తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థినిలపై లెక్చరర్ వేధింపులు..!

by  |
తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థినిలపై లెక్చరర్ వేధింపులు..!
X

దిశ, నిజామాబాద్ రూరల్: డిచ్‌పల్లి‌లోని తెలంగాణ యూనివర్సిటీలో పీజీ విద్యార్థినిలను హిందీ లెక్చరర్ జమీల్ అహ్మద్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై విద్యార్థినులు జిల్లా కలెక్టర్, వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్‌, యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌కు ఉత్తరాలు పంపినట్టు విశ్వసనీయ సమాచారం. ఓ పక్క తెలంగాణ యూనివర్సిటీలో పలు సమస్యలతో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే.. పీజీ విద్యార్థినిలపై హిందీ లెక్చరర్ వేధింపుల వ్యవహారం మరో కొత్త వివాదానికి తెరలేపింది.

హిందీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన లెక్చరర్ విద్యార్థినులు సంతకాల కోసం వెళ్తే గంటల తరబడి నిల్చోబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఒక్కొక్క విద్యార్థిని మాత్రమే రూమ్‌లోకి రావాలని కండీషన్ పెడుతున్నారని వాపోయారు. పైగా తనను ఆనుకొని సంతకాలు పెట్టాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ప్రశాంతమైన వాతావరణాన్ని విద్యార్థినిలకు కల్పించాలని లేఖలో కోరారు.

ఇక ఇదే విషయంపై హిందీ లెక్చరర్ మహమ్మద్ జమీల్ అహ్మద్‌ను వివరణ కోరగా.. తాను ఎవరిని అలా చేయలేదని, తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. హాస్టల్ ప్రారంభమై 15 రోజులు అవుతున్నా.. సరైన సంఖ్యలో విద్యార్థినిలు చేరలేదన్నారు. అటువంటిది తాను ఇబ్బందికి ఎలా గురి చేస్తానని ప్రశ్నించారు. తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే పలువురు లేఖలు రాశారని చెప్పుకొచ్చారు.



Next Story