరద తిమ్మక్కది కర్ణాటక. ఆమె వయసు 114 సంవత్సరాలు. 8000కు పైగా చెట్లను నాటి ప్రకృతిని సంరక్షించింది. పర్యావరణవేత్తగా ఆమె ప్రపంచవ్యాప్తంగా సుపరిచితురాలు. 2019లో పద్మశ్రీ అవార్డును సైతం పొందింది. శుక్రవారం రోజున అనారోగ్య సమస్యలతో మరణించిన తిమ్మక్క గురించి నేటితరం తెలుసుకోవాల్సి ఉంది. నిన్నమొన్నటి వరకు మన మధ్యనే.. చెట్లను ప్రేమిస్తూ మనకు శ్వాసనిచ్చిన తిమ్మక్క తుదిశ్వాస విడిచి మనకొక మెమొరీగా మిగిలిపోయింది. ఆమె ఆశయం మనకు ఆదర్శం కావాలి. ఆమె సంకల్పం మనకు స్ఫూర్తినివ్వాలి.

385 మర్రిచెట్ల శ్రేణి..

సాలుమరద తిమ్మక్క 1911 జూన్ 30న తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలో జన్మించింది. ఆమె చదువుకోలేదు. కూలీ పని చేసేది. చెట్లంటే తనకు ప్రాణం. రోజుకొక మొక్క నాటేది. తనకు సంతానం లేకపోవడంతో మొక్కలను పెంచి వాటిని సొంత పిల్లల్లా కాపాడుకునేది తిమ్మక్క. భర్త చిక్కయ్యతో కలిసి మొదట 10 మొక్కలు నాటింది. దినాం ఆ పది మొక్కలకు నీళ్లు పోయడం.. ముళ్ల కంచెలు వేసి పశువుల నుంచి కాపాడుతూ పర్యావరణం మీద ప్రేమను చాటుకునేది. కాలక్రమేణా బెంగళూరు సమీపంలోని హులికల్-కుదూర్ మధ్య 5 కిలో మీటర్ల మేర 385 మర్రిచెట్ల శ్రేణి ఏర్పరిచింది.

2019లో పద్మశ్రీ..

సాలుమరద అంటే చెట్ల వరుస అన్నమాట. ఆమె వందలాది చెట్లు పెట్టి చెట్లవరసను అంటే చెట్ల సాలును ఏర్పాటుచేసింది కాబట్టీ ఆమెను సాలుమరద తిమ్మక్కగా పిలుస్తారు. అలా మొత్తం 8,000కు పైగా చెట్లు నాటి ఒక రికార్డు సృష్టించింది. పర్యావరణా ఐకాన్‌గా మారింది. తిమ్మక్క అంకితభావానికి మెచ్చి ఎన్నో అవార్డులు వరించాయి. 2019లో పద్మశ్రీ.. 1995లో నేషనల్ సిటిజన్ అవార్డు.. 2010లో హంపి యూనివర్శిటీ నాడోజ అవార్డు వచ్చాయి. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటక నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందింది. 2019లో రోడ్డు విస్తరణ ప్రాజెక్టు నుంచి గ్రీన్ కారిడార్‌ను కాపాడింది.

నిత్యం సజీవంగా..

తిమ్మక్క చెట్లు నాటడమే కాదు.. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వాటి అభివృద్ధిలో అస్సలు వెనక్కి తగ్గలేదు. దీనినొక ఉద్యమ పంథాగా మార్చుకొని పర్యావరణం కోసం పోరాటం చేసింది. ఇవాళ తిమ్మక్క మన మధ్యన లేకపోయుండొచ్చు. కానీ ఆమె నాటిన చెట్ల రూపంలో ఆమె నిత్యం సజీవంగానే ఉంటుంది. నిస్వార్థంతో కూడిన ఆమె జీవితం నేటి తరానికి దీపస్తంభం లాంటిది. తన చిన్న ప్రయత్నం ఇవాళొక పెద్ద ఉద్యమంగా మార్చి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమని నిరూపించింది. ప్రపంచం పర్యావరణ సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో పర్యావరణాన్ని మనమంతా నిర్మించుకోవాలనే సందేశాన్ని తిమ్మక్క జీవితం ఇస్తోంది.

Next Story