100 ఏళ్ల చాయ్.. ఎవరి చాయ్ వాళ్లే పెట్టుకొని తాగి డబ్బులిస్తారు.!

by Daayi Srishailam |

100 ఏళ్ల నమ్మకం

100 ఏళ్ల చాయ్.. ఎవరి చాయ్ వాళ్లే పెట్టుకొని తాగి డబ్బులిస్తారు.!
X

చాయ్..

నిద్రాణమైన మనిషిని కూడా లేపి మాట్లాడిస్తది.

అన్నం.. నీళ్లు లేకపోయినా ఏం కాదుగానీ..

కొందరికి చాయ్ లేకపోతే అస్సలు నడవదు.

అలాంటి ఒక చాయ్‌కి 100 ఏళ్ల చరిత్ర ఉంది.

అదిప్పటికీ నడుస్తూనే ఉంది.

- దిశ, ఫీచర్స్

అది పశ్చిమ బెంగాల్. సంపూర్ గ్రామంలోని నిశ్శబద్ద వీధుల్లో 100 ఏళ్ల క్రితం టీస్టాల్ పెట్టారు. అప్పుడు ఇప్పుడు అక్కడ ఉద్యోగులెవరూ ఉండరు. జీతాలిచ్చే విధానమే లేదు. అయినప్పటికీ వందేళ్ల నుంచి అది నడుస్తోంది.

నమ్మకం పునాది

ఈ రోజుల్లో చాయ్ బండీ లేని వీధి ఉంటుందా.? అడుగడుగునా "టీ టైమ్".. "చాయ్ బంక్".. "టీ జోన్".. "చాయ్ తాగిపో" వంటి తీరొక్క చాయ్‌లొచ్చి వినూత్న రీతిలో ప్రచారం చేసుకుంటున్నారు. యాడ్స్ ఇచ్చి "అయ్యయ్యో వద్దమ్మా" అని బ్రాండ్ గురించి చెప్పుకుంటున్నారు. ఈ పోటీ ప్రపంచంలో "వందేళ్ల చాయ్" మనుగడ సాధ్యమేనా అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. కానీ.. ఈ లట్టూ పొట్టూ చాయ్‌లు ఏవీ "వందేళ్ల చాయ్"ను బ్రేక్ చేయలేదు. ఎందుకంటే ఇది కేవలంం నమ్మకం.. ప్రేమతో నడుస్తున్న టీ స్టాల్.. పైసల కోసం కాదు.

సమిష్టి చాయ్

ప్రతీ ఉదయం.. స్టాల్ యజమాని అశోక్ చక్రవర్తి దుకాణాన్ని తెరిచి.. తన పని కోసం వెళ్లిపోతారు. అప్పటి నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్థానికులై పెద్దవారు.. పదవీ విరమణ చేసిన వ్యక్తులు స్వచ్చందంగా ఈ టీ స్టాల్‌ను నిర్వహిస్తారు. వారే టీ తయారు చేస్తారు. కస్టమర్లకు అందిస్తారు. డబ్బులూ తీసుకుంటారు. స్టాల్‌ని శుభ్రం చేస్తారు. ఇవన్నీ ఒక్క రూపాయి ప్రతిఫలం ఆశించుండానే చేస్తారు. ఎలాంటి షిఫ్ట్‌లు.. షెడ్యూల్స్.. గందరగోళం లేకుండా.. కేవలం నిశ్శబ్ద అవగాహన.. సమిష్టి భావనతో ఈ స్టాల్ నడుస్తోంది ఇప్పటికీ.

సాంస్కృతిక అడ్డా

"సంపూర్ టీ స్టాల్"లో చాయ్ తాగే ప్రతి వ్యక్తీ.. ఇతరులకు సేవ చేస్తాడు. అంటే చాయ్ పెట్టడం.. సర్వ్ చేయడం.. క్లీన్ చేయడం. అలా ఒకరు అయిపోగానే ఇంకొరు వచ్చి ఎవరూ అడగకుండానే చాయ్ పెట్టడం.. పాలు వేడి చేయడం.. డికాషన్ అయిందా లేదా చూసుకోవడం చూస్తారు. అందుకే దీనినొక "సాంస్కృతిక అడ్డా"గా చెప్పుకుంటారు. స్నేహపూర్వక సమావేశాలు.. కథలు పంచుకోవడం.. చర్చలు.. నవ్వులు ఇవన్నీ ఇక్కడ సజీవంగా కనిపిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గత 100 ఏళ్లలో ఒక్కసారి కూడా చాయ్ డబ్బుల చెల్లింపు బాకీ నమోదు కాలేదు.

పోటీపడి తాగుతారు

మామూలుగా అయితే టీ స్టాల్‌కి వెళ్లి "చోటూ దో చాయ్" అని రుబాబ్‌గా ఆర్డర్ వేస్తాం. కానీ ఇక్కడ అలాంటివేమీ ఉండవు కాబట్టీ ప్రశాంతతను కోరుకునేవారు.. స్నేహితులతో కాలక్షేపం కోరేవారు.. రాజకీయాల గురించి చర్చించేవారు సంపూర్ టీ స్టాల్‌కి వస్తుంటారు. సాయంత్రం చాయ్ బండీ ఓనర్ అశోక్ చక్రవర్తి వచ్చేవరకు కూడా ఇక్కడ జనాలతో కిక్కిరిసే ఉంటుంది. ఆయనొచ్చి గల్లాపెట్టె చెక్ చేసుకునేది లేదు.. ఎంతమంది వచ్చారని ఆరా తీసేది లేదు. ఇదొక సంప్రదాయంగా.. హృదయాలను వెచ్చదనం నింపే వేడుకగా భావిస్తుంటారు కాబట్టే సంపూర్ చాయ్ సక్సెస్ అయింది.

Next Story