పాలకుర్తిలో కబ్జాల పర్వం

62

దిశ, పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో భూ కబ్జాలు ఆగడం లేదు. నియోజకవర్గం రోజురోజుకు వాణిజ్యపరంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. అదే స్థాయిలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. బడిగుడి అని తేడా లేకుండా భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని కనబడిన చోటా కబ్జా చేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా తీసిన రోడ్లను సైతం వదలకుండా కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ఇనాం, దేవాలయ, గ్రామ కంఠం భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి.

ప్రభుత్వ భూమి..

పాలకుర్తి నుంచి తొర్రూర్ మెయిన్ రోడ్‌లో ఉన్న సర్వే నెంబర్ 6 ఎకరాల 35 గుంటల ప్రభుత్వ భూమిని 1972లో దళితకాలనీకి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 5 ఎకరాల 5 గుంటల్లో 54 గృహ నిర్మాణాలకు పంపిణీ చేసింది. మిగిలిన ఎకరంలో ప్రభుత్వ పాఠశాల, ఎంఈఓ కార్యాలయం నిర్మించారు. 30 గుంటల భూమిని తప్పుడు కాగితాలు సృష్టించి కబ్జా చేశారు. ఇదే సర్వే నంబర్‌లో పదిగుంటల భూమిలో దశాబ్దాలుగా ఉన్న పోచమ్మ గుడిని సైతం కబ్జాదారలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొండ్రాయి మొయిన్ రోడ్ కు సర్వే నెంబర్500లో ఎర్రమల్లయ్య కుంట 13 ఎకరాల 29 గుంటల ప్రభుత్వ
భూమిలో 3 ఎకరాల్లో కుల వృత్తి దారులకు ఇండ్లను ప్రభుత్వం కట్టించింది. మొయిన్ రోడ్ కు ఉన్న భూమి అక్రమ దారులు అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో కోట్టాది రూపాయల భూములు కబ్జాలో కురుకుపోయాయి. వందల ఏళ్లుగా నడిచిన పానాదిని సైతం కబ్జా చేశారు.

రోడ్లను మూసేసి..

రోడ్లను సైతం మూసివేసి ఫంక్షన్‌ హాల్స్ నిర్మించారు. సర్వే నెంబర్ 565లో పదుల ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. ఇండ్ల నిర్మాణ సాకుతో వ్యాపార కేంద్రాలను నిర్వహిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ రోడ్‌లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని కూల్చేసి కబ్జా చేశారు. గుట్టకు చెందిన భూముల్లో చాలా మంది అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నారు. ఓ ప్రజా ప్రతినిధి పట్టా భూమి సర్వేనంబర్ తో ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ భూములు ఏటా కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాలి

పాలకుర్తి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి.. భూములను స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ భూములను కాపాడకపోతే ప్రజలను ఏకం చేసి ఉద్యమం ఉధృతం చేస్తాం
– చిట్యాల సోమన్న, సీపీఎం మండల కార్యదర్శి

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం

393 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దళితులకు ఇండ్ల పట్టాలు కూడా పంపిణీ చేశాం. మిగిలన భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారు. దీనిని గుర్తించి బోర్డులను ఏర్పాటు చేశాం. 30 గుంటల భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది. ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చట్ట రీత్యా చర్యలు తప్పవు.
-కె.విజయభాస్కర్, తహసీల్ధార్ పాలకుర్తి