నోముల నర్సన్న ప్రస్థానమిది…

by  |
నోముల నర్సన్న ప్రస్థానమిది…
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: మార్క్సిస్టు దృక్పథంతో ప్రజాసమస్యలపై పాలకుల ఎత్తులను చిత్తు చేసిన రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన నోముల నర్సింహ్మయ్య‌యాదవ్ అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున 5.30 సమయంలో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 30 సంవత్సరాలకు పైగా రాజకీయ, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేకతను చాటిచెప్పే వాగ్దాటితో బహుజనం బాగు కోసం నిరంతరం తపించిన బలహీన వర్గాల పెన్నిధిగా నర్సింహాయ్య పేరు సంపాదించారు. సామాన్య, మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి జీవితాంతం పోరాటాలకు, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి నర్సింహాయ్య. ఆయన ఆశయాలు, ఆచరణ మార్గాలు ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచాయనడంలో ఏలాంటి సందేహం లేదు. అలాంటి ప్రజానేత నోముల నర్సింహాయ్య మరణం.. బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటనే చెప్పాలి. కమ్యూనిస్టు సిద్ధాంతాల నుంచి ఉద్యమ పార్టీలోకి మారిన పరిస్థితులు, విద్యార్థి రాజకీయాలు, సీపీఎం శాసనసభపక్ష నేతగా ఆయన వ్యవహరించిన తీరుపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

ఓయూ నుంచి రాజకీయ బీజాలు..

నోముల నర్సింహాయ్య చిన్నతనం నుంచే కమ్యూనిజం భావజాలంతో ముందుకుసాగాడు. కనీసం విద్యనభ్యసించేందుకు ప్రాథమిక పాఠశాల సైతం లేని గ్రామంలో పుట్టిన ఆయన చిన్ననాటి నుంచే పోరాటం మొదలుపెట్టారు. తన స్వగ్రామం పాలెంనకు మూడు కిలోమీటర్ల దూరంలోని నోముల గ్రామంలోని పాఠశాలకు వచ్చి చదువుకుని వెళ్లేవాడు. అలా ప్రాథమిక విద్యాభ్యాసమంతా నోములలోనే పూర్తి చేశాడు. అనంతరం దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్‌జీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలోకి లా (ఎంఏ.ఎల్ఎల్‌బీ) విద్య కోసం అడుగుపెట్టాడు. ఓ వైపు చదువుకుంటూనే.. విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేస్తూ విద్యార్థి, ప్రజాసమస్యలపై పోరాడేవాడు. 1981 సంవత్సరంలో ఓయూ న్యాయవిద్యలోకి ప్రవేశించి 1983 సంవత్సరంలో ఎంఏ ఎల్ఎల్‌బీ పూర్తి చేశాడు. అనంతరం నకిరేకల్, నల్లగొండ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజాసమస్యలపై పోరాటం సాగించేవారు. దీన్ని గమనించిన అప్పటి నకిరేకల్ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి రాజకీయాల్లోకి నర్సింహాయ్యను ఆహ్వానించి ప్రోత్సహించారు. రాఘవరెడ్డి రాజకీయ వారసుడిగా నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఎం నుంచి గెలుపొందిన రెండుసార్లు శాసనసభ పక్ష నేతగా ఉంటూ ప్రజాసమస్యలపై అప్పటి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు.

అసెంబ్లీలో ప్రజాసమస్యలపై గళం..

సీపీఎం తరపున నకిరేకల్ ఎమ్మెల్యేగా 1999, 2004లో గెలుపొందారు. ఆ రెండు సార్లు సీపీఎం శాసనసభపక్ష నేతగా ఉంటూ ప్రజాసమస్యలపై నిత్యం గళమెత్తేవారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో విద్యుత్ సమస్యలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదనే చెప్పాలి. నర్సింహాయ్య గెలిచింది నకిరేకల్ నుంచి అయినా.. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా.. అధికార పక్షాలను అసెంబ్లీ సాక్షిగా నిలదీసేవారు. తన వాక్‌చాతుర్యంతో పాటు ప్రజలకు అర్థమయ్యే రీతిలో తనదైన సామెతలు చెబుతూ అసెంబ్లీ సమావేశాలను హీటెక్కించేవారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయంటే చాలు.. నోముల నర్సింహాయ్య ప్రసంగం కోసం ఇటు అధికార పక్షాలతో పాటు ప్రతిపక్షాలు సైతం ఆత్రుతగా ఎదురుచూసేవారు. ఇంత చేసినా.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలతో అత్యంత సన్నిహిత సంబంధాలను మెయింటెన్ చేస్తూ వచ్చారు. దాదాపు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన 10 సంవత్సరాల పాటు ప్రజాసమస్యలపై గళం విన్పించడంలో నోముల నర్సింహాయ్య ఎప్పుడూ ముందుండేవారు.

మినీ, ఇండోర్ స్టేడియంతో చరిత్ర..

