ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్న నేతలు.. అంతా ఆయన ఎఫెక్టేనా..?

by  |
Bandi sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాషాయ దళానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దుబ్బాక ఎన్నికల తర్వాత బీజేపీ వైపు చూసిన నేతలు మళ్లీ వెనకడుగు వేస్తున్నారు. బీజేపీలోకి వచ్చిన నేతలు తిరిగి వెళ్లిపోతున్నారు. పార్టీ కండువా కప్పుకొన్నప్పుడు వారిలో ఉన్న జోష్.. ఆ తర్వాత ఉండటం లేదు. రాష్ట్ర పార్టీ అధిష్టానంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతోంది.

మరోవైపు పార్టీ సీనియర్ల మధ్య విభేదాలు కూడా ఇటీవల ఎక్కువయ్యాయనే ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్​ను వ్యతిరేకిస్తున్న నేతలు ఇప్పుడు వలసలను ప్రోత్సహిస్తున్నారనే అపవాదు కూడా ఉంది. ఇదే సాకుతో ఆయనకు బ్రేక్​ వేసేందుకు వ్యూహం పన్నుతున్నారని కాషాయదళంలో చర్చ జరుగుతోంది.

వచ్చినా సైలెంట్​..!

టీఆర్‌ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీలో వలసల పర్వం మొదలైంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మళ్లీ పాత దారిని వెతుక్కుంటున్నట్లు స్పష్టమవుతోంది. పలు కారణాలతో బీజేపీలోకి వచ్చిన కొత్త నేతలను కాపాడుకోలేకపోతుండటం ఆ పార్టీలోని ప్రకంపనలకు దారి తీస్తోంది. గతంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి వంటి సీనియర్​ నేతలు కూడా పార్టీకి గుడ్​బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల పరిణామాల తర్వాత పువ్వు పార్టీకి కొంత ఆదరణ పెరిగింది. మండలి మాజీ చైర్మన్​ స్వామిగౌడ్‌తో పాటు కాంగ్రెస్​ నాయకురాలు విజయశాంతి వంటి నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. అటు గ్రేటర్ ​ఎన్నికల్లో కూడా బీజేపీ కొంతమేరకు సత్తా చాటడంతో కొంత ఉత్సాహం కనిపించింది. కానీ స్వామిగౌడ్​, విజయశాంతి వంటి నేతలు యాక్టివ్​గా లేకపోవడంతో పార్టీలో ఆయా వర్గాల్లో అసంతృప్తి నెలకొంది.

ఈటల చేరికతో పొగ

ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్​ బీజేపీలో చేరడాన్ని పార్టీ నేతలు వ్యతిరేకించారు. ఇదే సమయంలో ఈటల రాజేందర్​ రాజీనామా చేయడంతో హుజురాబాద్​ ఉపఎన్నికల అనివార్యమ వుతున్నాయి. కానీ ఆ సెగ్మెంట్‌కు చెందిన చాలా మంది సీనియర్లు బీజేపీని వీడారు. మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్​ తమపై దాడులు చేయించారని, అణిచివేశాడంటూ ఆరోపణలు చేశారు. తాజాగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా అంతే. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. పార్టీలో కొనసాగేందుకు మనసు అంగీకరించడం లేదని, మారిన రాజకీయాల దృష్ట్యా పార్టీలో కొనసాగలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కనీసం తనతో చర్చించకుండానే ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకొన్నారని ఆయన పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత వారం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన కూడా ఈటల రాజేందర్​ అంశంలోనే పార్టీపై ఆరోపణలు చేశారు. ఈటలను చేర్చుకుని తప్పు చేశారంటూ ప్రకటించారు. అంతకు ముందు మహబూబ్​నగర్ బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎర్ర శేఖర్, భూపాలపల్లి నాయకుడు గండ్ర సత్యనారాయణ రాజీనామా చేసి, కాంగ్రెస్​లో కలుస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే నిజామాబాద్​ ఎంపీ, బీజేపీ ఫైర్​బ్రాండ్​ ధర్మపురి అర్వింద్​ సోదరుడు ధర్మపురి సంజయ్ కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయన టీఆర్ఎస్ ​నేతగా ఉన్నా.. ఆయన సోదరుడు బీజేపీలో ఉండటంతో గతంలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. కానీ ఇటీవల ఆయన అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించాడు. అదే విధంగా తెలంగాణ స్వచ్ఛభారత్ కమిటీ కో కన్వీనర్ యోగీశ్వర్‌రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల కిసాన్​ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావి శ్రీనివాస్ ​కూడా బీజేపీని వీడారు. హుజురాబాద్ ​నియోజకవర్గానికి చెందిన కోరెం సంజీవరెడ్డి, స్థానిక కౌన్సిలర్​ పోరెడ్డి శంతన్​రెడ్డి సహా పలువురు బీజేపీకి రాజీనామా చేశారు.

సీనియర్ల మధ్య పొసగడం లేదు

మరోవైపు బీజేపీ సీనియర్ల మధ్య ఇటీవల విభేదాలు ఎక్కువయ్యాయని పార్టీలోనే టాక్​. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్​ నియామకాన్ని తప్పు పట్టిన కొంతమంది ఇప్పుడు ఇలాంటి అవకాశాల కోసమే ఎదురుచూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ వైఫల్యాలతో అధిష్టానం దగ్గర సంజయ్‌ను వీక్ ​చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల మాజీ మంత్రి దేవేందర్​ గౌడ్ ​తనయుడు వీరేందర్ ​గౌడ్​ కూడా బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడగా… కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి జోక్యంతో వాయిదా వేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులను పార్టీ అధిష్టానానికి వివరిస్తున్నారంటున్నారు.

ఇంకా కొంతమంది..?

రాష్ట్రంలో ఒక్కసారిగా బీజేపీకి బలం పెరిగుతుందని భావించినా… కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలతో కొంత మారినట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించిన నేతలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారంటున్నారు. గతంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డితో పాటు పలువురు కాషాయదళంలో చేరే అవకాశాలను పరిశీలించుకున్నారు. కానీ ఇప్పుడు వారి దృష్టి కాంగ్రెస్​పై పడింది. కానీ ప్రస్తుతం బీజేపీలోని కొంతమంది సీనియర్లు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, వర్గ విభేదాలతో తమకు అన్యాయం జరుగుతుందంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుంటూ పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed