కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి !

by  |
కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో వరదలకు ప్రధాన కారణం ఆక్రమణలు, కబ్జాలు, అక్రమ నిర్మాణాలు అని వ్యాఖ్యానించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఇకపైన వీటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉక్కుపాదం మోపాలని సూచించారు. కుంటలు, చెరువులు, కాల్వలు, నాలాలు, నీటితావుల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, పర్యావరణ నిపుణులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాలని, ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలు, కబ్జాలపై తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇకపైన అలాంటివి పునరావృతం కాకుండా వ్యవహరించాల్సిన విధాన రూపకల్పనపై చర్చించాలని సూచించారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని వరద బాధిత ప్రాంతాల్లో గురువారం పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో ప్రతీ కుటుంబానికి బీజేపీ కార్యకర్తలు అండగా నిలవాలని, ప్రభుత్వ సాయానికి తోడుగా పార్టీపరంగా కూడా వీలైనంత సాయం చేయాలని కోరారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందని, ఇందుకోసం వారు ఆయా స్థాయిలో కృషి చేయాలన్నారు. సికింద్రాబాద్, సనత్‌నగర్, నాంపల్లి, అంబర్‌పేట తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. తార్నాక, మెట్టుగూడ డివిజన్లలోని మాణికేశ్వర్ నగర్, అలుగడ్డ బావి ప్రాంతాలను సందర్శించి త్వరలోనే ఉపశమనం కలిగిస్తామని హామీ ఇచ్చారు.

కరోనా పరిస్థితుల్లోనూ పండుగలు, సంప్రదాయాలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, అందరూ సంతోషంగా, సురక్షితంగా దసరా నవరాత్రులు జరుపుకోవాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో స్వీయజాగ్రత్త చాలా అవసరమన్నారు. ప్రతీ సంవత్సరం అంబర్‌పేటలో జరుపుకునే బతుకమ్మ ఉత్సవాల కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తుంటానని, కానీ ఈసారి సోషల్ డిస్టెన్స్ నిబంధన, పరిశుభ్రత ప్రోటోకాల్‌లు అమలులో ఉన్నందున జరుపుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed