గడ్డిఅన్నారం మార్కెట్లో అక్రమాల బాగోతం

by  |
Gaddi Annaram
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ రంగారెడ్డి జిల్లా పరిధిలోని గడ్డిఅన్నారం. ఈ మార్కెట్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. అక్రమాలు, అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి మరికొంత మందిపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పాలకవర్గం సభ్యులు చైర్మన్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో ప్రతి ఏడాది రూ.500 కోట్లకు పైగా క్రయ, విక్రయాలు జరుగుతాయి. ఈ మార్కెట్‌లో కొనుగోళ్లు చేసే ప్రతి వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. కొత్త లైసెన్స్ ఇవ్వాలంటే మార్కెట్ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులు చేసుకొని పాలకవర్గం తీర్మానం, అధికారుల ఆదేశాలు తప్పనిసరి. అంతేకాకుండా మార్కెట్లో అనువైన స్థలం ఉన్నప్పుడే కొత్త లైసెన్స్ జారీ చేయాలి. కానీ ఎన్నో ఏళ్ల కిందట లైసెన్సులు తీసుకున్న వ్యాపారులతోనే మార్కెట్ లోని దుకాణాలు నిండిపోయాడు. కొత్త లెసెన్స్‌లు ఇవ్వాలన్నా మార్కెట్‌లో స్థలం లేదు. కానీ ఇవేవి పట్టించుకోకుండా మార్కెట్ చైర్మన్, కార్యదర్శి కుమ్మక్కై కొత్త లైసెన్స్లు జారీ చేసినట్లు ప్రచారం సాగుతుంది.

Froot Market

ఏకంగా 176 లైసెన్సులు…

గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ పాలక వర్గంతో సంబంధం లేకుండా ఏకంగా 176 కొత్త లైసెన్సులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో 30 లైసెన్సులకు కొత్తగా అనుమతినిస్తున్నట్లు పాలకవర్గంతో చెప్పాడు. అందులో 16 లైసెన్సులు పాలకవర్గం సభ్యులకే ఇవ్వనున్నట్లు మార్కెట్ చైర్మన్ చెప్పడంతో ఒప్పుకున్నారు. కానీ ఆ చైర్మన్ చెప్పింది ఒకటి చేసింది మరోకటి కావడంతో విషయం బయటికి పొక్కింది. ఏకంగా 146 లైసెన్సులు పాలకవర్గం సభ్యులతో సంబంధం లేకుండా చైర్మన్ అనుమతినిచ్చినట్లు తెలిసింది. దీంతో అవాక్కయిన సభ్యులు విషయాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఒక్కో లైసెన్స్‌కు సుమారుగా రూ.5లక్షల వసూళ్లు చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. 176 కొత్త లైసెన్స్‌ల పేరు మీద రూ.8.8‌‌0కోట్లు నగదును తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నగదును మార్కెట్ కమిటీ చైర్మన్ వీరమళ్ల రాంనర్సింహా గౌడ్‌తోపాటు, కార్యదర్శి, క్లర్క్ తదితరులు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు అవినీతిపై తక్షణమే విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సెక్షన్ క్లర్క్ అస్లాం పైన వేటు వేశారు.

గది తాళాలు పగలగోట్టి ఫైళ్లు స్వాధీనం…

మార్కెట్లో నూతనంగా జారీ చేసిన లైసెన్స్‌లపై విచారణ చేపట్టేందుకు మార్కెటింగ్ శాఖ అదనపు సెక్రటరీ వైజే పద్మహర్షను ప్రభుత్వం నియామించింది. లైసెన్సుల జారీలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు విచారణలో స్పష్టమైనట్లు నివేదికను రూపొందించారు. ఆ నివేదికను మార్కెటింగ్ కమిషనర్‌కు గత నెల 30వ తేదీన సమర్పించినట్లు తెలుస్తోంది.

అయితే విచారణ చేపట్టేందుకు ఫైళ్లను దొరకనివ్వకుండా ఓ గదిలో పెట్టి తాళాలు వేశారు. అంతేకాదు అందుకు సంబంధించిన అధికారులు, సిబ్బంది విధులకు గైర్హాజరైయ్యారు. ఆ ఫైళ్ల కోసం ఒక్క రోజు ఒక్క పూట నిరీక్షించిన విచారణ అధికారి ఉన్నతాధికారుల సలహాలతో పంచనామా చేసి గది తాళాలు పగులగొట్టి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి…

గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ వీరమల్ల రాం నర్సింహా గౌడ్‌ను పదవి నుంచి తొలగించాలని పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పుపట్టే కార్యక్రమాలు చేసిన చైర్మన్‌ను తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ పాలకవర్గ సభ్యులే ఆ పార్టీ చైర్మన్‌ను తొలగించాలని చెప్పడంతో ఆ పార్టీ పరువు బజారున పడేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా 176 కొత్త లైసెన్స్‌లను జారీ చేయడం చట్ట వ్యతిరేకమని విమర్శిస్తున్నారు.


Next Story

Most Viewed