రాజన్నా.. ఇప్పుడైనా ఓపెన్ చేయరాదే

by  |
రాజన్నా.. ఇప్పుడైనా ఓపెన్ చేయరాదే
X

దిశ, స్టేషన్ ఘన్పూర్: నియోజకవర్గంలోని చర్మకారులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నిర్మించిన లెదర్ పార్క్ భవనం ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంది. 117 ఎకరాల్లో రూపాయలు 275 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగా మారాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా ఈ హామీ మాత్రం నెరవేరడం లేదు.

1994లో మినీ పార్కు శంకుస్థాపన..

దళిత నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి కడియం శ్రీహరి శివునిపల్లి శివారులో సుమారు 25 ఎకరాల స్థలంలో మినీ లెదర్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు యుద్ధ ప్రాతిపదికన లెదర్ పార్క్ నిర్మించడంతో పాటు 50 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి చెన్నైలో లెదర్ చెప్పులు కుట్టడం శిక్షణ కూడా ఇప్పించారు. దీంతో లెదర్ పార్క్ ప్రారంభమవుతుందని అంతా ఆశించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పార్కు ప్రారంభానికి నోచుకోలేదు. అనంతరం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లెదర్ పార్కును పలుమార్లు సందర్శించడంతో పాటు సంబంధిత పరికరాలను తెప్పించి ప్రారంభం చేసేందుకు హడావుడి చేశారు. కానీ పూర్తిస్థాయి పరికరాలు లేకపోవడం, సరిపడా నిధులు మంజూరు కాకపోవడంతో మళ్లీ మొదటికి వచ్చింది. ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వల్ల ఈ భవనం 25 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో లెదర్ పార్క్ పై ఆశలు వదులుకున్న పలువురు నిరుద్యోగులు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు.

ప్రారంభం కాకుండానే శిథిలావస్థకు..

పేదలకు స్వయం ఉపాధి లక్ష్యంగా నిర్మించిన మినీ లెదర్ పార్కు భవనం ప్రారంభం కాకుండానే శిథిలావస్థకు చేరుకుంది. లెదర్ పార్క్ ఏర్పాటు చేసి చర్మకారుల పని చూపాలన్న హామీ కాగితాలకే పరిమితమైంది. 2003లో రూ.10 లక్షల వ్యయంతో భవన నిర్మాణం పూర్తయింది. 2004లో స్థానిక దళితులు వృత్తి నైపుణ్యం కోసం చెన్నైలో మూడు దశల్లో 120 మంది శిక్షణ తీసుకున్నారు. ప్రతి ఎన్నికల్లో లెదర్ పార్క్ ను ప్రారంభిస్తామని హామీతో ప్రజల్లోకి వెళ్తూ 25 ఏళ్లుగా ప్రభుత్వాలు మారినా పార్కు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి లెదర్ పార్క్‌ను ప్రారంభించి చర్మకారుల, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

లెదర్ పార్క్ ప్రారంభంకు కృషి చేయాలి: కొలిపాక సతీష్, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ,ఉమ్మడి వరంగల్.

నియోజకవర్గంలో ఎలాంటి చిన్న పెద్ద పరిశ్రమలు లేకపోవడంతో దళిత యువకులు చర్మకారులు నిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక శిక్షణ తీసుకున్న వారు ఆశలు వదిలేసి కూలిపని చేస్తూ జీవిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మరియు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన లెదర్ పార్కు ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు ఉపాధిని కల్పించాలి.


Next Story

Most Viewed