ఫోన్ వస్తే వణికిపోతున్న హుజూరాబాద్ నాయకులు.. ఎందుకంటే?

by  |
ఫోన్ వస్తే వణికిపోతున్న హుజూరాబాద్ నాయకులు.. ఎందుకంటే?
X

దిశ ప్రతినిది, కరీంనగర్ : హుజురాబాద్ బై పోల్స్‌లో అన్ని పార్టీల నాయకులను భయం వెంటాడుతోంది. ఎప్పుడు పదవి ఊడుతుందనో, ఎటు వైపు నుండి ముప్పు ముంచుకొస్తుందోనన్న ఆందోళన నెలకొనలేదు వారిలో. అర చేతిలో వైకుంఠం చూపుతున్న తమ చేతిలో ఉన్న మొబైల్ ఫోనే శత్రువుకు ఆయుధంగా మారుతోందన్న కలవరం వారిని వెంటాడుతోంది. దీంతో చాలా మంది నాయకులు వ్యక్తిగతంగా కలవడమో లేక వాట్సప్ కాల్‌లో మాట్టాడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉప ఎన్నికల పుణ్యామా అని చేతిలోని సెల్ ఫోన్ రింగ్ అయితే చాలు ఉలిక్కిపడుతున్న పరిస్థితి నెలకొంది.

ట్యాంపిగ్ ఫోబియా

ఎన్నికల వేళ అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే సెల్ ఫోన్‌ను నమ్ముకునేందుకు జంకుతున్న పరిస్థితే తయారైంది. అన్ని ప్రధాన పార్టీల నాయకులనూ ఫోన్ ట్యాపింగ్ ఫోబియా పట్టుకుందనే చెప్పాలి. చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయన్న ప్రచారం ఇటీవల కాలంలో తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో హుజురాబాద్ లోని ఐదు మండలాల నాయకులు రెగ్యూలర్ కాల్ మాట్లాడేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కాల్ చేస్తే వ్యక్తిగతంగా కలిసి మాట్టాడుకుందామని చెప్తున్నారట చాలా మంది లీడర్లు. అర్జంట్ విషయం అయితే వాట్సప్ కాల్‌లో మాట్టాడుకుందాం అని చెప్పేస్తున్నారట. అయితే కొంతమంది నాయకులు రెగ్యూలర్ కాల్స్‌లో మాట్లాడుకున్న విషయాల గురించి అధికార పార్టీ నాయకులు స్థానిక నాయకులతో చర్చించినప్పుడు వారు షాక్‌కు గురయ్యారట. ఈ విషయంలో ఒకరిద్దరు లోకల్ లీడర్స్ ముఖ్య నాయకుల నుండి చీవాట్లు కూడా తినడంతో అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అందువల్లే తాము మాట్లాడుకున్న విషయాలు వారికి తెలిసి ఉంటాయని అనుమానిస్తున్నారట. అయితే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందో లేదో తెలియదు కానీ స్థానిక నాయకులు కాన్ఫిడెన్షియల్ అని చర్చించుకున్న విషయాలు బయటకు పొక్కడంతో ట్యాపింగేనన్న భయంతో కాలం వెల్లదీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరితో మాట్లాడాలన్న వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడుతున్నారని స్థానికంగా సమాచారం.

కోవర్టుపై నిఘా వేశారా..?

హుజురాబాద్ లో అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రత్యర్థి ఈటలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం అధిష్టానం మదిలో కూడా మెదులుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూలింగ్ పార్టీ లీడర్స్ పై అటు ఇంటలీ జెన్స్ నిఘా ఇటు ఫోన్ కాల్స్ పై స్పెషల్ నజర్ వేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

కాల్ రికార్డ్స్ భయం

ఇక పోతే స్మార్ట్ ఫోన్లు కూడ కొంత మంది నాయకుల ఇంటర్నల్ ‘స్మార్ట్’ నెస్‌ను బట్టబయలు చేస్తున్నాయన్న ఆందోళన కూడా నెలకొంది. కొన్ని కంపెనీల మోబైల్స్‌లో ఇన్ బిల్ట్ గా కాల్ రికార్డింగ్ ఆప్షన్ వస్తోంది. కాల్స్ వచ్చిన తరువాత మాట్లాడిన విషయాలు అటోమెటిక్‌గా రికార్డ్ అవుతుండడంతో ఎప్పుడో ఓ సారి అవి బయటకు వస్తున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకముందు ఓ నాయకునితో మాట్టాడిన ఆడియో రికార్డు లీకయిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో కౌశిక్ రెడ్డి ముహుర్తం కన్నా ముందుగానే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. ఇలాగే ఎంతమంది ఫోన్లో ఎవరి గుట్టు దాగుందో కూడా అంతు చిక్కకుండా తయారైంది కొంతమందిలో, ఈ గుట్టు కాస్తా రట్టయితే తమ బండారం బయటపడుతుందన్న ఆందోళన కూడా చాలా మందిలో నెలకొంది. దీంతో ఇక నుండి ఎవరు ఫోన్ చేసినా వాట్సప్ కాల్ లేదా ఫేస్ బుక్ మెసెంజర్ కాల్స్‌లో మాట్టాడేందుకే ప్రియారిటీ ఇస్తున్నారట కొంతమంది నాయకులు. ఇలా మాట్లాడితే అటు ఫోన్ ట్యాపింగ్ బెడదా ఉండదు, ఇటు ఆడియో రికార్డింగ్ భయం ఉండదన్న ధీమాతో హుజురాబాద్ లీడర్స్ కాలం వెల్లిబుచ్చుతున్నారు. ఏది ఏమైనా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఉప ఎన్నికలు కాస్తా తమ జీవితాలను ఎటు వైపు తీసుకెల్తాయోనన్న ఆందోళన మాత్రం స్థానిక నాయకుల్లో నెలకొందనే చెప్పాలి.


Next Story

Most Viewed