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మినీ, ఇండోర్ స్టేడియాన్ని నిర్మింపజేసిన చరిత్ర నోముల నర్సింహాయ్యకే దక్కింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిపై ఎక్కడా లేని తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి స్టేడియం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. దీనికితోడు జాతీయ రహదారిని అనుకుని షిర్డీ తరహాలో సాయిబాబా ఆలయాన్ని సువిశాల ప్రదేశంలో నిర్మించేలా చేసిన ఘనత ఆయనదే. 1999 నాటికి నకిరేకల్ నియోజకవర్గంలోని శాలిగౌరారం, వేములపల్లి, కేతేపల్లి, నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి మండలాలకు కనీస రోడ్డు సౌకర్యం ఉండేదికాదు. నర్సింహాయ్య ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా మండలాలకు రోడ్డు, బస్సు సౌకర్యాన్ని కల్పించడంలో సఫలీకృతమయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోవోల్టేజీ విద్యుత్ సమస్యలతో రైతాంగం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యేది. కలెక్టరేట్, విద్యుత్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టి సమస్యలు పరిష్కారమయ్యేలా చేశారు. ప్రధానంగా నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రజానీకానికి ఓ మోస్తరు జబ్బు చేసినా.. పరిస్థితి దారుణంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలకు హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స సకాలంలో అందేలా చేయడంలో నర్సింహాయ్య ఎనలేని కృషి చేశారు.

కమ్యూనిజం నుంచి ఉద్యమపార్టీలోకి..

తాను నమ్ముకున్న కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా సీపీఎం పార్టీని ఏండ్ల పాటు తన భుజస్కంధాలపై మోశాడు. కానీ సీపీఎంలో జరిగిన అంతర్గత పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బయటకు రావడానికి ముందు తీవ్రంగా మథనపడ్డారు. ప్రజల పక్షాన నిలిచే సీపీఎంను పార్టీలోని ఓ సామాజిక వర్గం చేసిన కుట్రల కారణంగా బయటకు పోవాల్సి వచ్చిందంటూ సన్నిహితులతో అభిప్రాయపడ్డారు. దాదాపు 10 ఏండ్ల పాటు శాసనసభ పక్ష నేతగా ఉన్నా.. చివరకు సీపీఎం నుంచి టికెట్ దక్కకుండా చేయడంలో ఆ వర్గం ప్రయత్నాలు ఫలించాయన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. నోముల నర్సింహాయ్య 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నుంచి హుజూర్‌నగర్ టికెట్‌ను ఆశించారు. కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం నర్సింహాయ్యకు టికెట్‌ను కేటాయించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2014 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేసేందుకు చివరి రోజు టీఆర్ఎస్‌లో చేరారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఇది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఎన్నికల్లో జానారెడ్డిపై ఓడిపోయినా.. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అధికార పక్షంలో ఎమ్మెల్యేగా ఉండడంతో ఒకప్పుడు అసెంబ్లీలో నోముల నర్సింహాయ్య ప్రసంగ తీరు ఏ కోశాన కన్పించలేదు. ఆ పరిస్థితిపై ఇప్పటికీ జిల్లా ప్రజానీకం తీవ్ర నిరుత్సాహంతోనే ఉన్నారు. సీపీఎం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నర్సింహాయ్యను మళ్లీ చూడలేమా.. అన్న బాధను చాలామంది అసెంబ్లీ సమావేశాల సమయంలో గుర్తు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు.

ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఒక ఘటన..

నోముల నర్సింహ్మయ్య పేరు వినగానే… అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జమానాలో 1999- 2004 మధ్య కాలంలో… రైతుల దీన పరిస్థితిని వివరిస్తూ అసెంబ్లీలో ‘కరువు’పై మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆయన మాటల్లోనే ‘ ఓ రైతు వ్యవసాయం చేయలేక, కుటుంబాన్ని పోషించుకోలేక… భార్యను తల్లిగారింటికి పంపించిండట… పిల్లలను అమ్మమ్మ గారింటికి పంపించిండట… తాను అత్తగారింటికి పోయిండట…’ అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన చమత్కరించిన తీరు ఎవ్వరూ మరిచిపోలేనిది. ఇంత అర్థవంతంగా, చమత్కారంతో మాట్లాడే నేతలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు చాలా అరుదు. మొన్నటి అసెంబ్లీ సెషన్‌‌ జరుగుతోంది. ఆ సమయంలో ‘నోముల నర్సింహ్మయ్య.. పాయింట్ ఆఫ్ ఆర్డర్’ లేవనెత్తుతూ కనిపించారు. కానీ స్పీకర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో టీవీ చూసిన చాలామంది నకిరేకల్ నియోజకవర్గ నేతలు ఆ తతంగాన్ని చూసి ‘నర్సింహ్మయ్య ఇది ఎనకటి అసెంబ్లీ అనుకుంటున్నడు. ‘కమ్యూనిస్టు’గా నర్సింహ్మయ్య గళానికి తిరుగులేదు… కానీ ‘గులాబిస్టు’గా నర్సింహ్మయ్య నోరు పెకలలేదు.’ అంటూ అభిప్రాయపడ్డారు.

