ఆ కబ్జాలకు అధికార పార్టీ అండ?

by  |
ఆ కబ్జాలకు అధికార పార్టీ అండ?
X

దిశ,మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల భూములను కబ్జాదారులు మింగేస్తున్నారు. అడ్డు, అదుపు లేకుండా ప్రభుత్వ భూములపై ఎగబడుతూ అందినకాడికి ఆక్రమిస్తున్నారు. భూ తగాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు రెవెన్యూ భూమిని తమ పేరిట పట్టా చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వందల ఎకరాల భూమిని రాత్రికి రాత్రే ఆక్రమించుకోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది.

రైతులు, గిరిజనలను ముందుంచి..

ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. కొందరు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని భూములను కాజేసే యత్నం చేస్తున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన తర్వాత కూడా కొందరు దళారులు భూములను ఆక్రమిస్తు న్నారు. ఇందు కోసం గ్రామాల్లో రైతులను పావులుగా వాడుకుంటున్నారు. భూములు పట్టా అవుతాయని, సాదాబైనామాలకు ప్రభుత్వం సమయం ఇచ్చిందని నమ్మిస్తూ.. వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. రెవెన్యూ పరిధిలో ఉన్న భూములలోని గుట్టలను తవ్వి, చెట్లను నరికేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో కబ్జాదారులు గిరిజనులను ముందు వరుసలో ఉంచి నకిలీ పత్రాల ద్వారా వందల ఎకరాల రెవెన్యూ భూమిని చదును చేస్తున్నారు. రాత్రికి రాత్రే పంట పొలాలుగా మారుస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

అధికార పార్టీ వారే అధికులు..

ఆక్రమణదారుల్లో అధికార పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులే అధికంగా ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు సర్కారు భూములకు ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు నమోదు చేసి అన్యాకాంతం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరి కొందరు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు పట్టాభూమి ఉన్నా దర్జాగా కబ్జా చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

రెవెన్యూ అండతోనే..

భూముల విలువలు పెరగడంతో భూ కబ్జాదారులు అమాంతం భూములపై ఎగబడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా భూములపై విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ బలంతో, రెవెన్యూ సహకారంతో అవలీలగా కబ్జాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. వరం అనే గ్రామంలో భూ కబ్జాదారులు భూములను అవలీలగా కబ్జా చేసి బిల్డింగులు కట్టారు. ప్రభుత్వ భూములు అని తెలిసినా ఏ అధికారులు నోరు మెదపడం లేదు. అధికార పార్టీ నాయకులు, భూకబ్జాదారులు,రెవెన్యూ అధికారులు ఇలా అందరూ ఒక్కటై ప్రభుత్వ భూములను పాలహరంగా భుజిస్తున్నారు.


Next Story