నేతలు.. నయా బూతులు..!

by  |
నేతలు.. నయా బూతులు..!
X

దిశ, సిటీ డెస్క్: అరేయ్ అని ఒకరు.. ఒరేయ్​ అని మరొకరు.. నీ బతుకు ఎంతరా అని ఒకరు.. నువ్వో బచ్చాగాడివని ఇంకొరు.. ఇలా చెప్పుకుంటే పోతే నాయకుల మాటలు అన్నీఇన్నీ కావు.. నోరు తెరిస్తే అబద్ధాలు.. మైకు చేతికందితే పచ్చి బూతులు.. వ్యక్తిగత విమర్శలు.. స్వతహాగా పార్టీ తరఫున వారికి జరిగిన అన్యాయాలు.. ముచ్చట్లు తప్ప ప్రజల బాగోగులు మాట్లాడేది ఉండదు.. బాగోతం బయటపెడుతా అనే సవాళ్లు నిత్య పలుకులయ్యాయి. పార్టీలు మారినంత ఈజీగా మాటలు మార్చేస్తున్నారు. కండువాలు తీసిపారేసినంత సులువుగా ఆరోపణలను దులుపుకుంటున్నారు. ఒంటికాలుపై లేస్తూ ఇతరులపై బూతులు చదవడం పరిపాటిగా మారింది.

ప్రజలు ముందున్నారన్న విషయం మరిచి చెవులు మూసుకేలా తిట్ల దండకం అందుకుంటున్నారు. ఎప్పుడెన్నికలు వచ్చినా నాయకులు తమ వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇస్తున్నారే కానీ, ప్రజా సమస్యల పరిష్కారానికి దారులు వెతికిన దాఖలాలు కనిపించడం లేదు. తరాలు మారుతున్నాయి, నేతలు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి.. కానీ ప్రజల తలరాతలే మారడం లేదు.. నాయకుల వ్యవహారమే అందుకు కారణమని చెప్పక తప్పదు.

సినీ నటులు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేయడం చూసే ఉంటాం.. అది రెండు మూడు గంటల సినిమా విషయంలోనే సరిపోద్ది. అంతకు మించితే వెగటుపుట్టించేదిగా మారుతుంది. కానీ, గ్రేటర్​హైదరాబాద్​లో బహుపాత్రాభినయం చేసే నటులు రోడ్లపై విచ్చలవిడిగా కనిపిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పుణ్యమా.. అని ఏ కాలనీలో చూసిన నేతల లెక్చర్లే లెక్చర్లు.. మైక్​ చేతికందిందంటే చాలూ వెనకాముందు చూసేదేలేదు. మాటల ప్రవాహానికి అడ్డూ అదుపు లేదు. నోటికెంత వస్తే అంతా.. ఏది వస్తే అది.. మంచీచెడు, మానం అభిమానం, గౌరవ మర్యాదలు, విలువలు వంటివి ఏమీ పట్టని తీరుగా తెగ వాగేస్తున్నారు.

ట్రెండ్​ మారింది..

ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ ఉండదు. అరిగిపోయిన పాత రికార్డుల మోత ఎన్నికల వేళ మళ్లీమళ్లీ వినిపించేదే. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. కొత్త కొత్త తిట్లు వెతుక్కొని మరీ తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారో తెలియని స్థితి. ఎంత ఎక్కువ తిడితే అంతగా అన్నట్టు రెచ్చిపోయి పూనకం వచ్చిన వారిలా అరుస్తున్నారు. కొత్తకొత్త పదాలు వెతుక్కుని మరీ తిడుతున్నారు. సభ్యసమాజం తలదించుకునే స్థాయికి దిగజారి బూతులు వల్లెవేస్తున్నారు. వీళ్లు నాయకులా.. లేక మరేమైనానా అనే దౌర్భాగ్యపు స్థితికి వెళ్తున్నారు.

కేరింతలే బలం…

చప్పట్లు, ఈలలు ఉంటే ఇక నాయకులను ఆపడం ఎవరి తరం కాదన్నట్టు శృతి మించుతున్నారు. ప్రజల ముందు నిస్సిగ్గుగా, విచక్షణ మరిచి పరుషపదజాలంతో రాయలేని మాటలు వదులుతున్నారు. ఎంతసేపు వారి తిట్ల దండకం తప్ప ప్రజల బాగోగులు మాట్లాడడం అనే విషయాన్నే మరిచిపోయారు. ఎంతలా అంటే ఒకప్పుడు ఏక వచన సంబోధన చేస్తేనే అగౌరవంగా ఉండే రాజకీయాలు, ఇప్పుడు వ్యక్తిగత సంబోధన వరకూ వెళ్లాయంటే నాయకులు ఎంతగా దిగజారుడు కల్చర్​ కు అలవాటు పడ్డారో చూడొచ్చు. కార్యకర్తలు, అభిమానులు ప్రచార రథాల ముందు డ్యాన్సులు, ఈలలు, గోలలు చేస్తుంటే నాయకులకు మరింత బలం వచ్చినట్టుగా అనిపిస్తోంది. కార్యకర్తలను చూసి వీళ్లు రెచ్చిపోయి తిడుతున్నారో, లేక వీళ్ల తిట్లకు కార్యకర్తలు డ్యాన్సులు, ఈలలతో ఇరగదీస్తున్నారో తెలియదు కానీ ఒకరిని మించి ఒకరు బూతు పురాణంలో పీహెచ్​డీలు కంప్లీట్ చేసుకున్నట్లుగా చెలరేగిపోతున్నారు.

బహిరంగ చర్చలు అంతర్గతమేనా…?

ఎంతసేపు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడమే గానీ, కూర్చొని మాట్లాడొచ్చనే విషయం పూర్తిగా మరిచిపోయారు. దేనికైనా సిద్ధం అని ఒకరంటే, దమ్ముంటే నా సవాల్​ స్వీకరించాలని మరొకరు, నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఇంకొకరు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. విచిత్ర మైన పరిస్థితి ఏంటంటే సవాళ్లు విసురుకునే క్రమంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రకటించడమే కానీ, ఆ చర్చా ఉండదు, ఆ దిశగా మాట్లాడుకునే ప్రయత్నాలూ చేయరు. ఎంతైనా నాయకులంతా ఒక్కతాను ముక్కలే.

ప్రజల ముందు ప్రగల్బాలు తప్ప వాస్తవానికి వారంతా ఒక్కటే అనే అర్థం వచ్చేలా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఎవరి లోపాలు వారికి తెలుసు, ఎవరెవరు ప్రజలకు ఏమేమీ చేశారో వాళ్లకు తెలుసు. వాళ్లు కూర్చోని మాట్లాడుకోకపోవడానికి ప్రధాన కారణం ఎవరి పాలనలో వాళ్లు ప్రజలకు ఒరగబెట్టేది ఏమీ లేదనే వాస్తవం. మొత్తంగా నీ విషయాలు నేను బయటపెట్టను, నా విషయాలు నువ్వు బయటపెట్టొద్దు. మధ్యలో ప్రజల్ని మాత్రం వెర్రివాళ్లని చేద్దాం అనే తీరుగా తమ వ్యవహారం కానిస్తున్నారు నాయకులు.



Next Story

Most Viewed