పూర్తి సమాచారం..

పేరు : నోముల నర్సింహాయ్య
విద్యార్హత : ఎంఏ(ఎల్ఎల్‌బీ)
తల్లిదండ్రులు: నోముల రాములు, మంగమ్మ
భార్య: లక్ష్మి
సంతానం: ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు

పెద్దకూతురు: ఝాన్సీరాణి, అల్లుడు:రవి (వీరిద్దరు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అక్కడి ప్రభుత్వశాఖల్లో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు)
చిన్నకూతురు: అరుణజ్యోతి, అల్లుడు: క్రాంతికుమార్ (ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు.)
కొడుకు: నోముల భగత్ కుమార్(హైకోర్టు న్యాయవాది)
కోడలు: భవాని (వ్యాపారం)

తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యమిదీ..

నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన నోముల రాములు, మంగమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఇందులో నోముల నర్సింహయ్య రెండో సంతానంగా నకిరేకల్ మండలం పాలెంలో 1956, జనవరి 9న జన్మించారు. పెద్దకుమారుడు సీతారాములు అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మూడో సంతానం నోముల మురళి ఏసీపీ హోదాలో విజిలెన్సుశాఖలో పనిచేస్తున్నారు. గోవిందరాజులు అడ్వొకేటుగా, యోగిబాబు ప్రభుత్వలెక్చరరుగా పనిచేస్తున్నారు. ఇక కూతుర్ల విషయానికొస్తే.. పెద్ద కూతురు సుజాత మాజీ సర్పంచ్ కాగా, చిన్న కూతురు గాయత్రి అడ్వకేట్‌గా సూర్యాపేట కోర్టులో వృత్తిని కొనసాగిస్తుండగా, ఆమె భర్త రామ్మూర్తి సూర్యాపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడిగా ఉన్నారు. నోముల నర్సింహాయ్య కుటుంబానిది పూర్తిగా మధ్య తరగతి వ్యవసాయ నేపథ్యం.

రాజకీయ నేపథ్యం..

సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, దోపిడీకి గురవుతున్న సామాజిక వర్గాలను చూసి అప్పటిరాజకీయ పరిస్థితులకు ఆకర్షితులై 13 సంవత్సరాల వయసులోనే ఎర్రజండా చేతబట్టి ప్రజాఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఉద్యమాలలో పాల్గొంటూ విద్యార్థి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపుగా 20 సంవత్సరాలు న్యాయవాదిగా సేవలందిస్తూనే కమ్యూనిస్టు పార్టీ నుంచి పోటీచేసి ప్రత్యక్షఎన్నిక ద్వారా ఎన్నుకోబడి 1987 నుంచి 1999 వరకు 12 ఏండ్లు నకిరేకల్ మండల అధ్యక్షుడిగా పనిచేసారు. 1999 -2009 వరకు రెండుసార్లు నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయి, అసెంబ్లీలో 10 సంవత్సరాలు శాసనసభపక్ష నాయకుడిగా సేవలందించి ప్రజలపక్షాన పోరాడుతూ అసెంబ్లీలో బలమైన వాగ్ధాటిగా ముద్రవేసుకున్నారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ అవడం వల్ల భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2009 నుంచి 2014 వరకు సీపీఎం పార్టీ రాష్ట్రకమిటీ సభ్యుడిగా ఉండి ప్రజాఉద్యమాల్లో పనిచేస్తూ వచ్చారు. అనంతరం ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌లో ఎలక్షన్స్ ముందే చేరి 2014 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుండి జానారెడ్డిపై పోటీకి చివరి క్షణాల్లో నామినేషన్ ఆఖరిరోజే వచ్చి కొద్దీ ఓట్ల తేడాతో గెలుపునకు దూరమయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎల్పీ నేత కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి మీద ఘన విజయం సాధించారు. ఎన్నికల సమయం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నోముల నర్సింహాయ్య పలుమార్లు కేరళకు వెళ్లి వైద్యం తీసుకున్నారు. కొంతకాలం యాక్టివ్గానే ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు తిరగబెట్టడంతో కొంత నెమ్మదించారు. దీంతో నియోజకవర్గంలో ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. ఎక్కువగా హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఉంటూ వైద్య చికిత్స తీసుకుంటున్నారు.

రేపు పాలెంలో నోముల అంత్యక్రియలు..

నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య అంత్యక్రియలు బుధవారం నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో ఉన్న నోముల పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని కొత్తపేట నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం నర్సింహయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నాగర్జునసాగర్ నియోజకవర్గమైన హాలియా మండల కేంద్రంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. బుధవారం సాయంత్రం నకిరేకల్‌కు తరలించి ఆయన వ్యవసాయ క్షేత్రమైన పాలెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Next Story

Most Viewed