ఆ ఇద్దరిని హతమార్చింది కిల్లర్ క్యాట్ కాదా..?

by  |
ఆ ఇద్దరిని హతమార్చింది కిల్లర్ క్యాట్ కాదా..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కొమురం భీం జిల్లాలో జరుగుతున్న వరస పులి దాడులతో గిరిజనులు వణికిపోతున్నారు. మనిషి రక్తం మరిగిన పులి.. అదును చూసి హతమార్చుతోంది. ఇలా మొన్న దిగుట… నిన్న కొండపల్లిలో దాడి చేసి ఇద్దరిని బలిగొన్నది. ఇక్కడ మృత్యువాత పడ్డ ఇద్దరు కూడా మైనర్లే. అయితే ఈ ఇద్దరిని హతమర్చింది ఒకే పులినా.. లేక రెండా..? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదివాసీల్లో ఆందోళన

కొమురం భీం జిల్లా దహేగావ్ మండలం దిగుట గ్రామ అటవీ ప్రాంతంలో జరిగిన పులి దాడిలో డిగ్రీ విద్యార్థి మృతి చెందగా… ఆదివారం ఇదే జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలో పులి దాడి కేసులో 14 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. ఈ రెండు సంఘటనలు ఇప్పుడు ఆసిఫాబాద్ అభయారణ్యంలో విస్తరించి ఉన్న గిరిజన పల్లెలు ఉలిక్కి పడుతున్నాయి. ఈ ప్రాంతంలో కొంతకాలంగా సంచరిస్తున్న కిల్లర్ క్యాట్ (మ్యాన్ ఈటర్) ఈ రెండు దాడులకు కారణం అని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై అటవీ శాఖ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. తమల్ని తప్పుదోవ పట్టించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తప్పుదోవ పట్టిస్తున్నారా..?

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో రెండు చోట్ల పులి దాడి చేసి ఇద్దరిని హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దాడి చేసింది రెండు వేర్వేరు పెద్ద పులులని అధికారులు చెబుతుండడం గిరిజనుల్లో భిన్నాభిప్రాయాలు వెలుబడుతున్నాయి. రెండో ఫులి కిల్లర్ క్యాట్ పులి జాతి కాదని అధికారులు పేర్కొంటున్నారని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు. రెండు చోట్ల సంచరించిన పులి అడుగుల ముద్రలను సేకరిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆ అడుగు జాడలనుబట్టి దాడులకు పాల్పడిన పులి ఒకటి కాదని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఒకే పులి సంచారం లేదని… ఎవరూ ఆందోళన చెందవద్దని అటవీ అధికారులు గిరిజనుల్లో ధైర్యం నింపేయత్నం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. మరోవైపు పులుల సంఖ్య పెరిగిందని చెప్పేందుకు కూడా అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా రెండు వరుస ఘటనలతో ఆసిఫాబాద్ అభయారణ్యం ప్రాంతంలోని గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.


Next Story

Most Viewed