చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ ఓ గంగిరెద్దు : కొడాలి నాని

by  |
Kodali Nani, Pawan Kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడంటూ విమర్శించారు. చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ ఓ గంగిరెద్దు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీని జనసేనలో లేదా జనసేనను టీడీపీలోనైనా విలీనం చేయాలన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీ అయినా బలహీన వర్గాలకు అండగా ఉంటుందని కానీ పవన్ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి అండగా ఉంటానంటున్నాడని విమర్శించారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై విరుచుకుపడ్డారు. 14ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, ఆయనో దద్దమ్మ అంటూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీడీపీని ప్రజలు ఆదరించలేదని.. బద్వేలు ఉపఎన్నిక నుంచి పారిపోయాడని మండిపడ్డారు. చంద్రబాబుకు తన కుటుంబ రాజకీయంపై బెంగపడిందని విమర్శించారు. చంద్రబాబుకు తనపైగానీ..లోకేశ్‌పై గానీ నమ్మకం లేదని ఆరోపించారు.

లోకేష్‌ సన్నాసి అని.. పార్టీని గట్టెక్కించలేడనే దత్తపుత్రుడు పవన్‌ వైపు చంద్రబాబు చూస్తున్నాడని మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో చంద్రబాబు, కొంతమంది సన్నాసులు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు చంద్రబాబుకే ఉంటాయని.. చంద్రబాబు హయాంలోనే ఉత్తరాంధ్ర నుంచి గంజాయి స్మగ్లింగ్‌ జరిగిందని మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు.

పీవీ నరసింహారావు హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటయ్యాయని.. వైఎస్సార్‌ హయాంలో డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీ రుణాలిచ్చి ప్రోత్సహించారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు వెన్నుపోటు పొడిచి, వారి వద్ద డబ్బులు దోచుకున్నాడని ధ్వజమెత్తారు. డ్వాక్రా సంఘాల చరిత్రలో చంద్రబాబు ఓ మోసగాడిగా నిలిచిపోతాడని మంత్రి కొడాలి నాని శాపనార్థాలు పెట్టారు.

Next Story

Most Viewed