దరఖాస్తు దశలోనే అడ్డగోలు దందా

by  |
దరఖాస్తు దశలోనే అడ్డగోలు దందా
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పునాది పడలేదు.. గోడలు లేవలేదు.. ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు.. మంజూరు దశలోనే అధికార పార్టీ నేతలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకన్న వారి అవసరాన్ని కొంతమంది నాయకులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మంజూరు దశలోనే వసూళ్లకు పాల్పడుతుండగా.. పట్టణాల్లో కొందరు కౌన్సిలర్లు నిర్మాణ దశలో ఉన్న ఇండ్లు చూపి దందా చేస్తున్నారు. వసూళ్ల వ్యవహారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హెచ్చరికలతో కాస్తా అడ్డుకట్ట పడినట్లు తెలుస్తోంది.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాగనాయిపేట్, బంగల్పేట్‌లో 1,460 ఇండ్లు మంజూరుకాగా.. ఇందులో ఇప్పటికే 652 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. 548 ఇండ్లు ప్లాస్టరింగ్ దశలో, 240 ఇండ్లు గోడలు పూర్తవగా.. మరో 20 ఇండ్లు రూఫ్ లెవల్​లో ఉన్నాయి. 1,460 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం 10,526 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు 5,019మంది అర్హులుగా గుర్తించారు. వీరిని వార్డు సభలు పెట్టి ఎంపిక చేయాల్సి ఉంది. ఈ దశలోనే కొందరు కౌన్సిలర్లు అక్రమంగా వసూళ్లకు తెరలేపారు. ఒక్కో ఇంటికి రూ.50వేల నుంచి రూ.లక్ష వసూలు చేశారు. విషయం కాస్తా మంత్రి అల్లోల వద్దకు చేరడంతో ఆయన హెచ్చరికలతో కాస్తా అడ్డుకట్ట పడింది.

ముధోల్ నియోజక వర్గం తానూరు మండలంలో అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధికి అన్నీ తానేనని చెప్పుకునే ఓ నాయకుడు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని నమ్మించి.. కొందరి భూములను బ్యాంకుల్లో తనఖా (మార్జిగేజ్) పెట్టి రుణాలు పొందారు. ఏళ్లు గడిచినా డబుల్ బెడ్రూం ఇండ్లు రాకపోగా.. చివరికి కొందరు సొంత ఇల్లు కూడా నిర్మించేసుకున్నారు. ప్రస్తుతం తమ భూములు విడిపించాలని సదరు నాయకుడి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇక్కడ సర్కారు భూమి లేకపోవడంతో.. ఇండ్లు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పేదల సొంతింటి కల నెరవేరడం లేదు.

ముందే వసూళ్లు..

కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో కొందరు నుంచి ముందే రూ.లక్ష చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులతో భూములు కొనుగోలు చేస్తుండగా.. తీరా లబ్ధిదారుల ఎంపిక సమయంలో వివాదానికి దారి తీస్తోంది. వీరిలో కొందరు అర్హులు కాకపోగా.. అసలైన అర్హులైన తమకు ఎందుకు ఇవ్వరని ఆందోళనకు దిగుతున్నారు. సోన్ మండలంలోని ఓ గ్రామంలో ఈ పంచాయతీ తారాస్థాయికి చేరింది. చాలా గ్రామాల్లో ఇండ్లు మంజూరై టెండర్లు పిలిచినా.. భూములు లేక, కాంట్రాక్టర్లు రాక పనులు మాత్రం కావడం లేదు. దీంతో పేద ప్రజలకు ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు..

కాసులు కురిపిస్తున్న 'డబుల్'​ ఇళ్లు

పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల గదుల పథకం అధికార పార్టీ నాయకులు, కింది స్థాయిలోని ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిరుస్తోంది. పేదల అవసరాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నిర్మల్ జిల్లాకు మొత్తం 6,686 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 3,426 ఇండ్లు రూరల్​కు, 3,260 ఇండ్లు అర్బన్​కు మంజూరయ్యాయి. వీటిలో 96 స్థలాలను గుర్తించి.. 5641ఇండ్లకు పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో 3176 ఇండ్లకు టెండర్లు ఫైనల్ చేయగా.. మరో 2465 ఇండ్లకు టెండర్లు నిర్వహించాల్సి ఉంది. నిర్మల్ నియోజకవర్గంలో 1045 ఇండ్లకు స్థలం లేకపోవడంతో పరిపాలన అనుమతులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రభుత్వం టెండర్లు పిలిచి.. కాంట్రాక్టరుతో నిర్మించి ఇస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.05లక్షల నుంచి రూ.5.25లక్షల మేర ఇస్తున్నాయి.

ఇండ్ల కోసం నాయకుల చుట్టూ..

డబుల్ బెడ్రూం పథకంలో ఇండ్ల కోసం పేదలు నాయకుల చుట్టు తిరుగుతున్నారు. ఇదే అదనుగా తీసుకున్న కొందరు సర్పంచులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో ఇంటికి రూ.50వేల నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నారు. రూ.5లక్షల నుంచి రూ.6లక్షల విలువైన ఇల్లు, ఉచిత స్థలం వస్తుండడంత లబ్ధిదారులు అప్పులు చేసి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు వసూళ్ల దందాకు పాల్పడగా.. పట్టణాల్లో కొందరు కౌన్సిలర్లు వసూళ్ల పర్వం మొదలు పెట్టారు. ప్రభుత్వం సొంత స్థలం ఉన్నవారికి రూ.5లక్షలు ఇల్లు కట్టుకునేందుకు ఇస్తామని సర్కారు పేర్కొనగా.. జీవో రావాల్సి ఉంది. ఇదే అదనుగా తీసుకుని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇల్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి.. డబ్బుల వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం కొసమెరుపు.


Next Story