రాయలసీమను ఆపండి.. కృష్ణాబోర్డు ఆదేశం

by  |
రాయలసీమను ఆపండి.. కృష్ణాబోర్డు ఆదేశం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతలను వెంటనే ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు తప్పుబట్టింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ సభ్యుడు హరికేశ్‌ మీనా ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక గురువారం ఆదేశం పంపారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని హెచ్చరించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అక్రమంగా మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్దమైందని బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా వాటర్‌ బోర్డు ప్రతిస్పందిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఈ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిర్మించడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొంది. పునర్విభజన చట్టం సెక్షన్‌ 84, పేరా 7లోని నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ పరిపాలనా అనుమతులు జారీ చేసిందని బోర్డు తప్పుబట్టింది.

కొత్త ప్రాజెక్టులేమైనా ముందుగా వాటి సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించి, అపెక్స్‌ కమిటీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలైనా చట్టాన్నిఉల్లంఘంచడమే అవుతుందని బోర్డు పేర్కొన్నది. కాగా ఇప్పటికే ఏపీ రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంపై దూకుడుగా వ్యవహరిస్తోంది. టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్జీటీ తీర్పు ప్రకారం టెండర్లు, సాంకేతిక పనులు పూర్తి చేస్తున్నట్లు గతంలోనే బోర్డుకు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 3న టెండర్లను ఓపెన్ చేసి, 10న ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది. రాయలసీమ ఎత్తిపోతలపై అటు కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సీడబ్ల్యూసీ కూడా డీపీఆర్ ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. కానీ కేవలం ఎన్జీటీ తీర్పును ఆసరాగా చేసుకున్న ఏపీ రాయలసీమపై ముందుకు సాగుతోంది. వచ్చేనెల 11న ఏపీ వాదనలపై ఎన్జీటీ మరోసారి వాదనలు విననుంది. అయితే దీనిపై వాదించేందుకు ఏపీ ప్రభుత్వం 9 మంది న్యాయ నిపుణులను నియమించింది.



Next Story